Asthma: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ ఇంట్లో ఈ పనులేవీ చేయకండి-suffering from asthma but dont do these things in your house ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Asthma: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ ఇంట్లో ఈ పనులేవీ చేయకండి

Asthma: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ ఇంట్లో ఈ పనులేవీ చేయకండి

Haritha Chappa HT Telugu
Aug 17, 2024 09:10 PM IST

Asthma: ఆస్తమా అనేది చెప్పుకోవడానికి చిన్న వ్యాధి కానీ దానితో ఇబ్బంది పడే వారికే తెలుస్తుంది దాని భరించడం ఎంత కష్టమో. ఆస్తమా రోగులు ఇళ్లల్లో కొన్ని రకాల పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఆస్తమా ఉంటే చేయకూడని పనులు
ఆస్తమా ఉంటే చేయకూడని పనులు (Pixabay)

Asthma: గాలి కాలుష్యం పెరిగిపోవడంతో ఆస్తమాతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. మనదేశంలో కొన్ని కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నట్టు అంచనా. ఈ ఆస్తమా తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణంగా మారి ఎంతోమంది ప్రాణాలను కూడా తీస్తోంది. ముఖ్యంగా చిన్నారులకు ఈ ఆస్తమా ప్రాణాంతకంగా మారుతుంది. మీ ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నా, మీకు ఆస్తమా ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆస్తమా ఉన్నవారు ఇంట్లో కొన్ని పనులను చేయకూడదు.

కొవ్వొత్తులు, అగరబత్తీలు

చాలామంది ఇంట్లో సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను వెలిగిస్తారు. అలాగే అగరబత్తీలు కూడా వెలిగిస్తారు. ఆ కొవ్వొత్తులు, అగరబత్తీల నుంచి వచ్చే సన్నని పొగ లేదా ఆ సువాసన ఆస్తమా రోగులకు చికాకుగా మారుతుంది. అంతేకాదు ఆ పొగ ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమాను పెంచేస్తుంది. ఆ సమయంలో వారికి గాలి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. అలాగే దగ్గు కూడా వస్తుంది. కాబట్టి ఆస్తమా రోగులు ఉన్న ఇంట్లో అగరబత్తీలను, సువాసన వెదజల్లే కొవ్వొత్తులను వెలిగించడం మానేయాలి.

బార్బెక్యూలు వద్దు

ఇంట్లో పొగ వచ్చే పొయ్యిలను వాడకూడదు. కొంతమంది బార్బెక్యూలను కూడా ఇంట్లో పెట్టుకుంటారు. పురాతన కాల పద్ధతుల్లో ఆహారాన్ని కాల్చి తినడమే బార్బెక్యూ. అయితే ఆస్తమా రోగులకు ఎలాంటి ఆహార పద్ధతులు పడవు. ఆహారాన్ని కాలుస్తున్నప్పుడు వచ్చే పొగ వారికి తీవ్రమైన దగ్గును, శ్వాసకోశ ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి వంట పద్ధతులకు ఆస్తమా రోగులు దూరంగా ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చల్లటి నీటిని తాగడం మానేయాలి. ఇంట్లోకి విపరీతమైన చల్లగాలి వస్తున్నప్పుడు కిటికీలు, తలుపులు తీసి ఉంచడం మంచిది కాదు. ఇది వారిలో నెమ్మదిగా ఆస్తమాను పెంచేస్తుంది. అది తీవ్రంగా మారి ఆసుపత్రిలో చేరేవరకు తీసుకొస్తుంది.

ఆస్తమా అంటే ఏమిటి?

మనం ముక్కు ద్వారా గాలిని పీలుస్తాం, అలా పిలిచిన గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి ముక్కు ద్వారా బయటికి వస్తుంది. అయితే ఇలా గాలిని తీసుకెళ్లే వాయు నాళాలలోని కండరాలు ఒక్కోసారి వాచిపోతాయి. ఆ సమయంలో ఆ వాయునాళాలు సన్నగా మారుతాయి. సన్నగా మారిన ఆ వాయునాళాల గుండా గాలి ప్రవాహం సరిగా జరగదు. అప్పుడు ఊపిరి అందకపోవడం తీవ్రంగా దగ్గు రావడం వంటికి జరుగుతాయి. ఇదే ఆయాసానికి కారణం అవుతుంది. అలాగే ఛాతీ దగ్గర పట్టేసినట్టు అవుతుంది. ఆస్తమా అంటే ఈ సమస్య ఇది ఏ వయసులో ఉన్న వారికైనా వచ్చే అవకాశం ఉంది.