Blood in Periods: పీరియడ్స్ సమయంలో వచ్చేది చెడు రక్తమా? అశుద్ధమా?
Blood in Periods: చాలామందికి పూర్వం నుంచి ఒక నమ్మకం ఉంది... బహిష్టు సమయంలో వచ్చే రక్తం అశుద్ధమని భావిస్తారు. దాన్ని చెడు రక్తం అంటారు. ఇది ఎంతవరకు నిజమో గైనకాలజిస్టులు వివరిస్తున్నారు.
Blood in Periods: పీరియడ్స్ లేదా రుతుస్రావం అనేది స్త్రీ శరీరంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వారి పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉందని సూచించే లక్షణమే. ప్రతినెలా పీరియడ్స్ రావడం ఒక స్త్రీ శరీరం గర్భం దాల్చడానికి సిద్ధమైందని చెప్పే సంకేతం కూడా ఇదే.
మహిళలో ఉండే అండాశయాలు ఫలదీకరణం కోసం ప్రతినెలా అండాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాగే గర్భాశయ లైనింగ్ కూడా గట్టిపడుతుంది. అండం విడుదలైనప్పుడు స్పెర్మ్ తో కలిస్తే అది పిండంగా ఎదిగి గర్భాశయంలో ఉంటుంది. ఎప్పుడైతే అది స్పెర్మ్ తో కలవదు. అప్పుడు ప్రతినెలా పీరియడ్స్ సమయంలో ఆ అండం బయటికి వచ్చేస్తుంది. అలాగే గర్భాశయ లైనింగ్ కూడా ముక్కలుముక్కలుగా రాలిపోయి రక్తస్రావంలోనే కలిసిపోతుంది. ఫలదీకరణం కాని అండాలు తొలగించడం రుతుస్రావ సమయంలోనే జరుగుతుంది. చాలామంది స్త్రీలకు మూడు నుండి ఐదు రోజుల వరకు రక్తస్రావం అవుతుంది.
పీరియడ్స్ లో చెడు రక్తం వస్తుందా?
పీరియడ్స్ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని నిజమని నమ్మేవారు ఉన్నారు. వాటిలో ముఖ్యమైనది రుతుస్రావంలో వచ్చే రక్తం పూర్తిగా అశుద్ధమైనదని, చెడు రక్తమని.. శరీరంలోంచి ప్రతినెలా ఆ చెడు రక్తం పోవాలని చెబుతూ ఉంటారు. గైనకాలజిస్టులు చెబుతున్న ప్రకారం మన శరీరంలో చెడు రక్తం ఉండదు. ఒకే రకమైన రక్తం ఉంటుంది. ఒక్కో కొంతమందిలో ఒక్కోసారి ఎర్రటి రంగులో రక్తస్రావం అవుతుంది. మరికొందరికి బ్రౌన్ రంగులో రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఎరుపుగా వచ్చిన రక్తం తాజాగా విడుదల అయిందని అర్థం. బ్రౌన్ రంగులో వచ్చే రక్తం ఆక్సీకరణం చెందిందని, ఆ రక్తం గర్భాశయాన్ని విడిచిపెట్టడానికి ఎక్కువ సమయం పట్టిందని అర్థం చేసుకోవాలి.
ఈ రక్తంతో పాటే ఫలదీకరణం చెందని అండం, గర్భాశయ కణజాలం కూడా బయటికి పోతాయి. ఆ సమయంలోనే చిన్నచిన్న గడ్డలు, జిగటగా ఉండే పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రక్తంతో రక్త ప్రవాహంతో పాటు బయటికి వచ్చేస్తాయి. అంతే తప్ప అది చెడు రక్తం కాదు.
ఈ రక్తంలో స్రావాలు, నీరు, పొటాషియం, సోడియం వంటివి కూడా కలిసి ఉంటాయి. ఆ రక్తం హానికరమైనది కాదు, విషపూరితమైనది కూడా కాదు. పీరియడ్స్ లో వచ్చే రక్తం పరిశుభ్రంగా ఉంటుంది. కాకపోతే శరీరం అంతటా ప్రసరించే రక్తానికి కాస్త భిన్నమైనది. పీరియడ్స్ లోని రక్తంలో కొన్ని కణజాలాలు, శ్లేష్మం, గర్భాశయ పొరలు వంటివన్నీ కలిసి బయటికి వస్తాయి. కాబట్టి ఇది కాస్త చిక్కగా, గడ్డలు గడ్డలుగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని స్త్రీ శరీరంలో చెడు రక్తం అనేది ఉండదు. స్త్రీ శరీరంలోనే కాదు ఏ మనిషి శరీరంలో కూడా మంచి రక్తం, చెడు రక్తం అనే రెండు రకాలు ఉండవు.
పీరియడ్స్ రాకపోతే..
కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యకరమైన ఆహారం, పాలిసిస్టిక్ ఓవర్ ఇన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా కారణం కావచ్చు. కొంతమంది గర్భవతి కావడం వల్ల కూడా పీరియడ్స్ ఆగిపోతాయి. మీకు దేనివల్ల ప్రతినెలా పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా రుతస్రావం అవుతూ ఉంటే మీరు ఆరోగ్యకరంగా ఉన్నారని అర్థం. అలా కాకుండా ఒక నెల ఋతుస్రావం వచ్చి మరొక నెల ఆగిపోతే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. దానికి తగిన మందులు వినియోగించి సమస్య నుంచి బయటపడాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని, వ్యాయామాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రెండూ కూడా స్త్రీ శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడతాయి.