World Spine Day 2022 । వెన్నునొప్పి బాధిస్తుందా? ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం వద్దు!
World Spine Day: ఒకప్పుడు వయసు పెరిగితే వెన్నునొప్పి వచ్చేది, ఇప్పుడు ఏ వయసు వారికైనా అన్ని నొప్పులు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణమేంటి? ఏ సందర్భంలో వైద్య సహయం అవసరం? ప్రముఖ వైద్య నిపుణులు అందించిన సూచనలు, సలహాలు ఇక్కడ తెలుసుకోండి.
సరిగ్గా నిలబడాలంటే వెన్నెముక దృఢంగాఉండాలి. సాధారణంగా వృద్ధాప్యం పెరిగేకొద్దీ వెన్నెముక వంగిపోవడం, బలహీనపడటం జరుగుతుంది. వయసు మీదపడే వచ్చే నొప్పులు ఈరోజుల్లో ఏ వయసు వారికైనా వస్తున్నాయి. ప్రతీ వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వెన్నునొప్పి (spinal cord pain) తో బాధపడే ఉంటారు. కానీ కొంత మందిలో ఇది దీర్ఘకాలం వేధించేదిగా తయారవుతుంది. ఈ విధమైన నొప్పికి కారణాలు అనేకం ఉన్నాయి. వెన్నునొప్పి కలగటానికి ముఖ్యంగా చాలాకాలంగా కొనసాగిస్తున్న నష్టదాయకమైన అలవాట్లు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. కంప్యూటర్ పైన నిరంతరం వంగి పనిచేసే వారు ఇటీవల కాలంలో ఎక్కువగా మెడనొప్పి గురించి ఫిర్యాదు చేస్తున్నారు. దీనినే టెక్ నెక్ అని కూడా పిలుస్తున్నారు. ఇలా వంగి పనిచేసే అలవాటు వెన్నునొప్పికి దారితీస్తుంది. మిగతా కారణాలలో ప్రమాదాలు, కండరాలు అలసి దెబ్బదినటం, క్రీడలలో పాల్గొన్నప్పుడు తగిలిన గాయాలు ముఖ్యమైనవి ఉన్నాయి.
ప్రతీ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవం (World Spine Day) గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెన్నెముక ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరినీ ఫిట్‌గా ఉంచడానికి, ఆరోగ్యకరంగా జీవనం సాగించడానికి అవగాహన కల్పించడం ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం.
Symptoms of Back Pain- వెన్నునొప్పి లక్షణాలు
సాధారణంగా వెన్ను నొప్పి రోజంతా ఉంటుంది. కానీ కొందరిలో కేవలం రాత్రిళ్లు మాత్రమే వెన్ను నొప్పి కనిపిస్తుంది. పగలంతా మామూలుగానే గడిపిన వీరు, రాత్రిళ్లు తీవ్రమైన వెన్ను నొప్పితో నిద్రకు దూరం కావలసి వస్తుంది. కారణాలు ఏవైనప్పటికీ వెన్నునొప్పి లక్షణాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. అవి:
- మెడ కింది భాగం నుంచి వెన్నుచివరన ఉండే టెయిల్ బోన్ దాకా వెన్ను వెంట బిగసుకుపోయినట్లు అనిపించడం. ఎంతకూ ఉపశమనం దొరకని నొప్పిఉండటం.
- మెడలో, వీపు పైభాగంలో, వీపు కింది భాగంలో చాలా నొప్పిగా ఉండటం. ఏదైనా బరువు ఎత్తినపుడు,
- శ్రమతో కూడిన పనులేమైనా చేసినపుడు నొప్పి మరింత ఎక్కువ అనిపించటం.
- ఎక్కువ సేపు కూర్చున్నా, నిలబడ్డా వీపు మధ్య, కింది భాగాలలో నొప్పి, వీపు కింది భాగం నుంచి మొదలయి పిరుదులు, తొడలు, పిక్కలు, వేళ్ల వరకూ వ్యాపించి ఉండే నొప్పి.
- నిట్టనిలువుగా నిలబడినపుడు వీపు కింది భాగంలో విపరీతమైన నొప్పి కలగటంతోపాటు కండరాలు గట్టిగా చలించటం.
