Tips for brain health: ఈ టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ హెల్త్ పదిలం
Tips for brain health: బ్రెయిన్ హెల్త్ పాటించేందుకు వైద్య నిపుణులు ఈ టిప్స్ సూచిస్తున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌కు ప్రధాన కారణం ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడమే. మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు తమ రోజువారీ దినచర్యలను సక్రమంగా నిర్వర్తించలేరు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి కోల్పోవడం కారణంగా ఈ సమస్య ఎదురవుతుంది. భారత దేశంలో యువతలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా వైకల్యానికి గురవుతున్నారని, చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వీరిలో సుమారు 50 లక్షల మంది తమ ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నారు. ఈ తీవ్రమైన పరిస్థితికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలు కదపకుండా ఉండే నిశ్చలమైన (సెడెంటరీ) జీవన శైలి, తగిన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి.
అయితే బ్రెయిన్‌పై భారం తగ్గించుకుని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చిన్న చిన్న మార్పులతో ఒత్తిడి తగ్గించుకోండి: డాక్టర్ ఐశ్యర్యా రాజ్, క్లినికల్ సైకాలజిస్ట్
హెచ్‌టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ ఐశ్వర్యా రాజ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ‘ప్రతి రోజూ నిరంతరాయంగా హెల్తీ నిర్ణయాలు తీసుకోవడం నేటి ప్రపంచంలో సవాలుతో కూడుకున్న పని. ఒత్తిడిని తగ్గించుకునే పనిలో పడి మరింత ఒత్తిడి ఎదుర్కోవద్దు. ఒత్తిడిని ఎదుర్కునేందుకు రోజు వారీగా చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ పోతే సరిపోతుంది..’ అని వివరించారు.
‘మీ శారీరక కదలికలను పెంచండి. మీరు కూర్చునే భంగిమలు మార్చండి. మీ బ్రెయిన్ హెల్త్ పెంచుకునేందుకు తెలివైన ఆప్షన్స్ ఎంచుకోండి. మీ మెదుడును ఉత్తేజపరిచే చర్యలతో మీ ఆనందాన్ని పెంచుకోండి. అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బుద్ధిపూర్వకంగా జీవించండి. సమతుల్యత కాపాడుకోవడం, సాధ్యమైనంత ఆరోగ్యంగా జీవించడం వంటివి అసాధ్యం కాకపోయినా సవాలుగా మాత్రం ఉంటుందని గుర్తించడం మంచిది. అసలు ఆరోగ్యంగా ఉండడమంటే ఏంటో మీరు గుర్తిస్తే మీరు మీ జీవనశైలిని సుస్థిర మార్గాల్లో బాలెన్స్ చేయొచ్చు..’ అని డాక్టర్ ఐశ్వర్య వివరించారు.
మీ బ్రెయిన్ హెల్త్ మెరుగుపరుచుకోవడం చాలా సింపుల్: డాక్టర్ సంకల్ప్ సూర్య మోహన్, న్యూరాలజిస్ట్
గురుగ్రామ్‌లోని పరాస్ హాస్పిటల్స్‌లో సీనియర్ న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సంకల్ప్ సూర్య మోహన్ దీనిపై మాట్లాడారు. ‘మీరు సాయంకాలం హెల్తీ హోం మేడ్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కట్ ఫ్రూట్స్ తీసుకోండి. కల్తీ ఆహారం, ఫ్రైడ్ ఫుడ్ ఎలాంటి మేలు చేయవు. పైగా ఇవి దీర్ఘకాలంలో చెడు ప్రభావాలు కలిగిస్తాయి. శాచ్యురేటెడ్ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్టరాల్ తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం చాలా సమస్యలను తొలగిస్తాయి. బీఎంఐని అనుసరించి తక్కువ బరువు కలిగి ఉంటే, తగినంతగా నిద్ర ఉంటే మీ మెదడు ఆరోగ్యం బాగుంటుంది..’ అని వివరించారు.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇలా గుర్తించండి
‘ప్రస్తుత కాలంలో అధికమై ఒత్తిడి, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి చాలా తీవ్రమైన పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి, చుట్టూ ఉన్న సోషల్ సర్కిల్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కూడా మన తలలో నుంచి అనవసర విషయాలను పక్కకు నెట్టొచ్చు. ఇది మన మెదడు ఆరోగ్యకరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. స్ట్రోక్‌లో ప్రతి నిమిషం బ్రెయిన్‌లో కోట్లాది న్యూరాన్లు చనిపోతాయి. అందువల్లగా లక్షణాలను త్వరగా గుర్తించాలి. స్ట్రోక్ వస్తే సమీపంలో ఉన్న స్ట్రోక్ ట్రీట్మెంట్ గల హాస్పిటల్ సందర్శించాలి. లక్షణాలను బీఫాస్ట్(befast)గా వర్గీకరించాలి. బీ అంటే బాలెన్స్, ఈ అంటే కళ్లు, ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే చేతులు, ఎస్ అంటే స్పీచ్, టీ అంటే టైమ్.. వీటిలో తేడా ఉంటే మెదడు సంబంధిత స్ట్రోక్ లక్షణాలుగా గుర్తించాలి..’ అని డాక్టర్ సంకల్ప్ వివరించారు.
మీ మెదుడు ఆరోగ్యానికి టిప్స్
హైబీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్, హై కొలెస్టరాల్ వంటివి బ్రెయిన్‌ను ఎక్కువగా దెబ్బతీస్తాయి. మన దైనందిన జీవితం బాగుండడానికి మెదడు సక్రమ పనితీరు అవసరమని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతీ కపూర్ వివరించారు. మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు టిప్స్ సూచించారు.
- వీలైంత చురుగ్గా ఉండండి. ఏరోబిక్ ఫిట్‌నెస్ కారణంగా బ్రెయిన్ సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేస్తుంది. బ్రెయిన్ టిష్యూ పరిమాణాన్ని కాపాడుతుంది.
- మీ బరువును నియంత్రించండి: ఏఒబెసిటీ కారణంగా బ్రెయిన్‌పై ప్రభావం పడుతుంది. మల్టీపుల్ స్ల్కెరోసిస్ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది.
- మీ మనస్సు చురుగ్గా ఉంచుకోండి. చదవడం, హామీలు, కళాత్మకమైన, సృజనాత్మక పనులు మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
- స్మోకింగ్ మానేయండి: పొగ తాగడం వల్ల మీ బ్రెయిన్ పరిమాణం తగ్గుతుంది. అలాగే పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. మెదడు సంకేతాలకు మీరు చేస్తున్న పనికి పొంతన కుదరని పరిస్థితి ఏర్పడుతుంది.
- వైద్యులు సూచించిన ఇతర ఔషధాలను మరవకండి.