Foot Swelling: ప్రయాణంలో కాళ్ల వాపులా? ఇలా చేసి చూడండి..
Foot Swelling: కాస్త దూర ప్రయాణాలు చేస్తే చాలు కాళ్లు ఉబ్బిపోతున్నాయా? అయితే ప్రయాణ సమయంలో కొన్ని చిట్కాలు పాటించండి చాలు. ఈ సమస్య రానేరాదు.
కాళ్ల వాపులు తగ్గించే చిట్కాలు (pexels)
ఫ్లైట్లు, రైళ్లు, బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణాలు చేసేప్పుడు చాలా మందికి కాళ్లు ఉబ్బిపోతుంటాయి. దాదాపుగా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇలా అసలు ఎందుకు జరుగుతుందంటే.. ఎక్కువ సమయం ఒకే పొజిషన్‌లో కూర్చుని ఉండటం వల్ల కాలి నరాల్లో రక్త ప్రసరణ జరిగేప్పుడు ఒత్తిడి పెరిగిపోతుంది. దీని వల్ల రక్తంలో ఉండే ద్రవాలు ఆ చుట్టుపక్కల సున్నితంగా ఉన్న కణ జాలంలోకి వచ్చి చేరిపోతాయి. దీని వల్ల కాళ్ల వాపులు వస్తాయి. ఇవి అంత ప్రమాదకరం ఏమీ కాదు. రెండు, మూడు రోజుల్లో మళ్లీ కాళ్లు మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఒక వేళ తగ్గకుండా వాపులు పెరుగుతున్నట్లు అనిపిస్తే గనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మరి ప్రయాణంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు రానీయకుండా చూసుకోవచ్చు. అవేంటంటే..
కాళ్ల వాపులు రాకుండా జాగ్రత్తలు:
- ఫ్లైట్‌లోనో, బస్‌లోనూ కూర్చున్నప్పుడు అంత సేపు ఒకటే పొజిషన్‌లో కూర్చోకూడదు. కాసేపు కాళ్లు ముడుచుకుంటే, కాసేపు చాపుకోవాలి. కొంచెం సేపు వీలైతే కాళ్లు పైకి పెట్టుకుని మడత వేసుకుని కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణలో ఒత్తిడి ఎదురు కాదు.
- గంటకోసారైనా విరామం తీసుకోవాలి. కూర్చున్న చోటు నుంచి లేచి వాష్ రూంకైనా వెళ్లి వస్తూ ఉండాలి. ఓసారి ఒళ్లు విరుచుకోవాలి. దీని వల్ల కాళ్లు అలాగే ఉండిపోకుండా కాస్త రిలాక్స్ అవుతాయి.
- అరగంటకోసారైనా కాళ్లు, కాళ్ల మడమల్ని అటూ ఇటూ తిప్పుడూ, సాగదీస్తూ ఉండాలి. చిన్నపాటి ఎక్సర్‌సైజు ల్లాంటివి చేయాలి.
- ప్రయాణంలో ఒదులుగా ఉండే దుస్తుల్ని వేసుకునేందుకు ప్రయత్నించాలి. బిగుతుగా ఉండే వాటిని ధరించడం వల్ల రక్త ప్రసారం మెరుగ్గా జరగదు.
- అలాగే కూర్చున్నప్పుడు చాలా మందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. ప్రయాణంలో మాత్రం ఇలా చేయకపోవడమే ఉత్తమం. దీని వల్ల రక్త సరఫరా మరింత ఒత్తిడితో జరుగుతుంది. దీని వల్ల సమస్య ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
- ఫ్లైట్లలో, రైళ్లలో వాష్ రూం సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటిని తాగండి. వీలైతే పండ్ల రసాలను తీసుకోవడానికి ప్రయత్నించండి. దీని వల్ల డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. వాష్ రూంకి వెళ్లి రావడమూ చిన్న పాటి వ్యాయామంలా ఉంటుంది.
- మద్యపానం, మత్తు కలిగించే పదార్థాలను తినడం, తాగడం ప్రయాణంలో చేయవద్దు. ఇలా చేయడం వల్ల కూర్చున్న చోటే అలా నిద్రపోతారు. కదలిక లేకుండా అయిపోతుంది. దీంతో కాళ్ల వాపుల సమస్యలు ఎక్కువ అవుతాయి.
టాపిక్