Neem Hair Oil : జుట్టు రాలుతుందా? ఇలా వేప నూనె తయారుచేసుకోండి-neem oil for healthy hair how to make neem hair oil ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Neem Oil For Healthy Hair How To Make Neem Hair Oil

Neem Hair Oil : జుట్టు రాలుతుందా? ఇలా వేప నూనె తయారుచేసుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 03:30 PM IST

Neem Oil For Hair : జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో కామన్. కానీ ఎవరూ అంత ఈజీగా తీసుకోరు. జుట్టు రాలితే.. ఓ రకమైన డిప్రెషన్ లోకి వెళ్తారు. జుట్టు రాలడం, తెల్ల జుట్టు నల్లగా మారడం వంటి సమస్యలకు కొన్ని చిట్కాలు పాటించి.. చెక్ పెట్టొచ్చు.

వేప నూనె
వేప నూనె

మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల(Food Habits)తో జుట్టు సమస్యలు అధికం అవుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. తెల్ల జుట్టు(White Hair) సమస్య కూడా వేధిస్తోంది. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, తలలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి వాటితో ఇలా జరుగుతుంది. అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనితో కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్తున్నారు. అయితే ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సాధారణంగా జుట్టు సమస్య అనగానే.. మెుదట రసాయనాలు ఉండే షాంపూలు, ఇతర వాటిని ఉపయోగించడం మెుదలుపెడతారు. దీంతో మరింత జుట్టు సమస్యలు పెరుగుతాయి. అందుకే ఇంట్లోనే వేప నూనె(Neem Oil) చేసుకుంటే.. ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. వేప నూనెతో కుదుళ్లు బలంగా తయారు అవుతాయి.

వేప నూనె(Neem Oil) వాడితే.. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కాంతివంతంగా తయారు అవుతుంది. వేప నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం వేప ఆకులు(Neem Leaves), కొబ్బరి నూనెను ఉపయోగించాలి. వేప ఆకులను సేకరించి.. వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత.. ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొబ్బరి నూనెను పోసి వేడి చేయాలి. ఆ తర్వాత.. వేప ఆకులను వేసి వేయించాలి. కొంచెం నల్లగా అయ్యే వరకు చేయాలి.

నూనె పూర్తిగా చల్లారేలా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుడ్డలోకి వేయించిన ఆకులను తీసుకుని.. గట్టిగా పిండుతూ.. ఓ గిన్నెలోకి నూనె తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక.. వేప నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు.

తయారైన వేప నూనె(Neem Oil)ను జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టిస్తూ.. మర్దనా చేయాలి. నూనె రెండు గంటలపాటు జుట్టుకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాతో జుట్టు ఒత్తుగా మారుతుంది. చుండ్రు సమస్యతో బాధపడే వారు కూడా ఈ టిప్ పాటించొచ్చు.

WhatsApp channel

టాపిక్