Periods and Pregnancy: గర్భం దాల్చాక స్త్రీలకు పీరియడ్స్ ఎందుకు ఆగిపోతాయి?
Periods and Pregnancy: గర్భ గర్భం ధరించాక స్త్రీలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్ ఆగిపోతాయి. దీని వెనుక కారణం ఏమిటో అని ఎప్పుడైనా ఆలోచించారా?
Periods and Pregnancy: ప్రతినెలా మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో అప్పుడు పెళ్లయిన మహిళలు గర్భం ధరించామేమోనని టెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే గర్భం ధరించాక నెలసరి రావడం ఆగిపోతుంది. గర్భధారణ సమయంలో రక్తస్రావం జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.
పీరియడ్స్ ఎందుకు రావు?
గర్భం ధరించని స్త్రీ ప్రతినెలా పీరియడ్స్ రావడం ఆరోగ్యకరం. గర్భం దాల్చాక మాత్రం పీరియడ్స్ ఆగిపోతాయి, ఆగిపోవాలి కూడా. ప్రతి నెలా అండోత్సర్గము జరగడం వల్ల పీరియడ్స్ వస్తాయి, అంటే విడుదలైన అండాలను, గర్భాశయం పై పొరను పీరియడ్స్ సమయంలో శరీరం నుంచి బయటికి పంపించేస్తుంది పునరుత్పత్తి వ్యవస్థ. ఎప్పుడైతే గర్భం దాలుస్తారో అప్పుడు అండోత్సర్గాన్ని నిరోధించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అంటే శరీరంలో అండోత్సర్గము జరగదు. అలాగే గర్భాశయంలోని పొర కూడా మందంగా మారి అక్కడ పెరిగే శిశువుకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి పీరియడ్స్ గర్భం ధరించాక రావు. గర్భం ధరించాక కొంతమందిలో రెండు మూడు చుక్కల బ్లడ్ స్పాట్స్ కనిపిస్తాయి. అది కొంతమందిలో మాత్రమే జరుగుతుంది. ఒకటి రెండు రోజులు మాత్రమే కనిపించి మాయమైపోతాయి. దీనికి తగ్గట్టు వైద్యులు మందులు కూడా ఇస్తారు.
సాధారణ ప్రసవం జరిగాక 30 నుండి 45 రోజుల వరకు రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. మళ్లీ ఐదు ఆరు నెలల తర్వాత సాధారణ పీరియడ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. సిజేరియన్ చేయించుకున్న ఆడవారిలో కూడా ఒక వారం పది రోజులు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఐదారు నెలల వరకు పీరియడ్స్ కనిపించకపోవచ్చు. గర్భాశయం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది. అలాగే స్త్రీల హార్మోన్లు ఉత్పత్తి కూడా సాధారణ స్థాయికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే పీరియడ్స్ మళ్లీ సాధారణంగా మొదలవడానికి కొంత సమయం పడుతుంది.
కొంతమందిలో గర్భం ధరించాక రక్తస్రావం అవడం జరుగుతుంది. ఇది వారిలో అనారోగ్యకరమైన గర్భాన్ని సూచిస్తుంది. గర్భాశయంలో సిస్ట్‌లు పెరిగినా, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉనా, లైంగిక ఇన్ఫెక్షన్లు ఉన్నా, ముందస్తుగా ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా... ఇలా రక్తస్రావం కనిపించే అవకాశం ఉంది. గర్భం ధరించాక రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు... తల తిరగడం, పొట్ట నొప్పి, జ్వరం, చలి, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలి.