Sweet with Bread: దీపావళికి సింపుల్‌గా బ్రెడ్‌తో షాహీ తుక్డా స్వీట్ చేసి పెట్టండి, చేయడం చాలా సింపుల్
Sweet with Bread: ఈ ఏడాది దీపావళికి మార్కెట్ నుంచి స్వీట్లు తెచ్చే బదులు ఇంట్లో తయారుచేసిన స్వీట్లను క్షణాల్లో తయారు చేసుకోవడం మంచిది. బ్రెడ్ తో తయారు చేసిన టేస్టీ డెజర్ట్ షాహీ తుక్డా. ఇది చాలా టేస్టగా ఉంటుంది.
దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో స్వీట్లు ఉండాల్సిందే. కొంతమంది ఇంట్లో స్వీట్లు తయారు చేయడానికి కూడా ఇష్టపడతారు. కానీ పండుగలకు సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్లను కొనేసేవారు కూడా ఎక్కువ. స్వీట్లను కొనే కన్నా ఇంట్లోనే సులువుగా వండితే మంచిది. ఇక్కడ మేము బ్రెడ్ తో వండే రాయల్ రెసిపీని ఇచ్చాము. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది, వండడానికి సులభంగా ఉంటుంది. ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బ్రెడ్ స్వీట్ షాహీ తుక్డా రెసిపీకి కావల్సిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు - నాలుగు
నెయ్యి - నాలుగు స్పూన్లు
పంచదార - అయిదు స్పూన్లు
పిస్తా తరుగు - ఒక స్పూను
జీడిపప్పు తరుగు - ఒక స్పూను
బాదం తరుగు - ఒక స్పూను
ఫుల్ క్రీమ్ మిల్క్ - రెండు కప్పులు
యాలకుల పొడి - అరస్పూను
బ్రెడ్ స్వీట్ షాహీ తుక్డా రెసిపీ
- బ్రెడ్ తో చేసే సింపుల్ స్వీట్ షాహీ తుక్డా. దీని రెసిపీ చాలా సులువు.
- స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో బ్రెడ్ ముక్కలను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద గిన్నె పెట్టి పాలను వేసి మరిగించాలి. వాటిని చిన్న మంట మీద పెట్టి గంట పాటు మరిగిస్తే అవి చిక్కగా మారుతాయి. రంగు కూడా మారుతాయి.
- ఆ పాలలోనే పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు పాలను పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాడి పాత్రలో బ్రెడ్ ముక్కలను ఒకదాని పక్కన ఒకటి ఉంచి పాల మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలపై పోయాలి.
- పిస్తా తరుగు, జీడిపప్పు తరుగు, బాదం తరుగును పైన చల్లి గార్నిష్ చేయాలి. అంతే టేస్టీ షాహీ తుక్డా రెడీ అయినట్టే.
- దీపావళి రోజున ఈ స్వీట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించండి. వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.
బ్రెడ్ తో చేసే ఏ స్వీట్ అయిన చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. మీకు కష్టంగా కూడా అనిపించదు. అంతేకాదు వాటికి చేసే ప్రాసెస్ కూడా సులువే కాబట్టి, దీపావళికి పైన చెప్పిన షాహీ తుక్డా ప్రయత్నించండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం.