Spices For Digestion: వీటిని వంటలో వాడితే.. ఆహారం ఇట్టే జీర్ణమవుతుంది..-spices in kitchen that increases digestive power ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spices For Digestion: వీటిని వంటలో వాడితే.. ఆహారం ఇట్టే జీర్ణమవుతుంది..

Spices For Digestion: వీటిని వంటలో వాడితే.. ఆహారం ఇట్టే జీర్ణమవుతుంది..

HT Telugu Desk HT Telugu
Sep 04, 2023 05:05 PM IST

Spices For Digestion: ఆహారం సులభంగా జీర్ణమవడానికి ఆహారంలో కొన్ని సుగంధ ద్రవ్యాలను చేర్చుకుంటే మేలు. అవేంటో, ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.

జీర్ణశక్తిని పెంచే సుగంధద్రవ్యాలు
జీర్ణశక్తిని పెంచే సుగంధద్రవ్యాలు (pexels)

జీర్ణ శక్తి బాగుంటే ఆరోగ్యం బాగున్నట్లే. మనం తీసుకునే ఆహారం బట్టే అది జీర్ణమవ్వడం ఆధారపడి ఉంటుంది. మన వంటిళ్లలో సహజంగానే జీర్ణ శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు బోలెడుంటాయి. అలాంటి వాటిలో మనకు చాలా తేలికగా అందుబాటులో ఉండే పదార్థాలే ఎక్కువ. వాటిని ఆహారంలో తరచూ వాడటం ద్వారా మన జీర్ణ శక్తి ఎలా మెరుగవుతుందో చూసేద్దాం.

అల్లం :

దీర్ఘకాలిక అజీర్తి సమస్యలు ఉన్న వాళ్లకి అల్లం చక్కని మందులా పని చేస్తుంది. తరచూ వచ్చే కడుపు నొప్పులను తగ్గిస్తుంది. అల్లం టీ చేసుకోవడం, వండుకునే ఆహార పదార్థాల్లో దీన్ని చేర్చడం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. కడుపు సక్రమంగా ఖాళీ అవడానికీ ఇది సహకరిస్తుంది.

ధనియాలు :

కడుపులో కాస్త ఉబ్బరంగా, వికారంగా ఉన్నప్పుడు ధనియాలు, మిరియాలు నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ధనియాల్లో ఉండే కొన్ని లక్షణాల వల్ల గ్యాస్‌ సమస్యలు దూరం అవుతాయి.

యాలకులు :

కడుపులో మంట, పొట్ట నొప్పి, వికారం లాంటి వాటికి యాలకులు మందులా పని చేస్తాయి. దీంట్లో మాంగనీసు ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం సవ్యంగా అరిగి శక్తినిచ్చేలా చేస్తుంది. మధుమేహం నుంచి కాపాడుతుంది.

మెంతులు :

ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతుల్ని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి.

సోంపు :

మన దగ్గర రెస్టారెంట్లు అన్నింటిలోనూ ఆహారం తినడం పూర్తయిన వెంటనే సోంపు గింజలనూ ఇస్తుంటారు. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం కావడానికి సోంపు గింజలు పనికి వస్తాయి. ఇంట్లో కూడా తిన్న వెంటనే కొన్ని సోంపు గింజలు వేసుకుని నమిలితే ఆహారం జీర్ణమైన భావన వచ్చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం, జింక్‌, మాంగనీసు, ఐరన్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిజేయడంలో సహకరిస్తాయి.

జీలకర్ర :

జీలకర్రలో ఎక్కువగా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్‌ ఏ, సీ, కే, ఈ, బీ6 లూ ఎక్కువగా ఉంటాయి. రోజూ 1 టీ స్పూనుడు జీలక్ర తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. పేగుల్లో పేరుకుపోయిన మళినాలను తొలగించడంలో ఇది సహకరిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. దీన్ని భోజనానికి ముందు కొంచెం తీసుకుంటే డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌ని ప్రేరేపిస్తుంది. జీర్ణ క్రియలో సహకరిస్తుంది.

Whats_app_banner