Mental health tips for women: మహిళల్లో మానసిక ఒత్తిడి.. ఉపశమనానికి 3 టిప్స్ ఇవే
Mental health tips for women: వర్కింగ్ ఉమెన్‌కు ఉండే విభిన్న బాధ్యతల కారణంగా సులువుగా ఒత్తిడికి లోనవుతారు. అయితే వీరు ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు చేయాల్సిన అంశాలు ఇక్కడ తెలుసుకోవాలి.
పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఒత్తిడి బారిన పడుతారు. వర్కింగ్ ఉమెన్ ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించాల్సి రావడమే ఇందుకు కారణం. పిల్లలకు తల్లిగా, సీనియర్ సిటిజెన్ల అవసరాలు తీర్చేవారిగా, అలాగే కుటుంబ పోషకురాలిగా పాత్రలు పోషించాల్సి వస్తోంది. దీనికి తోడు బంధాల్లో ఉండే సమస్యలు, పిల్లలు, ఆఫీసు వ్యవహారాలు.. ఇలా అనేక తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇవన్నీ సరిపోవని.. సమాజంలో ఇంకా వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సమానత్వం దగ్గరే అసలు సమస్య. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం వంటి వాటిలో సమాన అవకాశాలు తక్కువే. ఇందుకు కారణం సమాజం మహిళల పట్ల మూసధోరణితో ఉండడమే. పురుషుల కంటే మహిళలు తక్కువ సమానమనే భావన నిండి ఉండడమే. ఇవన్నీ మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి వారికి అవకాశమే లేకుండా పోతుంది. దీంతో అనేక మానసిక, శారీరక ఆరోగ్యాలు ఎదుర్కోవలసి వస్తుంది.
మహిళల మానసిక ఆరోగ్య అవసరాలను కుటుంబ సభ్యులు గుర్తించడంలో విఫలమవుతారు. మహిళలు వారి ఆలోచనలకు ఒక క్రమబద్ధమైన రూపం ఇచ్చేందుకు, వారి ఇష్టపడింది చేయడానికి, సంతృప్తిని ఇచ్చే వాటిపై దృష్టి పెట్టేందుకు వారికి సమయమే దొరకదు.
‘మానసిక ఆరోగ్యం, మానసిక అనారోగ్యం నిర్ధారించడంలో జెండర్ కీలకపాత్ర పోషిస్తుంది. పురుషుల కంటే మహిళలు మానసిక క్షోభ, మానసిక రుగ్మతలను విభిన్నంగా ప్రదర్శిస్తారు. అలాగే వయస్సు, లక్షణాలు, మానసిక రుగ్మతల ఫ్రీక్వెన్సీ, సామాజిక సర్దుబాటు, వంటి అనేక విషయాలు మహిళల్లో వేరుగా కనిపిస్తాయి. కుటుంబ బాధ్యతలు, అధికారం, సోషల్ స్టేటస్ ప్రభావితమవుతుంది. పురుషాధిపత్యం, సామాజికంగా పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న రీతిలో నిర్వచించడం వంటి వాటి వల్ల మహిళల విలువను తగ్గించారు..’ అని ఎస్ఎల్ రహేజా హాస్పిటల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సౌమ్యా బలిగా వివరించారు.
‘దేశంలో మూడింట రెండు వంతుల మంది పెళ్లయిన మహిళలు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఇక ఆలస్యంగా గర్భ ధారణ, ప్రసవానంతర సమస్యల్లో స్ట్రెస్ సర్వ సాధారణం. కొత్తగా తల్లయిన వారిలో మెజారిటీ (50 నుంచి 80 శాతం) ప్రసవానంతర కష్టాలు ఎదుర్కొంటారు. ఇక వర్కింగ్ వుమెన్ అయితే సగానికంటే ఎక్కువ మంది వర్క్-ఫ్యామిలీ బాలెన్స్ సమస్యలు ఎదుర్కొంటారు. 90 శాతం మంది విభిన్న బాధ్యతల కారణంగా స్ట్రెస్ అనుభవిస్తారు. ఈ కారకాలన్నీ కుటుంబంలో, ఆఫీసులో వ్యక్తుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయి. మానసిక రుగ్మతలకు దారితీస్తాయి. ఇక న్యూక్లియర్ ఫ్యామిలీ (చిన్న కుటుంబాలు) కి ప్రాధాన్యత ఇవ్వడం పెరిగిపోయినందున ఇంటి స్థాయిలో ఆపన్నహస్తం అందించేందుకు పెద్దవాళ్లు ఎవరూ లేకుండాపోయారు. అందువల్ల మహిళ తన ఆందోళనలు, కష్టాలను తానే పరిష్కరించుకోవాల్సి వస్తోంది..’ అని సైకాలజిస్ట్ వివరించారు.
రోజువారీ ఒత్తిడి తగ్గించుకునేందుకు 3 ప్రభావవంతమైన మార్గాలు
స్ట్రెస్ నుంచి ఎప్పటికప్పుడు బయటపడేందుకు తగిన మార్గాలు వెతకాలి. సుస్థిర మార్గాల వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు తమ ఆరోగ్యం బాగుండాలంటే మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి.
మానసిక ఆరోగ్యంపై జర్నల్
మీ ఆలోచనలను జర్నల్ రూపంలో పెట్టడం ఒక థెరపీలా పనిచేస్తుంది. మీ భావోద్వేగాలను స్పష్టమైన రూపంలో వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది. ఆశావాద దృక్పథం అలవడుతుంది. ఫలితంగా ఇది వారి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ భావాలను వ్యక్తపరిచేందుకు రాయడం ఇంకొకరితో మాట్లాడడానికి ప్రత్యామ్నాయంగా మారుతుంది.
సమయం కేటాయించుకోండి
మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కారణాల్లో ప్రధానమైనది వారు తమ పట్ల తాము కేర్ తీసుకోకపోవడం. ఇందుకు కారణం వారికి ఏకాంతంగా ఉండేందుకు తగిన సమయం దొరకకపోవడమే. వారి భావోద్వేగాలను రీసెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. తమ జీవితానికి ఏది బాగా మేలు చేస్తుంది? ఏదీ పని చేయదు అని తేల్చుకునేందుకు కూడా ఈ సమయాన్ని వారు ఉపయోగించుకోవచ్చు.
అవసరమైతే సాయం పొందండి
మహిళలు తమకు అవసరమని భావించినప్పుడు సహాయం కోరాలి. స్ట్రెస్ నుంచి ఉపశమనానికి అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుంచి అవసరమైన సందర్భాల్లో సాయం పొందడంలో తప్పులేదు.
‘జీవితాన్ని సానుకూలంగా లీడ్ చేయాలంటే మీకు మీరు సమయం కేటాయించుకోవాలి. మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఆశావాద దృక్పథాన్ని పెంచుకోవాలి..’ అని సౌమ్య వివరించారు.