Capsicum chick pea flour curry: కాప్సికం బరడ ఒక్కసారి తినిచూడండి.. ఇక వదిలిపెట్టరు
Capsicum chick pea flour curry: క్యాప్సికం అతిగా ఇష్టపడే వాళ్లూ ఉంటారు.. అసలు తినని వాళ్లు కూడా ఎక్కువే. ఇది ఇష్టపడని వాళ్లకి, పిల్లలకి తినిపించాలంటే కాస్త భిన్నంగా ప్రయత్నించాలి.
క్యాప్సికమ్ తినని వాళ్లకి ఒకసారి క్యాప్సికంతో బరడ చేసి పెట్టండి. చాలా మందికి శనగపిండి బరడ తెలిసే ఉంటుంది. దాదాపు అదే పద్ధతిలో కాస్త భిన్నంగా ఈ కూరగాయతో ప్రయత్నించండి. అన్నంలో కలుపుకుని ఆవురావురుమంటూ తినేస్తారు.
కాప్సికం బరడ కోసం కావాల్సిన పదార్థాలు:
పావుకేజీ - కాప్సికం
పావు కప్పు- శనగపిండి
5 టేబుల్ స్పూన్ల నూనె
1 టేబుల్ స్పూన్ - ధనియాల పొడి
2 టేబుల్ స్పూన్ల కారం
1/2 టీస్పూన్ - ఆవాలు
1/4 టీస్పూన్ - జీలకర్ర
1/4 టీస్పూన్ - పసుపు
1 కరివేపాకు రెమ్మ
5-6 వెల్లుల్లి రెబ్బలు
సన్నగా తరిగిన కొత్తిమీర
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాస్త వేడయ్యాక శగనపిండి వేసుకోవాలి. చెంచాతో పిండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. మంచి వాసన , కాస్త రంగు రాగానే స్టవ్ ఆపేయాలి. వేగిన ఈ పిండిని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మిగతా నూనె వేసి నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కచ్చా పచ్చాగ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసేయండి.అవి వేగాక కాస్త పెద్దగా తరుగుకున్న క్యాప్సికం ముక్కలు వేసెయ్యాలి. సన్నని మంట మీద మూత మూసి ముక్కల్ని వేగనివ్వాలి. ముక్కలు మెత్త్త బడ్డాక వాటిలో పసుపు, ధనియాలపొడి , కారం, ఉప్పుతో పాటు ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా కలుపుకోవాలి. పిండి అంతా ఉండలు కట్టకుండా అన్ని ముక్కలకు పట్టేట్టు కలుపుకొని ఆవిరి మూతలో ఒక 2 నిముషాలు ఉంచండి. దింపేముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చాలు. పది నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ సింపుల్ కర్రీ రుచి చాలా బాగుంటుంది.