Periods Symptoms: మీకు పీరియడ్స్ వచ్చేముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి, ముందే ప్రిపేర్ అవ్వండి
Periods Symptoms: మహిళ జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సహజమైన ప్రక్రియ. పీరియడ్స్ సమీపిస్తున్నప్పుడు మీకు కొన్ని రకాల సంకేతాలను శరీరం అందిస్తుంది. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.
ప్రతినెలా పీరియడ్స్ రావడం అనేది మహిళలకు అత్యవసరం. అది వారి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పీరియడ్స్ ప్రతినెలా రాకపోతే మీకు ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అయితే పీరియడ్స్ ఎప్పుడు వస్తాయా అని మహిళలు ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటారు. పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలను శరీరం అందిస్తుంది. వాటిని అర్థం చేసుకుంటే మీరు ముందుగానే ప్రిపేర్ కావచ్చు.
పీరియడ్స్ వచ్చేముందు ప్రీ మెనుస్ట్రువల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఒక వారం లేదా కొన్ని రోజుల ముందు ప్రారంభమవుతాయి. శారీరకంగా, భావోద్వేగాలపరంగా, ప్రవర్తనా పరంగా మార్పులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీకు త్వరలో ఋతుస్రావం కాబోతోందని చెప్పే సంకేతాలు.
పీరియడ్స్ ముందు కనిపించే లక్షణాలు
మీ రొమ్ములు చాలా సున్నితంగా మారిపోతాయి. పీరియడ్స్ వచ్చేముందు ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల రొమ్ములు అసౌకర్యంగా వాచినట్టుగా అనిపిస్తాయి. రొమ్ములు నిండుగా కూడా అనిపిస్తాయి. ఇలా ఉంటే మీకు త్వరలో పీరియడ్స్ వస్తున్నాయని అర్థం. అది మూడు రోజుల్లో కావచ్చు, ఒక వారంలో కావచ్చు... ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు. ఇలా రొమ్ములు బరువుగా, నొప్పిగా అనిపించినప్పుడు కెఫీన్ ఉండే పదార్థాలు తినడం తగ్గించండి.
పీరియడ్స్ వచ్చే ముందు హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. శరీరం కూడా నీటిని అధికంగా నిలుపుకుంటుంది. దీనివల్ల పొత్తికడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే పీరియడ్స్ వచ్చేస్తాయని అర్థం. ఈ సమయంలో అధికంగా నీటిని తాగాల్సిన అవసరం ఉంది. అలాగే నడక, తేలికపాటి పనులు చేయాలి.
మూడ్ స్వింగ్స్ అనేది పీరియడ్స్ వచ్చే ముందు కనిపించే ముఖ్య లక్షణం. హార్మోన్లలో మార్పులు వల్ల మూడు స్వింగ్స్ వస్తాయి. సెరెటోనిన్ స్థాయిలలో తగ్గిపోవడం వల్ల విపరీతంగా చిరాకు, ఆందోళన, భావోద్వేగాల్లో విపరీతమైన కోపం వంటివి వస్తాయి. ఇలా మీకు చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు, ఆందోళన వస్తూ ఉంటే మీకు పీరియడ్స్ రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి.
పీరియడ్స్ రావడానికి ముందు గర్భాశయ లైనింగ్ పొరలు పొరలుగా ఊడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీనివల్ల పొత్తికడుపు భాగంలో తిమ్మిరిగా, నొప్పిగా అనిపిస్తుంది. ఇలా మీకు పొత్తికడుపు భాగంలో ఇబ్బందిగా అనిపిస్తే పీరియడ్స్ వచ్చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి.
హార్మోన్లలో హెచ్చుతగ్గులు కారణంగా తలనొప్పి, మైగ్రేన్ వంటివి అధికంగా వస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్‌లో తగ్గుదల కనిపించినప్పుడు తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు తినకూడదు. నీరు అధికంగా తాగాలి.
హార్మోన్లలో మార్పుల వల్ల మీ చర్మం జిడ్డుగా మారిపోతుంది. అప్పుడు మొటిమలు వస్తాయి. ఇలా మొటిమలు వస్తున్నాయంటే మీకు పీరియడ్స్ రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి.
హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల తీవ్ర అలసట కూడా వస్తుంది. తగినంత నిద్ర ఉన్నా కూడా ఎక్కువగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కనీసం 9 గంటలు నిద్రపోతే తప్ప మీరు ఉత్సాహంగా ఉండలేరు. ఇది కూడా పీరియడ్స్ రాకను సూచించే లక్షణమే.
తీపి పదార్థాలు తినాలనిపించడం కూడా పీరియడ్స్ రాకనే చెబుతాయి. నడుము నొప్పి పెట్టడం, మలబద్ధకం, అతిసారం, పొట్టలో అసౌకర్యం వంటివన్నీ కూడా పీరియడ్స్ రాబోతున్నాయని చెప్పే లక్షణాలే.
టాపిక్