Sunday Motivation: అనంత్ అంబానీ బరువు చూసి నవ్వుతున్నారా? అతను మీ బ్యాంక్‌బ్యాలెన్స్ చూసి నవ్వితే? బాడీషేమింగ్ మానేయండి
Sunday Motivation: అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా చేశారు అతని తల్లిదండ్రులు. అయితే అతని బరువును చూసి ఎంతోమంది బాడీ షేమింగ్ చేశారు. బాడీ షేమింగ్ అనేది ఇప్పుడు ప్రమాదకరమైన అలవాటుగా మారుతోంది.
Sunday Motivation: అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ మూడో కొడుకు అనంత అంబానీ. అతని ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్లో మూడు రోజుల పాటు సందడిగా జరిగాయి. బాలీవుడ్ ప్రముఖులతో పాటు కొంతమంది హాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుక ఫోటోలు, వీడియోలు... సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వైరల్‌గా మారాయి. అక్కడ ఎంతోమంది అనంత అంబానీ బరువును తీవ్రంగా విమర్శించారు. బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు.
రాఖీ సావంత్ అయితే ఏకంగా ఒక వీడియోని విడుదల చేసింది. తనను పెళ్లికి ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించింది. అలాగే అనంత అంబానీ గురించి చాలా చీప్ కామెంట్స్ చేసింది. అనంత్ అంబానీ చాలా లావుగా ఉన్నాడని, రాధిక మర్చంట్ మాత్రం దానిమ్మ పండులా ఉందని, అతడిని తన దగ్గరకు పంపిస్తే సన్నగా చేసి పంపుతానంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వేసింది. కేవలం రాఖీసావంత్ మాత్రమే కాదు, ఎంతోమంది సోషల్ మీడియాలో అనంత్ బరువు గురించి చాలా చీప్ కామెంట్స్‌ను పెట్టారు. అతను ఏనుగులా ఉన్నాడని ఒకరు, పందిలా ఉన్నాడంటూ మరొకరు కామెంట్స్ చేశారు. అతను బరువు పెరగడం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోకుండా తమ లేకి వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్నారు.
అనంత్ అంబానీ పెరిగిన బరువు వల్ల అతను ఇబ్బంది పడతాడు, కానీ ఈ సోషల్ మీడియా వేదికగా చీప్ కామెంట్స్ చేసిన ఎవరికీ ఆ బరువుతో ఎలాంటి సమస్యా ఉండదు. అయినా కూడా అతని బరువు గురించి వీరికే కావాలి. బాడీ షేమింగ్ చేయడం అనేది పెద్ద నేరంగానే చెప్పుకోవాలి. ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని అది దెబ్బ కొడుతుంది. ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, తనపై తన నమ్మకాన్ని కోల్పోతే ఏదీ సాధించలేడు. కొంతమంది జీవితాన్ని కూడా ముగిస్తూ ఉంటారు. కాబట్టి బాడీ షేమింగ్ పోస్టులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి.
అనంత్ అంబానీ బరువు గురించి చీప్‌గా కామెంట్స్ చేసేవారు ఒక్కసారి ఆలోచించండి. అతని బరువును చూసి మీరు నవ్వితే… మీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి అతను కూడా నవ్వగలడు. అతనికి ఉన్న అపార సంపదముందు ఈ చీప్ కామెంట్స్ చేసిన వారి సంపద ఏపాటి? ఎదుటివారిని బాధపెట్టాలి అనుకుంటే వారిలో లోపాలు ఎన్నయినా వెతకవచ్చు. ప్రతి ఒక్కరూ తమ తమ హద్దులను తెలుసుకొని ప్రవర్తించాలి. ఎదుటివారి పరిస్థితి, జీవితం, ఆరోగ్యం గురించి తెలియకుండా వారిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం తగదు.
ఒకరి ఆరోగ్య చరిత్ర తెలియకుండా... వారి శరీరం పై వ్యాఖ్యానించడం అనేది చాలా క్రూరమైన చర్యగానే చెప్పుకోవాలి. అనంత్ అంబానీకి తీవ్రమైన ఆస్తమా ఉంది. దానికోసం అతను విపరీతంగా స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. దాని కారణంగానే అనంత్ విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఆస్తమా వల్ల అతను కనీసం ఏసీ రూములో కూడా నిద్రపోలేడు. బరువు తగ్గడం కోసం నెలల తరబడి కష్టపడ్డాడు. 18 నెలల్లో 108 కిలోల బరువును తగ్గాడు. కానీ మళ్ళీ ఆరోగ్య సమస్యల వల్ల బరువు పెరగడం ప్రారంభించాడు. అది అతని తప్పు కాదు. ఆరోగ్య సమస్యలు ఎవరికైనా వస్తాయి. మీరు మాత్రం 20 ఏళ్లలో ఉన్నట్టే 50 ఏళ్ల వయసులో కనిపించగలరా? ఆరోగ్యం, అందం వయసుతో పాటు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చీప్ కామెంట్స్ చేసిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో రావా? వారు ముసలిక వారు కాకుండా ఉంటారా? ఒక్కసారి ఇలా ఆలోచించుకొని... ఎదుటివారిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం మానేయడం మంచిది.