joint issues with smartphone: ఫోన్ ఎక్కువగా వాడితే.. కళ్లకే కాదూ, కీళ్లకీ నష్టమే-six joint issues smartphone overuse can cause ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Issues With Smartphone: ఫోన్ ఎక్కువగా వాడితే.. కళ్లకే కాదూ, కీళ్లకీ నష్టమే

joint issues with smartphone: ఫోన్ ఎక్కువగా వాడితే.. కళ్లకే కాదూ, కీళ్లకీ నష్టమే

Koutik Pranaya Sree HT Telugu
May 23, 2023 02:21 PM IST

joint issues with smartphone: స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడటం వల్ల పిల్లల్లో కీళ్ల నొప్పుల సమస్య వస్తోంది. దీనిగురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.

స్మార్ట్ ఫోన్ అతి వాడకం
స్మార్ట్ ఫోన్ అతి వాడకం (Pixabay)

పెద్ద పరిశోధనలు, డాక్టర్లు చెప్పినా చెప్పకపోయినా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం సరికాదని మనకే తెలుసు. కానీ మానేయం. దాని ప్రభావం కళ్లమీదే ఉంటుందనుకుంటాం. కానీ అంతటితో ఆగదు. నిద్ర తగ్గుతుంది, జ్ఞాపక శక్తి మందగిస్తుంది, కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టమవుతుంది. ఫోన్ వాడేటపుడు ఇష్టం వచ్చినట్లు కూర్చుంటే వెన్ను కూడా దెబ్బతింటుంది. చిన్న వయసులోనే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తక్కువ వయసు పిల్లల్లోనే ఈ మధ్య కీళ్ల సమస్యలు వస్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లే. పని కోసం, సోషల్ మీడియా కోసం, ఆన్లైన్ షాపింగ్, చాటింగ్ ఇలా ప్రతిదానికి ఫోన్ విపరీతంగా వాడేస్తున్నాం. నిద్ర లేవాలన్నా ఫోనే అలారం పెట్టి లేపాలి. దీర్ఘకాలికంగా స్మార్మ్ ఫోన్ ఎక్కువగా వాడితే చాలా నష్టాలుంటాయిని డాక్టర్ గంగ్నేజా తెలిపారు.

  1. మెడ, భుజం నొప్పి: రోజుకు రెండు నుంచి మూడు గంటల మించి ఫోన్ వాడకూడదు. దానివల్ల భుజం, మెడ నొప్పులు, వెన్ను నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది.
  2. ఆస్టియోఆర్తరైటిస్: ఫోన్ లో టైప్ చేయడానికి, గేములు ఆడటానికి బొటన వేలు వాడతాం. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల మొదటి కార్పోమెటాకార్పల్ కీలుకు ఆస్టియోఆర్తరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది మామూలుగా పెద్దల్లో కనిపించేదే అయినా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లలో తక్కువ వయసులోనే ఈ సమస్య వస్తోంది.
  3. మణికట్టు: నిరంతర ఫోను వాడకం వల్ల తరచూ మణికట్టు భాగంలో కదలిక ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మణికట్టు నొప్పి మొదలవుతుంది.
  4. మోచేతులు: మోచేతిని ఫోన్ వాడే అంత సేపు వంచి ఉంచాలి. దానివల్ల మోచేతుల్లో నొప్పి, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది.
  5. హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్(HAVS) : ఎక్కువ సేపు ఫోన్లో గేములు ఆడేవాళ్లకి ఈ సమస్య వస్తుంది. చేయిలో నొప్పి పెరుగుతుంది. ఫోన్ పట్టుకున్నపుడు ఆ నొప్పి ఇంకా ఎక్కవుంటుంది.
  6. నొప్పి: చేతి, మణికట్టులో నొప్పి, జలదరింపు, తిమ్మిరి లేదా వైకల్యానికి కారణమవుతుంది.

ఈ సమస్యలు రాకుండా ఫోన్ వాడేటపుడు రెండు చేతులు వాడండి. కాస్త ప్రభావం తగ్గొచ్చు. మీరు కూర్చునే స్థతి సరిగ్గా ఉండేలా చూసుకోండి.

Whats_app_banner