Reasons for Back pain- వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది?
ఉరుకులు పరుగులతో సాగే ఆధునిక జీవితంలో అందరికీ వెన్నునొప్పి ఎదురవుతూనే ఉంటుంది. ఈ నొప్పి కొందరికి తక్కువగా ఉంటే, కొందరికి భరించలేనంగా ఉంటుంది. వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవటంతో వెన్ను నొప్పి మొదలవుతుంది. మరి ఆ కండరాలు ఎందుకు అలసిపోతాయంటే.. వీపు కింది భాగంలో ఉండే అనేక కండరాలు, లిగమెంట్స్ వెన్నుపూనలకు అతుకుకుని ఉండి మొత్తం వెన్నుని వీపు మధ్యలో నిలబెట్టి ఉంచుతుంటాయి. మనం కూర్చునే, నిలబడే, పనులు చేసే సమయంలో తెలియకుండానే ఆ కండరాలు విపరీతంగా సాగేట్లు చేస్తాం. ఫలితంగా వాటిపై ఒత్తిడి పెరిగి, వెన్నునొప్పికి దారితీస్తుంది.
కొంత మందిలో సాధారణమైన అలవాట్ల కారణంగా చిన్న వయస్సు నుంచే ఈ కండరాల పైన నిరంతరం ఒత్తిడి కొనసాగుతుంటుంది. శ్రమతో కూడిన పని చేయటం ద్వారా కలిగే నొప్పి తాత్కాలికమే అయినా, ఈ అలవాటు నిరంతరం కొనసాగితే కండరాలు బాగా అలసిపోతాయి, బలహీనపడతాయి. దీంతో అవి వెన్నును సరైన ప్రదేశంలో నిలిపి ఉంచలేకపోతాయి, ఈ రకంగా వెన్ను నొప్పి మొదలవుతుంది.
వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ కార్టిలేజ్ ను కలిగిఉంటుంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ శరీరంలోని కార్టిలేజ్ లో నీరు - ప్రొటీన్ పరిమాణంలో మార్పులు జరుగుతాయి. ఇది దెబ్బదినటం వల్ల కూడా వెన్ను నుంచి బయటకు వచ్చే నాడులు ఒత్తిడికి గురై వెన్నునొప్పికి దారితీస్తుంది.
వైద్య సహాయం ఎప్పుడు అవసరం?
రోజువారీ కార్యక్రమాలకు తీవ్రమైన ఆటంకం కలిగించే వేదన తోపాటు వెన్నునొప్పి వెనుక ఇతర ఆరోగ్య ప్రమాదాలు దాగి హఠాత్తుగా బయటపడే ప్రమాదం ఉంటుంది.
- చేతులు,కాళ్లు, గజ్జలల తిమ్మిర్లు-పొడిచినట్లు అనిపిస్తే వెన్నుపాముకు కొంత నష్టం జరిగిందని గుర్తించాలి. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యసాయం అవసరం.
- నడుము దగ్గరనుంచి ముందుకు వంగినపుడ, దగ్గినపుడు నొప్పి ఎక్కువ అయితున్నట్లయితే అది హెర్నియేటెడే డిస్క్.
-జ్వరం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉండి తరచూ మూత్రానికి వెళ్ల వలసి వస్తుంటే వెన్ను నొప్పితోపాటు ఇన్ఫెక్షన్ సోకినట్లు గమనించాలి.
-వెన్ను నొప్పి కాలు వెనుకభాగం మీదుగా కిందికి వ్యాపిస్తున్నట్లయితే అది సయాటికా.
-వెన్ను నొప్పితో పాటు హఠాత్తుగా బరువు కోల్పోయినా, ఉన్న వ్యక్తి కుటుంబంలో ఎవరికైనా కాన్సర్ వచ్చి ఉంటే, ప్రమాదం - గాయం తరువాత వెన్ను నొప్పి ప్రారంభమయి తగినంత విశ్రాంతి తీసుకున్నా నొప్పి తగ్గనపుడు ప్రమాదం అధికమని భావించాలి.
వెన్ను నొప్పితోపాటు పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును కలవాలని కామినేని హాస్పిటల్స్, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ తెలిపారు.
సంబంధిత కథనం