Wednesday Motivation: వేధించే తండ్రి హింసించే సమాజం మధ్య ఎదిగిన నిలువెత్తు విజయం ఎలన్ మస్క్, ఈయన జీవితమే స్పూర్తి-elon musk the enduring success of growing up amid a society tormented by an abusive father ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation: వేధించే తండ్రి హింసించే సమాజం మధ్య ఎదిగిన నిలువెత్తు విజయం ఎలన్ మస్క్, ఈయన జీవితమే స్పూర్తి

Wednesday Motivation: వేధించే తండ్రి హింసించే సమాజం మధ్య ఎదిగిన నిలువెత్తు విజయం ఎలన్ మస్క్, ఈయన జీవితమే స్పూర్తి

Haritha Chappa HT Telugu

Wednesday Motivation: ఎలన్ మస్క్ పేరు చెప్పగానే అందరికీ టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తాడు. కానీ అతని జీవితం మాత్రం కష్టాలతోనే మొదలైంది. ఈ స్థాయికి చేరడానికి అతను ప్రపంచంలో ఉన్న అన్ని బాధలను,సమస్యలను దాటి వచ్చాడు.

ఎలన్ మస్క్

ఎలన్ మస్క్‌కు ఇంకా పదేళ్లు కూడా నిండలేదు. దక్షిణాఫ్రికాలో అమ్మానాన్న తమ్ముడితో కలిసి జీవించేవాడు. ఇంట్లో నిత్యం అమ్మానాన్నల మధ్య గొడవలే. ఇల్లంటే పిల్లలకు స్వర్గంలా ఉంటుంది. కానీ ఈ పిల్లాడికి మాత్రం భరించలేనంత నరకం. అమ్మా నాన్న తన కళ్ళ ముందే విడిపోయారు. ఆ వయసులోనే తల్లి కావాలా? తండ్రి కావాలా? ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే తండ్రి కావాలని ఎంపిక చేసుకున్నాడు. ఆ నిర్ణయమే అతని ఆనందాన్ని చిదివేసింది.

ఆ తండ్రి తన సొంత బిడ్డను ఎన్ని కష్టాలు పెట్టాడో చెప్పడానికి మాటలే సరిపోవు. శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడు. దుర్మార్గానికి ప్రతిరూపంలా మారాడు. తండ్రిని ఎంచుకున్నందుకు మస్క్ చిన్న వయసులోనే ఎంతో బాధపడ్డాడు.

స్నేహితులతోనైనా సరదాగా ఉందామంటే ఆ భాగ్యం కూడా దక్కలేదు మస్క్‌కు. తల్లిదండ్రులు విడిపోవడం, తండ్రి సొంత కొడుకుని పరాయి వాడిలా చూడడం, తోటి పిల్లలకు అలుసైపోయింది. మస్క్‌ను తోటి పిల్లలే ఎంతో ఏడిపించేవారు. రోడ్డు మీద నడుస్తూ వెళితే కాగితాలు విసిరేవారు. అతను బాధపడుతూ ఉంటే నవ్వేవారు. హింసించే తండ్రితో, అల్లరి పెట్టే పిల్లలతో బతకలేకపోయాడు. అయినా సరే మొండిగా అలాగే జీవించాడు.

బాధలు మరిచిపోవడానికి వీడియో గేమ్స్ కు అలవాటు పడి వాటితోనే గడిపేవాడు. అలా ఒక గేమ్‌ని సృష్టించి మొదటిసారి 500 డాలర్లకు అమ్మాడు. అలా అతని ఊహలకు రెక్కలొచ్చాయి. వేధించే లోకం నుంచి బయటికి వెళ్లేందుకు దారి తెలిసింది. తన తల్లి కెనడా పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడంతో అక్కడికి చేరుకోవాలని ప్రయత్నించాడు. కెనడా నుంచి అమెరికా వెళ్లాలన్నది మస్క్ ప్లాన్. తండ్రికి చెప్పకుండానే కెనడాలో చదువు కోసం ఓ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కెనడా పాస్ పోర్ట్ రాగానే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్లడం పెద్ద కష్టం కాలేదు. అమెరికా చేరినా చేతిలో డబ్బు మాత్రం లేదు. మళ్లీ తన మెదడుకు పదును పెట్టాడు. తాను ఉండే గదినే క్లబ్ గా మార్చి అందరికీ అద్దెకు ఇచ్చాడు. దీంతో డబ్బులు రావడం మొదలుపెట్టాయి. ఇక తను చదవాలనుకున్న డిగ్రీలన్ని చదివాడు.

ఎంతో తెలివైనవాడైన ఎలన్ మస్క్ తమ్ముడుతో కలిసి తొలిసారి చిన్న కంపెనీని స్థాపించాడు. స్థానికంగా ఉన్న దుకాణాలు ఎక్కడ ఉన్నాయో మ్యాపింగ్ చేసి వినియోగదారులకు ఇవ్వడమే వీరి పని. ఇదే గూగుల్ మ్యాప్స్ కు ప్రేరణ అని చెప్పుకోవచ్చు. ఈ సంస్థ హిట్ అవ్వడంతో మెల్లగా ఎలన్ మస్క్ వ్యాపారవేత్తగా ఎదగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ సంస్థను స్థాపించాడు. అలా ఒక్కో అడుగు వేస్తూ డబ్బును పోగేశాడు. చివరకు టెస్లాను స్థాపించి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. అలా ఎదగడం వెనుక అతనికి తల్లి సాయం గాని, తండ్రి ప్రేరణ కానీ ఏదీ లేదు. కేవలం తన కష్టంతోనే పైకి వచ్చాడు. ఓవైపు తండ్రి దెబ్బలు తింటూనే చదువుకున్నాడు. తోటి పిల్లల వేధింపులు భరిస్తూనే ముందుకెళ్లాడు.

తల్లిదండ్రుల సాయం ఉన్నా కూడా ఇప్పటికీ ఏ పని చేయకుండా కూర్చునే వారి సంఖ్య ఎక్కువే మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది మీకు కావాల్సినదల్లా మీలో ఎదగాలన్న ఆశ పుట్టడమే ముందు ఆ కోరికకు ఆకాంక్షకు ఆద్యం పోయండి అవకాశాలు అవి ఎదురొస్తాయి కనీసం తల్లి తండ్రి లేని జీవితం నుంచి వచ్చిన ఇప్పుడు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు

పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి. వరద వచ్చినప్పుడు చేపలు చీమలను తిని బతుకుతాయి. అదే వరద తగ్గినప్పుడు ఆ చీమలే చేపలను తింటాయి. సమయం మాత్రమే ముఖ్యం... మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్లడమే జీవితం. మీరు సమస్యలో ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకండి. అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోండి.