Dry Fish Fry : ఎండు చేపల ఫ్రై.. తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు
Dry Fish Fry Making : చేపలు అంటే చాలా మందికి ఇష్టం. లొట్టలేసుకుంటూ తింటారు. ఎండు చేపలను కొంతమంది మరింత తృప్తిగా తింటారు. అయితే డ్రై ఫిష్ పులుసు కాకుండా.. ఫ్రై చేసుకోండి. సూపర్ గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
చేపలు తింటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా రకాల పోషకాలు అందుతాయి. పచ్చి చేపలను పులుసు, ఫ్రై చేసుకుని తింటే.. ఆహా అంటారు. అయితే ఎండు చేపల(Dry Fish) లవర్స్ కూడా ఉన్నారు. చింతపులుసుతో చేసే రెసిపీకి(Recipe) ఫ్యాన్స్ ఎక్కువ. అయితే ఎండు చేపలతో చేసే ఫ్రై కూడా చాలా బాగుంటుంది. తింటే.. మాత్రం వదిలిపెట్టరు. ఎండు చేపల ఫ్రై సైడ్ డిష్ గా తినేందుకు సూపర్ ఉంటుంది. అయితే వాసన కారణంగా కొంతమంది ఎండు చేపలు తినరు. కానీ సరిగా శుభ్రం చేసి.. వండితే... వాసన ఎక్కువగా రాదు.
ఎలా తయారు చేయాలంటే..
ఎండు చేపలు-6, కారం-2 టీ స్పూన్స్, పసుపు-పావు టీ స్పూన్, ధనియాల పొడి-2 టీ స్పూన్స్, నూనె-పావు కప్పు, దంచిన వెల్లుల్లి-6, ఉల్లిపాయ తరిగినవి-1, కరివేపాకు కొద్దిగా..
ఎండు చేపలను(Dry Fish) ముందుగా శుభ్రం చేసుకోవాలి. వాటి మెడను తీసేసి.. పొట్ట భాగాన్ని కడుక్కోవాలి. అయితే కొంతమంది చేపల తల తినడం కూడా.. ఇష్టపడతారు. వారు అలానే ఉంచుకోవచ్చు. కాస్త రాళ్ల ఉప్పు తీసుకోవాలి. గరుకుగా ఉండే నేలపై మెల్లగా రాయాలి. చేపలను నీటిలో వేసి వెళ్లతో మెల్లగా రుద్దాలి. అయితే ఎండు చేపలకు ముళ్లు ఉంటాయి. అందుకే జాగ్రత్తగా క్లీన్ చేయాలి. నీళ్లు తెల్లగా అయ్యేవరకూ చేపలను కడగాలి. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న కారం ఎండు చేపలకు రెండు వైపులా పట్టించాలి. కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. ఎండు చేపలను వేసి వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. మీద మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యేవరకూ కాల్చుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నాక స్టౌవ్ ఆఫ్ చేయాలి. వీటిని సైడ్ డిష్ లాగా తినొచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది.