Tuesday Motivation: భగవద్గీతలోని ఈ శ్లోకాలను అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లతో సులువుగా పోరాడవచ్చు
Tuesday Motivation: ఆధునిక జీవితం ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఆ సవాళ్లను తట్టుకోవాలంటే గుండె ధైర్యంతో పాటు ఆలోచనా శక్తి కూడా ఉండాలి. అలాంటి శక్తినిచ్చే భగవద్గీత శ్లోకాలు ఇదిగో.
ఎంత సర్వశక్తిమంతుడికైనా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవాలంటే ఎంతో బుద్ధి బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరం. వాటికోసం భగవద్గీత మనకు సహాయపడుతుంది. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు గురించి తెలుసుకుంటే అవి మీకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయి. కృష్ణుడు అర్జునుడితో చెప్పిన విశేషాలే భగవద్గీత రూపంలోకి మారాయి. అతడు జీవితానికి సరిపడా సలహాలను అర్జునుడికి అందించాడు. అవి సాధారణ మానవులకు కూడా ఎంతో ఉపయోగపడతాయి.
యోగస్థ: కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ.
సిద్ధసిద్ధ్యో: సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥
భగవద్గీతలోని అధ్యాయం 2లో 48వ శ్లోకం ఇది. దీని అర్థం అపజయం గురించి ఆలోచించకుండా తమ పనిని తాము చేయాలని. భక్తితో, దృఢ సంకల్పంతో చేసిన పని ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుందని ఈ శ్లోకం చెబుతోంది.
విహాయ కామాన్య: సర్వాన్పుమాన్శ్చరతి ని:
స్పృహ:నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి॥
భగవద్గీత లోని రెండవ అధ్యాయంలో 71వ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భౌతిక వాంఛలను విడిచి పెట్టాలని చెబుతాడు. అనుబంధాలు, అహం అన్నిటిని విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడని వివరిస్తాడు. ఇదే ఈ శ్లోకం అర్థం.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంఘోత్సత్వకర్మణి॥
అధ్యాయం 2లో 47 వ శ్లోకం ఇది. భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాల్లో ఒకటి. దీన్ని బట్టి మీకు పని చేసే హక్కు మాత్రమే ఉంది, ఆ పని తాలూకు ఫలితాన్ని ఆశించకూడదు అని అర్.థం అంటే మీరు పని చేసుకుంటూ వెళ్ళాలి, కానీ భవిష్యత్తులో ఫలితం ఎలా ఉంటుందో అని ముందే భయపడకూడదు.
క్రోధాద్భవతి సమ్మోహ: సమ్మోహాత్స్మృతివిభ్రమ:
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి॥
భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో 63వ శ్లోకం లో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ప్రజలకు కోపం, గందరగోళం రావడానికి, తెలివితేటలను కోల్పోవడానికి ఒక రకమైన మాయ కారణమవుతుందని... అందుకే ఏ మాయలోనూ పడకుండా మనిషి ముందుకు వెళ్లాలని ఈ శ్లోకం అర్థం.
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ:
భగవద్గీత లోని మూడవ అధ్యాయంలో 35వ శ్లోకం ఇది. దీని ప్రకారం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయాల్సిందే. భయపడుతూ పనులను వదిలేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దు:ఖహా
భగవద్గీత లోని 17వ శ్లోకం ఇది. ఈ శ్లోకం ప్రకారం యోగ సాధనతో సమస్యలను తగ్గించుకోవాలి. ఏ పనిలోనైనా తృప్తిని పొందాలి. అప్పుడే ఆ మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతే మనిషి ముందుకు సాగలేడు. కాబట్టి భగవద్గీతలోని ఈ శ్లోకాలు తలుచుకుంటూ ఎదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ ముందుకు వెళ్లాలి.