Yoga Asanas for Good Posture : శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చాలంటే.. ఈ ఆసనాలు వేయాల్సిందే..
Yoga Asanas for Good Posture : శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మన కాన్ఫిడెంట్‌ని మరింత పెంచుతుంది. మనం నిలబడినా.. కూర్చున్న విధానం ఎదుటి వ్యక్తిపై మన గురించి ఓ బలమైన ముద్రవేస్తుంది. వీళ్లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? లేజీగా ఉన్నారా? అనే విషయాలు మన పోస్టర్లోనే తెలిసిపోతాయి.
Yoga Asanas for Good Posture : మన పోస్టర్ అంటే సినిమా పోస్టర్ అనుకునేరు. పోస్టర్ అంటే మనం కూర్చునే, నిల్చొనే విధానం. ఇది పర్ఫెక్ట్గా ఉండాలి. లేకుంటే.. మనపై వారు కొన్ని అభిప్రాయాలు క్రియేట్ చేస్తాయి. అది మంచిగా కావొచ్చు. చెడుగా కూడా కావొచ్చు. పోస్టర్ మంచిగా ఉంటే పర్లేదు. కానీ సరైన శరీర భంగిమ లేకుంటే.. ఎదుటివారి అభిప్రాయాలే కాదు.. మనలో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి.
అయితే శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి, మంచి శారీరక భంగిమను నిర్వహించడానికి యోగా ఉత్తమమైన మార్గం. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర భంగిమను మెరుగుపరచడానికి ఏయే ఆసనాలు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
శలభాసనం
ముందుగా పొట్ట మీద పడుకోండి. రెండు చేతులను మీ తొడ కింద ఉంచండి. ఊపిరి పీల్చుకుంటూ.. ముందుగా కుడి కాలుని కొన్ని సెకన్ల పాటు వంచకుండా నెమ్మదిగా పైకి లేపండి. దానిని అదే స్థితిలో ఉంచి.. ఎడమ కాలును కుడి కాలులా పైకి ఎత్తండి. ఆ సమయంలో మీ గడ్డం భూమికి అతుక్కొని ఉండాలని గుర్తుంచుకోండి. ఊపిరి పీల్చుకుంటూ మళ్లీ యథాస్థితికి రండి. మీ సామర్థ్యం ప్రకారం దీనిని పునరావృతం చేయవచ్చు.
మకరాసనం
పొట్టపై పడుకుని, చేతుల మోచేతులను వంచి నిటారుగా అరచేతులపై గడ్డం ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు పాదాల మడమలను తుంటితో తాకడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ మునుపటి స్థితికి రావాలి.
ధనురాసనం
ఈ ఆసనం సాధారణ అర్థం శరీరాన్ని విల్లులా వంచడం. మీ కడుపుపై పడుకుని రెండు కాళ్ల మోకాళ్లను వంచి, తుంటిపైకి తెచ్చి.. రెండు చేతులతో రెండు కాలి వేళ్లను పట్టుకోండి. పీల్చేటప్పుడు నెమ్మదిగా దానిని పైకి ఎత్తండి. విల్లులా శరీరాన్ని పట్టుకోండి. ఈ సమయంలో మెడ నిటారుగా ఉంచండి. ముందుకు చూడండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మునుపటి స్థితికి చేరుకోవాలి.
భుజంగాసనం
భుజంగాసనం అంటే పాము ఆకారంలో ఉన్న భంగిమని చెప్పవచ్చు. మునుపటి భంగిమలో వలె పొట్టపై పడుకుని అరచేతులను ఛాతీ వైపు ఉంచి.. పాదాలను కలుపుతూ.. మోచేతులను కొద్దిగా పైకి లేపి శ్వాసను పీల్చుకుంటూ తలను పైకి లేపాలి. నాభి భూమిపై ఉండాలి. తలను వెనుకకు తిప్పండి. కాసేపు ఆగి మళ్లీ మునుపటి స్థితికి రావాలి.
మర్కటాసనం
ఈ ఆసనం వెన్నునొప్పికి ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా మీ వెనుకభాగంలో పడుకోండి. చేతులను చాపండి. మీ అరచేతులను తెరిచి.. రెండు కాళ్లను మోకాలి వద్ద వంచండి. ఇప్పుడు కాళ్లను మీ కుడివైపునకు వంచి.. మెడను ఎడమవైపుకు తిప్పండి. దీన్ని 5-6 సెకన్ల పాటు చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా కాళ్లను ఎడమవైపునకు మడిచి మెడను కుడివైపున ఉంచాలి.
సంబంధిత కథనం