Baby Crying: చంటి పిల్లల ఏడుపుకు ఆకలి ఒక్కటే కారణం కాదు, వీటి వల్ల కూడా ఏడవవచ్చు, జాగ్రత్తలు తీసుకోండి
Baby Crying: చంటి పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తారని అనుకుంటారు. కానీ వారికి ఏడుపుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏడ్చినప్పుడల్లా పాలు పెట్టడమే కాదు, ఇతర ఇబ్బందులు ఉన్నాయేమో కూడా చూసుకోండి.
నెలల పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ప్రతి అవసరాన్ని తల్లే అర్థం చేసుకుని ఆ అవసరాన్ని తీర్చాలి. పసికందులు సాధారణంగా రోజుకు రెండు నుండి మూడు గంటలు ఏడుస్తారు. చాలా సందర్భాలలో, పిల్లలు ఏడుపుకు ఆకలి అతిపెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. కానీ పిల్లలు కేవలం ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఏడవరు? పిల్లలు ఏడుపుకు అనేక ఇతర కారణాలు ఉన్నాయి. చిన్న పిల్లలు ప్రతి విషయాన్ని ఏడుపుతోనే తల్లికి చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వారికి తెలిసిన భాష ఏడుపు మాత్రమే. కాబట్టి వారి ఏడుపుకు కారణం ఏంటో ప్రతి తల్లీ అర్థం చేసుకోవాలి.
ఆకలి వల్ల పిల్లలు ఏడుస్తారు. పాలు తాగిన తర్వాత సైలెంట్ అయిపోతారు. పుట్టిన తరువాత, శిశువు మూడు నెలల పాటు ప్రతి గంటకు ఆకలిగా అనిపిస్తుంది. తక్కువ స్వరంతో ఏడవడం ద్వారా వారు పాలు కావాలని మీకు సూచిస్తారు. కేవలం ఆకలి వల్లే కాదు ఇతర కారణాలు వల్ల కూడా వారికి ఏడుపు వస్తుంది. పొట్టలో పాలు ఉన్నప్పటికీ వారు ఏడుస్తుంటే ఇతర కారణాలు ఏమున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.
తడి డైపర్
చంటి పిల్లలకు తడి డైపర్లు చికాకుగా ఉంటాయి.దాని వల్ల వారు అసౌకర్యంగా భావించి ఏడవడం ప్రారంభిస్తారు. పిల్లలు ఏడస్తున్నప్పుడు డైపర్లు కూడా చెక్ చేయడం మర్చిపోవద్దు. పిల్లల డైపర్ తెరిచి, అది తడిగా ఉందో లేదో తనిఖీ చేయండి. డైపర్ తడిగా ఉంటే వెంటనే మార్చండి.
ఓవర్ ఫీడింగ్
చాలాసార్లు పిల్లలు తెలిసో తెలియకో అతిగా పాలు తాగేస్తారు. దీంతో పొట్ట అసౌకర్యంగా మారి ఏడవడం ప్రారంభిస్తారు. దీని వల్ల వారి కడుపు ఉబ్బి అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు మీరు పిల్లలకు దగ్గరగా ఉండి వారికి సపోర్ట్ ఇవ్వాలి. తాగిన పాలు వాంతి చేసుకున్నా కంగారు పడకండి. దీని వల్ల వారి పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.
దుస్తులతో అసౌకర్యం
వాతావరణానికి అనుగుణంగా పిల్లలకు దుస్తులు వేయాలి. ఒక్కోసారి వారు వేసుకునే దుస్తులు వారికి ఇబ్బందిగా మారుతాయి. దీని వల్ల పిల్లలు ఏడవడం మొదలుపెడతారు. అంతేకాకుండా బిగుతైన దుస్తులు ధరించడం వల్ల పిల్లలు అసౌకర్యానికి గురై బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తారు. చంటి పిల్లలకు వదులుగా ఉండే దుస్తులే వేసేందుకు ప్రయత్నించండి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వేసుకున్న దుస్తుల్లో వారికి గాలి తగులుతుందో లేదో కూడా చెక్ చేయండి.
రాత్రి పూట పిల్లలు నిద్రపోకుండా ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకంటే నాలుగు నెలల వయసు వరకు వారి సిర్కాడియన్ రిథమ్స్ సెట్ కాదు. అంటే ఏ సమయంలో నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి లాంటి విషయాలు. అంతవరకు తల్లి ఓపికగా ఉండాలి. నాలుగు నెలల వయసు తరువాత వారి నిద్రసమయాలు ఫిక్స్ అవుతాయి.
టాపిక్