how many almonds per day: రోజుకు ఎన్ని బాదాం గింజలు తినొచ్చు? నిపుణుల మాట ఇదీ-how many almonds per day know answers from ayurveda experts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How Many Almonds Per Day: రోజుకు ఎన్ని బాదాం గింజలు తినొచ్చు? నిపుణుల మాట ఇదీ

how many almonds per day: రోజుకు ఎన్ని బాదాం గింజలు తినొచ్చు? నిపుణుల మాట ఇదీ

HT Telugu Desk HT Telugu
Dec 19, 2022 03:00 PM IST

how many almonds per day: బాదాం గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోజుకు ఎన్ని తినాలన్న సందేహాలకు నిపుణులు ఇలా సమాధానం ఇస్తున్నారు.

బాదాం గింజలు ఎన్ని తినాలి?
బాదాం గింజలు ఎన్ని తినాలి? (Pinterest)

బాదాం అన్ని సీజన్లలోనూ సూపర్ ఫుడ్‌గా నిలుస్తోంది. తగిన పోషకాహారం అందడానికి బాదాం గింజలను మీ డైట్‌లో తరచుగా తీసుకోవాలి. డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు ఉన్న పేషెంట్లు తప్పక బాదాంలను తీసుకోవాలి. విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, కాపర్, రైబోఫ్లావిన్ తదితర విటమిన్లు, ఖనిజలవణాలకు బాదాం గింజలు పెట్టింది పేరు.

బాదాం గింజలను తినడం వల్ల గుండె జబ్బులు తగ్గడమే కాక బ్రెయిన్ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే బాదాం గింజలను రాత్రి నానబెట్టి ఉదయం పరగడపున తినాలి.

ఎన్ని బాదాం గింజలు తినాలి?

బాదాం గింజలు తింటే అనేక రోగాలు పారిపోతాయని మనకు తెలుసు. అయితే ఎన్ని తినాలన్న విషయంలో చాలా మంది గందరగోళపడుతుంటారు. రోజుకు 6, 8, 22.. ఇలా ఎన్ని తినాలన్న విషయంలో స్పష్టత లేక ఇబ్బందిపడుతుంటారు. అయితే అమెరికన్ డైటరీ మార్గదర్శకాల ప్రకారం రోజుకు ఒక ఔన్స్ (28.3 గ్రాములు) బాదాం గింజలు తినొచ్చు. అంటే దాదాపు 23 బాదాం గింజలు తినొచ్చు. అయితే చాలా మంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయక అరగవు. అలాంటి వారు 20 వరకు పరిమితం చేసుకోవడం మంచిది.

జీర్ణ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ ఈ పరిమాణం మారుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ డిక్సా భవ్‌సర్ ఇటీవల ఒక ఇన్‌స్టా పోస్టులో చెప్పారు. తొలుత నానబెట్టిన 2 బాదాం గింజలతో ప్రారంభించొచ్చని చెప్పారు. తరువాత క్రమంగా వాటిని పెంచుకోవచ్చని సూచించారు.

‘ఆల్మండ్స్, ఇతర నట్స్ జీర్ణం కావడం ఒకింత కష్టం. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. విటమిన్ ఈ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ ఉంటాయి. ఐరన్, పొటాషియం, జింక్, బి విటమిన్స్, నియాసిన్, థయామిన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి..’ అని ఆమె చెప్పారు.

BENEFITS OF SOAKED ALMONDS: నానబెట్టిన బాదాంలతో ప్రయోజనాలు

- మీరు ఎనర్జిటిక్‌గా ఉండేలా చేస్తుంది

- క్రేవింగ్స్ తగ్గిస్తుంది.

- పీరియడ్ క్రాంప్స్ తగ్గిస్తుంది.

- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

- మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

- చర్మం, జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది.

- బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తుంది. అంటే గుండెకు మేలు చేస్తుంది.

START WITH 2 ALMONDS: రెండింటితో ప్రారంభించండి

‘అందరికీ ఒకే పరిమాణం ఉండదు. మన జీర్ణ వ్యవస్థ సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందువల్ల మనం ఎన్ని బాదాం గింజలు తినాలన్న దానిపై మనకు స్పష్టత ఉండాలి. తొలుత 2 నానబెట్టిన బాదాం గింజలతో ప్రారంభించండి. ఇలా ఒక వారం పది రోజుల తరువాత అసౌకర్యం లేకుంటే ఐదుకు పెంచండి..’ అని డాక్టర్ వివరించారు. మూడు వారాల వరకు 5 చొప్పున తినండి. ఆ తరువాత కూడా జీర్ణానికి సౌకర్యంగా ఉంటే 10కి పెంచండి. కడుపు ఉబ్బరం, డయేరియా వంటివి లేకుంటే కొనసాగించండి. అలా 3 నెలల పాటు రోజుకు 10 నానెబెట్టిన బాదాం గింజలను తినండి. తరువాత క్రమంగా 12, ఆ తరువాత 15, ఆ తరువాత 18, ఆ తరువాత 20కి పెంచండి..’ అని డాక్టర్ భవ్‌సర్ వివరించారు.

‘సరైన జీర్ణ సామర్థ్యం ఉన్న వారు, రోజువారీ వ్యాయామం చేసే వారు, తగినంత నీరు తాగే వారు రోజుకు 20 బాదాంలు తినొచ్చు. అరిగించుకోగలిగితేనే తినండి. క్వాంటిటీ గురించి మరిచిపోండి..’ అని సూచించారు.

టాపిక్