Heart health in winter: చలికాలం ఉదయం నడకలో గుండె పోటు నుంచి కాపాడుకోండిలా-tips to prevent heart attack during early morning walk in winters ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Health In Winter: చలికాలం ఉదయం నడకలో గుండె పోటు నుంచి కాపాడుకోండిలా

Heart health in winter: చలికాలం ఉదయం నడకలో గుండె పోటు నుంచి కాపాడుకోండిలా

Parmita Uniyal HT Telugu
Dec 28, 2022 03:30 AM IST

Heart health in winter: గుండెపోట్లు సంభవించేది ఎక్కువగా చలికాలంలోనే. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోండి.

చలికాలంలో ఉదయపు నడకలో జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్య నిపుణులు
చలికాలంలో ఉదయపు నడకలో జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్య నిపుణులు (Pixabay)

చాలా వరకు గుండెపోటు తెల్లవారుజామున 4 గంటల నుండి 10 గంటల వరకు సంభవిస్తాయని పరిశోధకులు చెబుతుంటారు. ఈ సమయంలో ఎపినెఫ్రిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, కార్టిసాల్ వంటి కొన్ని హార్మోన్ల స్రావం పెరుగుతుందని, ఇది ఆక్సిజన్ డిమాండ్, రక్తపోటు పెరుగుదలను ప్రేరేపిస్తుందని చెబుతారు. అలాగే ఎండోథెలియల్ ప్రొజెనిటర్ కణాల స్థాయి తగ్గడం కూడా గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

అయితే చలికాలం ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే చలి అధిక-రిస్క్ ఉన్న వ్యక్తుల గుండె ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీస్తుంది. అంటే రక్తపోటు, మధుమేహం లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిపై పెను ప్రభావం చూపుతుంది. ఇలాంటివారు ఉదయాన్నే వర్కవుట్‌లు లేదా వాకింగ్‌లకు దూరంగా ఉండాలని, ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లినా చెవులు, ఛాతీ, కాళ్లు, తల బాగా కప్పి ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

‘నిద్ర లేచే వేళల్లో, చలికాలంలో ఉండే చల్లని వాతావరణం కారణంగా గుండెపోట్లు వస్తాయని మనందరికీ తెలుసు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. గుండె జబ్బుల ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు శీతాకాలంలో ఉదయాన్నే నడకకు, వ్యాయామాలకు వెళ్లడం మంచిది కాదు’ అని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జరీ డైరెక్టర్, హెడ్ డాక్టర్ ఉద్గీత్ ధీర్ హెచ్‌టీ డిజిటల్‌తో జరిపిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

మార్నింగ్ వాక్‌తో చలికాలంలో రిస్క్ ఎందుకు ఎక్కువ?

‘చలికాలంలో శరీరం వేడిని కాపాడుకోవడం కోసం జీవక్రియను పెంచే ప్రయత్నం చేస్తుంది. శరీరం హైపర్యాక్టివ్ మూమెంట్‌లో ఉంటుంది. మనం ఉదయాన్నే నడకకు వెళ్లవలసి వస్తే, తెల్లవారుజామున చలి నుండి మనల్ని రక్షించుకోవాలి. మనం తల, చెవులు, చేతులు, మన కాలి వేళ్లు కవర్ చేసుకోవాలి. మీ ఛాతీ ప్రాంతం తగినంత వెచ్చగా ఉండాలి. వార్మప్ లేకుండా వ్యాయామం ప్రారంభించకూడదు. శీతాకాలంలో ఇది చాలా కీలకం. సరైన వార్మప్ లేకుండా వ్యాయామం చేయడం ముప్పే. అధిక రిస్క్ ఉన్నవారికి శీతాకాలంలో గుండెపోటు, స్ట్రోక్‌ వస్తాయి’ అని డాక్టర్ ధీర్ చెప్పారు.

‘చలికాలం ఉదయం వేళ కార్డియోవాస్కులర్ పరిస్థితుల రిస్క్ పెరుగుతుంది. ఈ కాలంలో బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. దీని కారణంగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. గుండె పంప్ చేసేందుకు రక్తం ఎక్కువ అవసరం అవుతుంది. ఇది గుండె బలహీనంగా ఉన్న వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. వాతావరణ పరిస్థితిని మనం మార్చలేం. కానీ సమస్యను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని పరాస్ హాస్పిటల్ వైస్ ఛైర్మన్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మంజిందర్ సంధు అన్నారు.

కాలుష్యం, చలి.. రెండూ కలిసే డేంజర్

‘చలికాలానికి కాలుష్యంతోడైతే ప్రమాద ఘంటికలు మోగినట్టే. ఈ వాతావరణం ఊపిరితిత్తులు, గుండెకు మంచిది కాదు. మనం పీల్చే కలుషిత గాలి వల్ల లంగ్స్‌పై, గుండెపై అదనపు భారం పడుతుంది. ఇది ఆస్తమా, బ్రాంకైటిస్, స్మోకర్లు, ఇతర సున్నిత ఆరోగ్యవంతులపై ప్రభావం చూపుతుంది. వారి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.. అందువల్ల ఉదయం వేళ ఆరుబయట నడక వద్దు..’ అని డాక్టర్ ధీర్ చెప్పారు.

ఉదయం వేళ గుండె పోటు రాకుండా పాటించాల్సినవి: డాక్టర్ సంధు

  1. క్రమం తప్పకుండా బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. ఏవైనా లక్షణాలు కనిపించినప్పుడు మీ సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలి.
  2. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, ముఖ్యంగా తెల్లవారుజామున బయటకు వాకింగ్ కోసం వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే నిండుగా కవర్ చేసుకోండి.
  3. ఇన్‌డోర్ ఫిజికల్ యాక్టివిటీస్‌కు పరిమితమైతూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి.
  4. ఎక్కువగా శ్రమించకండి. ఇది గుండె పోట్లకు దారితీస్తుంది.
  5. కొవ్వు అధికంగా గల ఆహారం, వేపుళ్లు, మిఠాయిలను దూరం పెట్టండి.
  6. ఇప్పటికే మీరు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నట్టయితే సంబంధిత చికిత్సను నిర్లక్ష్యం చేయకండి.
  7. సొంత వైద్యం మానుకోండి. మెడికల్ షాప్ కౌంటర్‌లో లభించే మందులు ఏది పడితే అది వాడకండి. వైద్యుడి సిఫారస మేరకు మాత్రమే ఔషధాలు వాడండి.
  8. స్మోకింగ్ మానేయండి. మద్యం మానేయండి.

Whats_app_banner