Body Weight: ఈ 5 సందర్భాల్లో వెయిట్‌ను చెక్ చేసుకోవద్దు, బరువులో తేడాలు కనిపిస్తాయ్!
Body Weight Check Timings: మనలో చాలా మంది రెగ్యులర్‌గా వెయిట్‌ను చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి చూపించే బరువు కరెక్ట్ కాకపోవచ్చు. దానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.
అధిక శరీర బరువు అన్నింటికీ అనర్థమే. కాబట్టి మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో బరువును తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. దాని కోసం జిమ్‌లో కష్టపడటంతో పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి చేస్తుంటాం. సరిపోదన్నట్లు డైట్‌ను కూడా ఫాలో అవుతాం.
కానీ.. బాడీ వెయిట్ మెషిన్‌పై అడుగుపెట్టినప్పుడు అక్కడ కనిపించే నెంబరు చూసి కంగారుపడిపోతుంటాం. వాస్తవానికి ఎప్పుడు పడితే అప్పుడు బరువుని చెక్ చేసుకోకూడదు. అలా చూసుకుంటే బరువులో తేడాలొస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ బరువును చెక్ చేసుకోవడానికి రోజులోని కొన్ని సమయాలు, సందర్భాలు అనుకూలంగా ఉంటాయి. అలాకాకుండా మీకు నచ్చిన సమయంలో బరువు చూసుకుంటే మిషిన్ స్కేల్‌లో చూసే నెంబరుతో నిరాశకి గురవుతారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం .. కొన్ని సందర్భాల్లో అస్సలు బరువుని చెక్ చేసుకోకూడదు.
భోజనం చేసిన వెంటనే
ఆహారం తినడం లేదా నీరు ఎక్కువగా తాగిన తర్వాత బరువుని చెక్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే మీ బరువులో తేడా చూపిస్తుంది. భోజనం, నీరు సహజంగానే ఎక్కువ బరువుని సూచిస్తాయి. ఎందుకంటే మీ శరీరం అప్పటికే జీర్ణం, ద్రవాలను గ్రహిస్తుంది. ఫలితంగా బరువులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత లేదా ఖాళీ కడుపుతో బరువుని చెక్ చేసుకోవాలి.
నెలసరి సమయంలో
మహిళలు పీరియడ్స్ సమయంలో బరువును తనిఖీ చేసుకోకుండా ఉండాలి. ఆ సమయంలో శరీరం అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతుంది, ఇది నీరు నిలుపుదలకి కూడా కారణమవుతుంది. ఫలితంగా మీరు తాత్కాలికంగా కాస్త బరువు పెరిగినట్లు అనిపించొచ్చు.
జిమ్ చేసిన వెంటనే
చాలా మంది జిమ్‌లో కష్టపడిన తర్వాత బరువు చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. బరువు కాస్త తగ్గినట్లు మీకు మెషిన్‌లో అప్పుడు కనిపించినా.. వ్యాయామం తర్వాత మీ కండరాలు రికవరీకి ద్రవం అవసరం అవుతుంది. అది అందగానే మళ్లీ మునుపటి బరువు సమీపానికి చేరుకుంటారు. కాబట్టి.. రాత్రికి రాత్రే తగ్గిపోవాలని ప్రయత్నించకండి. బరువు తగ్గడానికి మీ శరీరానికి కొన్ని రోజులు సమయం ఇవ్వండి.
నిద్రలేచిన వెంటనే
నిద్రలేచిన వెంటనే కొంత మంది బరువును చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో మీ బరువులో తేడాలుంటాయి. దానికి రాత్రి నిద్రకు భంగం కలిగి ఉండటం లేదా రాత్రి సమయంలో నీరు ఎక్కువగా తాగి ఉంటే బరువులో తేడా చూపించే అవకాశం ఉంది. అలానే మీ శరీరం, మొహం కాస్త ఉబ్బినట్లు లేదా డీహైడ్రేషన్‌గా అనిపిస్తే బరువును తనిఖీ చేయకపోవడం మంచిది.
టూర్‌కి వెళ్లొచ్చి
కొంత మంది హాలిడేకి వెళ్లి తిరిగొచ్చిన వెంటనే బరువును తనిఖీ చేయడం చేస్తుంటారు. విహారయాత్రలో ఉన్నప్పుడు అతిగా తినడం లేదా మద్యం సేవించడం లాంటివి చేస్తుంటారు. ఫలితంగా బరువు పెరుగుతారు. కాబట్టి మీ నిజమైన బరువు తేలాలంటే కొన్ని రోజులు ఆగి తర్వాత చెక్ చేసుకోండి.
రోజువారీ వ్యాయామం, డైట్‌ను ఫాలో అయ్యేవాళ్లు రెగ్యులర్‌గా వెయిట్‌ను చెక్ చేసుకుని కంగారుపడటం కంటే.. వారంలో ఒక రోజుని బరువుని చెక్ చేసుకోవడానికి కేటాయించుకోవడం మంచిది. బరువుకి తగినట్లుగా మీ ప్లాన్‌ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేతప్ప ప్రతి రోజూ చెక్ చేసుకుంటూ బరువు పెరిగిపోయామని కంగారు పడటం లేదా తగ్గిపోతున్నామని సంతోషపడటం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు.