Kerala Fish Pickle Recipe । కేరళ ఫిష్ పికిల్.. దీని రుచి గురించి చెప్పాలంటే మాటల్లేవ్!
Kerala Fish Pickle Recipe: ఫిష్ పికిల్ తినాలనుకుంటున్నారా? అయితే కేరళ పద్ధతిలో ఫిష్ పికిల్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
భోజనం చేసేటపుడు ఏ కూర లేనప్పుడు లేదా భోజనానికి రుచికోసం మనం పచ్చడి కలుపుకుంటాం. ఇది పచ్చళ్లు పెట్టుకునే సీజన్. మామిడికాయలతో అవకాయ ఎలాగూ చేసుకుంటారు. ఎప్పుడైనా మాంసాహారం తినాలనిపించినపుడు అప్పటికప్పుడు వండుకోవాలంటే కుదరదు. కాబట్టి ముందుగానే మీకు నచ్చిన మాంసాహారంతో కూడా పచ్చళ్లు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అలాంటి ఒక రెసిపీని పరిచయం చేస్తున్నాం.
చేపలకూర చాలా మందికి ఇష్టమైన ఆహారం. కేరళ స్టైల్లో వండే చేపలకూర చాలా రుచిగా ఉంటుంది. మీరు చేపలతో మీరు పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది కూడా కేరళ స్టైల్లో ఫిష్ పికిల్ చేయాలనుకుంటే ఇక్కడ రెసిపీ ఉంది. ఈ కేరళ స్టైల్ ఫిష్ పికిల్ రెసిపీ చాలా సులభమైనది, త్వరగానే తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో ఇక్కడ సూచనలు చూసి, ఫాలో అయిపోండి.
Kerala Fish Pickle Recipe కోసం కావలసినవి
- 500 గ్రాముల కింగ్ ఫిష్ ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు
- 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 4 పచ్చిమిర్చి
- 1 tsp ఆవాలు
- 1 స్పూన్ మెంతులు
- 2 స్పూన్ల కారం
- 3 టీస్పూన్ల పసుపు
- 1/4 కప్పు వెనిగర్
- 1 స్పూన్ చక్కెర
- 1 కప్పు కాచి చల్లార్చిన నీరు
- 1 కప్పు కూరగాయల నూనె
- 1/2 కప్పు నువ్వుల నూనె
- 1 కాండం కరివేపాకు
- ఉప్పు తగినంత
కేరళ ఫిష్ పికిల్ తయారీ విధానం
- ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలకు 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, ఉప్పు వేసి అరగంట పాటు మేరినేట్ చేయండి.
- ఒక లోతైన పాన్ లో కూరగాయల నూనెను వేడి చేయండి. అందులో మేరినేట్ చేసిన చేప ముక్కలను చేసి క్రిస్పీగా , ముదురు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి. అనంతరం వీటిని పక్కన పెట్టండి.
- ఇప్పుడు అదే బాణలిలో నువ్వుల నూనె వేసి ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి, వేయించాలి. అనంతరం వేరొక ప్లేట్‌లోకి మార్చండి.
- ఇప్పుడు ఒక గిన్నెలో 1 టీస్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని వెనిగర్ ద్రావణంలో కలిపి మందపాటి పేస్ట్ చేయండి.
- ఇప్పుడు మెంతులు వేయించిన అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దీనికి వెనిగర్ మసాలా పేస్ట్ కలిపి 2 నిమిషాలు వేయించండి, ఆపై ఇందులో 1 స్పూన్ చక్కెర వేసి బాగా కలుపండి.
- అనంతరం ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన నీరు వేసి మరిగించాలి. ఆపైన ఇందులో వేయించిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిలతో పాటు వేయించిన చేప ముక్కలను వేసి మరిగించాలి.
- మంటను కనిష్ట స్థాయికి తగ్గించి మరో 5 నిమిషాలు ఉడికించాలి. రుచిని సరిచూసుకొని సర్దుబాటు చేసుకోండి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి, చల్లార్చితే కేరళ ఫిష్ పికిల్ రెడీ. బాటిల్‌లో స్టోర్ చేసుకోండి. అవసరమైనపుడు అన్నంలో కలుపుకొని తినండి.
సంబంధిత కథనం
టాపిక్