Morning Exercises । ఈ 5 సాధారణ వ్యాయామాలతో మీ ఫిట్‌నెస్ ప్రయాణం మొదలుపెట్టండి!
మిగతా సమయాల్లో కంటే ఉదయం పూట చేసే వ్యాయామాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మీరో రోజంతా శక్తివంతంగా ఉండగలుగుతారు. ఉదయం వేళ చేయగలిగే కొన్ని సాధారణ వ్యాయామాలు ఇక్కడ చూడండి.
ఎవరైతే ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తారో, వారు రోజంతా మంచి మూడ్‌లో ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వారు మరింత శక్తివంతంగా ఉంటారు, ఉత్సాహంగా పనులు చేస్తారు. ఇతరులకు కూడా సహాయపడ గలుగుతారు. ఈ విధంగా వారు ఒక మంచి సహోద్యోగి, స్నేహితుడిగా లేదా భాగస్వామి అనిపించుకుంటారు. అంతే కాదు ఉదయం పూట చేసే వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. తద్వారా ఏదైనా ఆనారోగ్యాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది. వైద్యుల అవసరం ఎక్కువగా రాదు. రోజూ ఉదయం వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటును తగ్గించవచ్చు, మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
రోజంతా గొప్ప అనుభూతిని పొందడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ ఉదయపు వ్యాయామాలు (Morning Exercises) ఇక్కడ తెలియజేస్తున్నాం. మీరు వాటిని మీ రోజూవారీ దినచర్యలో చేర్చుకోవచ్చు. జిమ్ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే సులభంగా ఈ వ్యాయామాలను ఆచరించవచ్చు.
క్యాట్ క్యామెల్ స్ట్రెచ్
దీనినే మార్జయాసన-బిటిలాసన అని కూడా అంటారు. ఇది ఒక వార్మప్ ఎక్సర్‌సైజ్. ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలు కండరాల టోనింగ్, ఆర్థరైటిస్‌ను నివారించడంలో ఉపయోగపడతాయి. ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు ఈ క్యాట్ క్యామెల్ స్ట్రెచ్ ఆసనం వేయడం ద్వారా ఇతర వ్యాయామాలు సులభంగా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. రోజులో మిగతా సమయాల్లో ఈ ఆసనం వేయడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ప్రత్యేకించి సుదీర్ఘకాలం నిశ్చలంగా ఒకే చోట కూర్చుని పనిచేసిన తర్వాత. నడుము పట్టేసినపుడు ఈ వ్యాయామం చేస్తే వెన్నెముక వశ్యతకు తోడ్పడుతుంది.
నడక లేదా పరుగు
ఉదయంపూట బహిరంగ ప్రదేశాలలో కాసేపు నడక, లేదా పరుగెత్తడం చేయాలి. తద్వారా మీరు ప్రకృతితో కనెక్ట్ అవ్వవచ్చు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు గణనీయంగా ఉన్నాయి. మీ ఎముకలలో దృఢత్వం పెంచవచ్చు, మీ బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, గుండె ఆరోగ్యంగా ఉండటానికి, రక్తపోటును అదుపులో ఉంచటానికి ఇవి సహాయపడతాయి. బయటకు వెళ్లలేకపోతే ఇంట్లో లేదా ఇండోర్ లో కూడా ట్రెడ్‌మిల్‌పై నడక లేదా పరిగెత్తడం చేసినా మంచిదే.
జంపింగ్ జాక్స్
హృదయ ఆరోగ్యానికి, కండరాలను బలోపేతం చేయటానికి ముఖ్యంగా డెల్టాయిడ్‌లకు టోన్ చేయడంలో జంపింగ్ జాక్స్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తాయి.
లెగ్ స్క్వాట్స్
గుంజీలు తీయటం ద్వారా కూడా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రెండు కాళ్లను కాస్త దూరంగా జరిపి, చేతులను ముందుకు చాచి నిటారుగా ఉంటూ కూర్చోవటం, పైకి లేవటం చేయాలి. ప్రారంభంలో 2 సెట్లను 15 సార్లు రిపీట్ చేయండి. ఈ వ్యాయామాలు మోకాలి స్థిరత్వానికి సహాయపడతాయి, కండరాలకు ప్రయోజనం చేకూరుస్తాయి
బ్యాలెన్సింగ్ టేబుల్ పోస్
దీనినే దండయమాన భర్మానాసన అని కూడా అంటారు. ఇది పొత్తికడుపు, దిగువ వెనుక కండరాలను బలపరుస్తుంది. అలాగే ఇది వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీ అందివ్వటానికి సహాయపడుతుంది.
వీటితో పాటు పుష్పప్స్, స్కిప్పింగ్, అబ్డక్టర్ సైడ్ లిఫ్ట్స్ ఇలాంటి వ్యాయామాలను ఉదయపు దినచర్య కోసం ఎంచుకోవచ్చు.
సంబంధిత కథనం