Wednesday Motivation: ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య లేదు, తాళం చెవి తయారు చేయకుండా ఎవరు తాళాన్ని చేయరు
Wednesday Motivation: తమకు వచ్చే సమస్యనే చాలా పెద్దవిగా అనుకుంటారు ఎంతోమంది. ఆ సమస్యకు పరిష్కారమే లేదనుకుంటారు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని వింటూనే ఉంటాం. కానీ నమ్మకం ఉండదు. చిన్న సమస్య వస్తేనే విలవిలలాడిపోయి, లేనిపోని ఆలోచనలతో అంతిమ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. సమస్య ఎంత కష్టమైనా కూడా దానికి కచ్చితంగా ఆ దేవుడు పరిష్కారాన్ని కూడా సృష్టించే ఉంటాడు. మీ పని దాన్ని కనిపెట్టడమే.
తాళం చెవిని తయారు చేయకుండా ఎవరు తాళాన్ని రూపొందించరు. అలాగే పరిష్కారాన్ని లేకుండా ఏ సమస్య ఉండదు. సమస్య ఎంత క్లిష్టమైనదైనా దాన్ని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉండే ఉంటుంది. దానికి కనిపెట్టడంలోనే మీ గొప్పతనం ఉంది
సమస్యకు పరిష్కారం లేదని అనుకునే బదులు ఆ సమస్య ఎందుకు వచ్చిందో గుర్తించడం, దాన్ని పరిష్కరించడానికి మార్గాలను వెతకడంలోనే మీరు ఎంతో కొంత విజయం సాధించినట్టు. ఆ సమయంలోనే మీలో ఆశలు చిగురుస్తాయి. కానీ ఎంతోమంది సమస్యను చూసి భయపడి పోతారు. లేనిపోని నిర్ణయాలు తీసుకుంటారు.
ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటే సానుకూల దృక్పథంతో ఆలోచించడం. మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్‌తో ఉంటారో ప్రతి సమస్య దూది పింజలాగా చిన్నగా కనిపిస్తుంది. అలాకాకుండా భయపడుతూ, బాధపడుతూ ఉంటారో చిన్న సమస్య కూడా పెద్ద భూతంలా మారిపోతుంది. మీ ఆలోచనలు ప్రేరణత్మకంగా ఉంటే మీలో సానుకూల దృక్పథం కూడా పెరిగిపోతుంది. పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరించగలుగుతారు.
మీకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మీరు స్వీకరించినా, స్వీకరించకపోయినా అవి మీ పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని చూసి మీరు విచారంగా ఉండకండి. దేవుడు మీకు పరీక్ష పెట్టాడు అనుకోండి. మీ సమర్థత అనేది కష్ట కాలంలోనే కనిపిస్తుంది. సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ విజయవంతం అయినట్టే కనిపిస్తారు. కానీ ఎవరైతే కష్టంలో ధైర్యంగా నిలుచుని ఉంటారో అతనే నిజమైన విజేత. మీ జీవిత ప్రయాణానికి అడ్డు తగిలే ఏ సమస్యను చూసి అక్కడే ఆగిపోకండి. దాన్ని ఎలాగైనా దాటుకొని ముందుకు వెళ్ళండి.
జీవితంలో ఒక సమస్య పరిష్కారం అవ్వగానే మరొక సమస్య వస్తూనే ఉంటుంది. అలా వస్తున్న కొద్దీ కొంతమంది డీలా పడిపోతారు. భయపడి పోతారు. కొంతమంది తమ జీవితాన్ని ముగించేసుకుంటారు. ఇలా కాకుండా వీలైనంతవరకు ఆ సమస్యను సమస్యలా చూడకండి... మీ జీవితంలో ఒక భాగంలా చూడండి. అది మీకు పెద్దగా కనిపించదు. కొత్తగా అనిపించదు. కాబట్టి జీవితంలో సమస్య రాగానే తల్లడిల్లిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించండి.