Chanakya Niti On Business : మీరు మంచి వ్యాపారవేత్త కావాలంటే ఇలా చేయాలి
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో గొప్ప విషయాలను చెప్పాడు. మంచి వ్యాపారవేత్తగా మారాలంటే కొన్ని విషయాలను పాటించాలని తెలిపాడు.
చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, గొప్ప వ్యూహకర్త. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. చాణక్య నీతిలోని సూచనలు, సలహాలను స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలలో గొప్ప పండితుడు. ఆయన మానవ జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. వీటిని పాటించడం ద్వారా మనిషి మంచి జీవితాన్ని గడపవచ్చు. జీవితంలో విజయానికి సంబంధించి చాణక్యుడు చాలా సూచనలు ఇచ్చాడు. వ్యాపారం చేసే వ్యక్తులు ఎలాంటి విషయాలు పాటించాలో తెలిపాడు.
చాణక్యుడు వ్యాపారానికి సంబంధించి అనేక సలహాలు ఇచ్చాడు. ఒక వ్యక్తి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి చాణక్యుడు ఎలాంటి చిట్కాలు ఇచ్చాడో చూద్దాం..
రిస్క్ అవసరమే
వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే క్లిష్ట పరిస్థితుల నుంచి త్వరగా బయటపడవచ్చని ఆచార్య అన్నాడు. సరైన సమయంలో పెద్ద రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి మాత్రమే విజయవంతమైన వ్యాపారవేత్త అవుతాడు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యేందుకు కచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. పరిస్థితులను ఆధారంగా స్టెప్ వేయాలి.
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
ఆచార్య చాణక్యుడు గురువేకాదు కాదు విజయవంతమైన ఆర్థికవేత్త కూడా. వ్యాపారాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. విజయవంతమైన వ్యాపారవేత్త యొక్క ప్రధాన లక్షణం అతను అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చాణక్యుడు సూచించాడు. వ్యాపారవేత్త ఎటువంటి పరిస్థితుల్లోనైనా వ్యాపారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడే, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగినప్పుడే విజయవంతమవుతాడు.
ప్రవర్తన ముఖ్యమే
వ్యాపారవేత్తలకు సమర్థవంతమైన ప్రవర్తన చాలా ముఖ్యం. సమర్థవంతమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి వ్యాపార రంగంలో త్వరగా విజయం సాధిస్తాడు. అందుకని వ్యాపారం చేసేటపుడు మాటల విషయంలో జాగ్రత్త వహించి విషయాలను అర్థం చేసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలి. విషయాలను విని అర్థం చేసుకున్న తర్వాత స్పందించే వ్యక్తి వ్యాపారంలో కచ్చితంగా విజయం సాధిస్తాడు. విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి, మీరు మధురంగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి.
అంకితభావం కావాలి
చాణక్యుడి ప్రకారం, అంకిత భావం లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ వ్యాపారంలో సాధించలేడు. ఎందుకంటే జీవితంలో విజయం సాధించాలంటే అంకితభావం ఉండాలి. వ్యాపారంలో ఏదైనా విషయంపై కట్టుబడి ఉండాలి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే జీవితంలో కష్టాలు తప్పవు. దేవుడి ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయి.
క్రమశిక్షణ ఉండాలి
క్రమశిక్షణ లేని వ్యక్తులు వ్యాపారంలో విజయం సాధించలేరు. అలాంటి వారు ఏది సాధించినా ఎక్కువ కాలం నిలవదు. విజయవంతం కావడానికి మీ పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుండా ఏ వ్యక్తి విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు.
అనుభవం అవసరం
జ్ఞానం ఏ వ్యక్తికైనా నిజమైన స్నేహితుడు. చాణక్యుడి ప్రకారం, అది పుస్తక జ్ఞానం లేదా ఏదైనా పని ద్వారా పొందిన జ్ఞానం ఎప్పుడూ వృథా కాదు. జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమని చాణక్యుడు చెప్పాడు.