Tips to Prevent Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? అయితే టిప్స్ మీకోసమే..-tips to prevent back pain with simple and easy tricks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Prevent Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? అయితే టిప్స్ మీకోసమే..

Tips to Prevent Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? అయితే టిప్స్ మీకోసమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 08, 2022 08:18 PM IST

Tips to Prevent Back Pain : వెన్ను నొప్పి అనేది చాలామందిలో సహజమైపోతుంది. ముఖ్యంగా ఆఫీస్ ఉద్యోగాలు చేసే వారిలో, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి.. వైద్యుని సలహాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

వెన్నునొప్పిని ఇలా తగ్గించుకోండి..
వెన్నునొప్పిని ఇలా తగ్గించుకోండి..

Tips to Prevent Back Pain : వెన్నునొప్పి అనేది వృద్ధాప్యంలో మాత్రమే వస్తుంది అనుకుంటే అది భ్రమనే అవుతుంది. ఎందుకంటే అది నిజం కాదు. మారుతున్న జీవనశైలి, అనారోగ్య అలవాట్లే వెన్ను నొప్పికి కారణమవుతున్నాయి. వెన్ను లేదా నడుము నొప్పి.. కాల్షియం, విటమిన్ లోపం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెన్నుపూస వ్యాధులు, కండరాలపై ఒత్తిడి, గర్భాశయంలో వాపు, రుతుక్రమంలో ఆటంకాలు, శరీర భంగిమలు వంటి మొదలైనవాటి వల్ల సంభవిస్తుంది.

కూర్చున్నా, వంగినా, తిరిగినా, బరువైన వస్తువులను ఎత్తినా బరువు అంతా వెన్నెముక కింది భాగంలోనే పడుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. ఇవి వెన్నెముకకు మద్దతు ఇచ్చే కండరాలు, కణజాలాలు, స్నాయువులపై పదేపదే ఒత్తిడిని కలిగిస్తాయి. దీన్ని నివారించడానికి మీరు ముందు వైద్యుని సంప్రదించాలి. అనంతరం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన భంగిమ

కుర్చీపై సౌకర్యవంతంగా, నిటారుగా కూర్చోండి. ప్రతి ఒకటి లేదా రెండు గంటలకు ఒకసారి కుర్చీ నుంచి లేచి అటు ఇటూ నడవండి. దీనివల్ల శరీరానికి ఎటువంటి ఒత్తిడి ఉండదు. కుదిరినప్పుడు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి.

నడక

టెక్నాలజీ జీవితంలో ప్రతిదీ చాలా సౌకర్యవంతంగా మారిపోయింది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను వస్తున్నాయి. ఆ సమస్యలను నివారించడానికి మీరు చురుకుగా ఉండటం ముఖ్యం. మీరు ఆఫీస్‌లో ఉన్నట్లయితే టెక్స్ట్ పంపినా లేదా కాల్ చేసినా మీ సహోద్యోగి డెస్క్‌కి వెళ్లే ప్రయత్నం చేయండి. దీని ద్వారా కాస్తో.. కూస్తో మీ శరీరానికి కాస్త వ్యాయామం దొరుకుతుంది. నేరుగా కమ్యూనికేట్ చేస్తే.. మీ సహోద్యోగులతో సంబంధాలు కూడా బలపడతాయి.

బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త

బరువులు ఎత్తేటప్పుడు పూర్తిగా కూర్చోవద్దు. బరువైన వస్తువు మీ శరీరానికి దగ్గరగా రావడానికి అనుమతించండి. అప్పుడు మాత్రమే దానిని ఎత్తండి. అలాగే వస్తువు మొత్తం బరువును శరీరంలోని ఒక భాగంపై వేయకండి.

ఆహారపు అలవాట్లు

సరైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన బరువును అందించడంలో సహాయపడతాయి. దీనివల్ల శరీరంపై అదనపు ఒత్తిడి తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను రాకుండా చేస్తుంది.

నిద్రించడానికి సరైన మార్గం

మీ నిద్ర విధానంలో కొన్ని మార్పులు చేయడం వల్ల.. మీ వీపుపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అయితే నిద్రించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. పడుకున్నప్పుడు మీ కాళ్ల మధ్య దిండు పెట్టి పడుకోండి.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి.. వెన్ను/వెన్నెముక సమస్యను పెంచుతుంది. కాబట్టి ధ్యానం, లోతైన శ్వాస తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం

యోగా లేదా ఏదైనా రకమైన వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి శారీరక భంగిమను పొందాలనుకునేవారికి ఇది చాలా సహాయం చేస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం