Mango Basundi: శ్రావణమాసానికి తీయని ప్రసాదం మామిడి బాసుంది, ఈ స్వీట్ చేయడం చాలా సులువు
Mango Basundi: మామిడి బాసుంది చాలా రుచిగా ఉంటుంది. శ్రావణమాసంలో పాయసానికి బదులు ఈ రెసిపీని కూడా నివేదించవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఇది అందరికీ నచ్చుతుంది. బాసుంది ఎలా చేయాలో తెలుసుకోండి.
శ్రావణ మాసం ఎంతో పవిత్ర మాసం. ఈ మాసంలో తీపి పదార్థాలను చేసి లక్ష్మీదేవికి నివేదిస్తారు. ఎక్కువగా పాయసం, స్వీట్ పొంగలి వంటి వాడినే ప్రసాదంగా చేస్తారు. ఒకసారి మామిడి బాసుంది కూడా చేసి చూడండి. మరికొన్ని రోజుల్లో మామిడి పండ్లు కూడా దొరకవు. మళ్లీ వేసవి వరకు వేచి యుండాలి. ఇప్పుడే మామిడి పండ్లతో బాసుందిని చేసి శ్రావణసోమవారాల్లో ప్రసాదంగా పెట్టవచ్చు. ఈ డెజర్ట్ రెసిపీ రుచి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. అంతే కాదు ఇంటికి వచ్చే అతిథులకు మామిడి బసుండి డెజర్ట్ వడ్డించవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన, రుచికరమైన రెసిపీ. ఇది చాలా తక్కువ సమయంలో తయారవుతుంది. కాబట్టి మ్యాంగో బాసుంది రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మ్యాంగో బాసుంది రెసిపీకి కావలసిన పదార్థాలు
ఫుల్ క్రీమ్ మిల్క్ - ఒకటిన్నర లీటరు
కుంకుమపువ్వు - చిటికెడు
పచ్చి యాలకుల - ఒక స్పూను
తరిగిన డ్రై ఫ్రూట్స్ - పావు కప్పు
మామిడి పండు గుజ్జు - ఒక కప్పు
మామిడి బాసుంది రెసిపీ
- స్టవ్ మీద కళాయి పెట్టి పాలు, చిటికెడు కుంకుమపువ్వు రేకలు వేసి ఎక్కువ మంట మీద వేడి చేయాలి.
- పాలు మరుగుతున్నప్పుడు మంట తగ్గించేయాలి. అరగంట పాటూ చిన్నమంట మీద మరిగించాలి.
- అవి బాగా మరిగి పాలు సగానికి తగ్గే వరకు అలాగే ఉంచాలి.
- గిన్నెకు పాలు క్రీములా అతుక్కుపోకుండా స్పూనుతో కలుపుతూనే ఉండాలి.
5. పాలు చిక్కగా, క్రీమీగా మారిన తర్వాత కళాయిలో పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్ వేసి మరో 3-4 నిమిషాలు ఉడికించాలి.
6. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పాల పైన క్రీమ్ ఏర్పడకుండా ఉండటానికి మూత పెట్టాలి.
7. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చే వరకు పాల మిశ్రమాన్ని చల్లబరచండి.
8. ఇప్పుడు అందులో ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేసి బాగా కలపాలి.
9. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి.
10. సర్వ్ చేసే ముందు పైన తరిగిన మామిడిపండ్లు, సీడ్స్, నట్స్, ఎండిన గులాబీ రేకులు వేయాలి. అంతే టేస్టీ మామిడి బాసుంది రెడీ అయినట్టే.
మామిడి పండ్ల సీజన్ మరికొన్ని రోజుల్లో అయిపోతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మామిడి పండ్లు దొరకడం లేదు. ఇవి దొరికినప్పుడే మామిడి బాసుంది స్వీట్ ను చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని చూడండి ఇది ఐస్ క్రీములా నోట్లో పెడితే కరిగిపోతుంది.