fitness: రోజూ వ్యాయామం చేయడం బోర్ కొడుతోందా? కత్రినా ట్రైనర్ చెప్పిన చిట్కాలివే..
fitness: దీపికా పదుకొణే , కత్రినా కైఫ్‌ల ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా.. వ్యాయామాన్ని ఆస్వాదిస్తూ, ఎక్కువ ఫలితాలు వచ్చేలా ఎలా చేయాలో కొన్ని చిట్కాలు తెలిపారు.
రోజూ ఒకేరకమైన ఫిట్‌నెస్ రొటీన్ ఉండటం వల్ల బోరింగ్ గా అనిపిస్తుంది. రోజూ కాస్త ఆసక్తికరంగా, సరదాగా చేసేలా ఉంటే వ్యాయామం చేయాలనే కోరిక పెరుగుతుంది. HT లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాస్మిన్ కరాచివాలా కొన్ని ఆసక్తికరమైన చిట్కాలు చెప్పారు. ఈయన దీపికా పదుకొణే, కత్రినాకైఫ్ ల ఫిట్‌నెస్ ట్రైనర్.
కసరత్తుకి ముందు గుప్పెడు బాదాం:
వర్క్అవుట్ చేసే ముందు తీసుకోడానికి బాదాం పప్పు పోషకభరితమైన స్నాక్. ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రొటీన్, పీచు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి వర్కవుట్ చేయడానికి కావాల్సిన శక్తినిస్తాయి. బాదాంతో పాటే ఏదైనా పండుకూడా తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు రెండూ అందుతాయి. తాజాగా చేసిన న్యూట్రీషన్ పరిశోధన ప్రకారం బాదాం తినడం వల్ల వ్యాయామం చేసిన తరువాత అలసటగా అనిపించదని, ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని తేలింది. అందుకే వర్కవుట్ మొదలెట్టే ముందు గుప్పెడు బాదాం తినడం అలవాటు చేసుకోండి.
కొత్త రకం కసరత్తులు:
ఒకేరకం కాకుండా మీకు రొటీన్ గా అనిపించినపుడు వేరే వర్కవుట్ క్లాస్ కి మారొచ్చు. అంటే డ్యాన్స్ క్లాసెస్, యోగాసనాలు, బాక్సింగ్.. ఇలా చాలా ఉన్నాయి. దీనివల్ల చాలా లాభాలుంటాయి. ఒక కొత్త అలవాటు నేర్చుకుంటారు. సరదాగా కూడా ఉంటుంది. ఒక్కరికే వెల్లడం మీకు ఆసక్తిగా అనిపించకపోతే మీ స్నేహితులతో కలిసి ఒక గ్రూపు లా వెళ్లండి. జుంబా డ్యాన్స్, ఏరోబిక్స్ లాంటివి గ్రూపుతో కలిసి చేయడం వల్ల కూడా ఇంకాస్త సరదాగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. మీకెప్పుడైనా వెళ్లాలని అనిపించకపోయినా మీ చుట్టూ ఉన్నవాళ్ల వల్ల మీరు కూడా క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తారు.
ఫంక్షనల్ ఫిట్‌నెస్:
మనం రోజూవారీ చేసే పనుల కోసం మన శరీరాన్ని సిద్దం చేయడమే ఫంక్షనల్ ఫిట్‌నెస్. జిమ్‌లో యాభై పుషప్స్ చేయగలిగే వాళ్లకు ఇంట్లో ఏదైనా బరువు ఎత్తడం కష్టంగా ఉండకూడదు కదా! అందుకే స్క్వాట్స్, లంజెస్, బరువులు ఎత్తడం లాంటివి చేయడం ద్వారా రోజూ వారీ పనుల్లో వస్తువులను ఎత్తడం, మోయడం, తోయడం, లాగడం.. ఇలాంటి వాటిలో మన శరీరం బలంగా, సులువుగా వంగగలిగేలా చేయడంలో సిద్దం అవుతుంది.
లక్ష్యం పెట్టుకోండి:
ప్రతిరోజూ మీరు చేస్తున్న కసరత్తులను గమనించడం, ట్రాకింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారో మీకర్థమవుతుంది. 5కిలో మీటర్లు పరిగెత్తే లక్ష్యమో, లేదా ఏదైనా కష్టమైన యోగాసనం నేర్చుకోవడమో, ఒక బరువును ఎత్తే విషయంలోనో.. ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే. మీకు మీరే మానసికంగా సిద్దమవుతారు.