Pooja | ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలో మీకు తెలుసా?-to which god to offer prayers on which day in a week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pooja | ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలో మీకు తెలుసా?

Pooja | ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలో మీకు తెలుసా?

Himabindu Ponnaganti HT Telugu
Dec 20, 2021 11:58 AM IST

పూజలు అందరూ చేస్తారు. కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి? ఎలా చేయాలి? అలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి కూడా వివరించారు. మరి ఆ పూజలేంటో, ఎలా చేస్తారో మీరూ తెలుసుకోండి.

ఏ రోజు ఏ దేవుడ్ని ఎలా పూజించాలి?
ఏ రోజు ఏ దేవుడ్ని ఎలా పూజించాలి? (pixabay)

వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా. ఇందులో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్య ఫలం లభిస్తుంది. ఈ పూజల గురించి శివపురాణంలోని 14వ అధ్యాయంలో కూడా వివరించారు.

ఆదివారం

ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆ రోజు సూర్య దేవుడ్ని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్వఘ్నంగా సాగుతుంది. సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యము సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆదివారం పండితులను సత్కరించడం, ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల కంటి రోగాలు, దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

సోమవారం

చంద్రునికి సంబంధించిన వారం సోమవారం. అందుకే శివునికి ఎంతో ప్రీతికరం. సోమవారం శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీ దేవికి కూడా ఇష్టమైన వారం. లక్ష్మీ దేవికి అభిషేకం, కుంకుమార్చన చేస్తే మంచిది. విష్ణు లేదా వైష్ణవ సంప్రదాయం పాటించే వారు వేంకటేశ్వరుడికి అభిషేకం, పుష్పార్చన చేస్తే విశేష ఫలితం. ఈ రోజు పండితులకు లేదా బ్రాహ్మణులకు నెయ్యితో వండిన పదార్థాలను ఇస్తే మంచిది.

మంగళవారం

ఆంజనేయ స్వామి, దుర్గామాతకు మంగళవారం ఇష్టమైన రోజు. వీరిద్దరినీ మంగళవారం పూజిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం మంగళవారం నాడు కాాళీ మాతను పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా వడ మాలను మంగళవారం వేసి పూజిస్తే భయాలు, రోగాలు పోతాయని భక్తుల నమ్మకం. మినుము, కంది, పెసర పప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెడితే మంచిది.

బుధవారం

వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు ఎర్రటి మందారాలతో బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే అయ్యప్పస్వామికి, విష్ణుమూర్తికి కూడా బుధవారం ఇష్టం. పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణు దేవునికి నివేదించి పూజ చేస్తే.. కుమారులు, మిత్రులు, భార్యకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం

వేంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, సాయిబాబాను గురువారం పూజించడం శ్రేయస్కరం. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్ట దైవానికి గురువారం పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. అలాగే వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం శుభకరం. అలాగే పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం

లక్ష్మీదేవికి, అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదే విధంగా తులసీ పూజ, గో పూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించాలి. ఈ రోజు పూజ తర్వాత పండితులకు భోజనం పెడితే మంచిది.

శనివారం

కలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. అదే విధంగా ఆంజనేయస్వామి, శని దేవతల ఆరాధన ఉత్తమం. కుదిరితే ఆంజనేయ స్వామి, శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రదక్షణలు చేస్తే దోషాలు పోతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్