SenagaPindi Charu: శెనగపిండితో చేసే టేస్టీ చారు, సాంబార్ కన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది, రెసిపీ తెలుసుకోండి-senagapindi charu recipe in telugu know how to make this charu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Senagapindi Charu: శెనగపిండితో చేసే టేస్టీ చారు, సాంబార్ కన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది, రెసిపీ తెలుసుకోండి

SenagaPindi Charu: శెనగపిండితో చేసే టేస్టీ చారు, సాంబార్ కన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది, రెసిపీ తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Sep 26, 2024 11:30 AM IST

SenagaPindi Charu: ఎప్పుడూ ఒకే రకమైన చారు తింటే కొత్త టేస్ట్ ఏం తెలుస్తుంది. ఇక్కడ మేము శెనగపిండి చారు ఇచ్చాము. దీని రుచి సాంబార్ కన్నా అదిరిపోతుంది. దీని రెసిపీ చాలా సులువు.

శెనగపిండి చారు రెసిపీ
శెనగపిండి చారు రెసిపీ (Youtube)

SenagaPindi Charu: గ్రామాల్లో ఇప్పటికీ ఖచ్చితంగా రోజూ ఇంట్లో చారు వండాల్సిందే. ఎప్పుడూ ఒకేలాగా రసం చేస్తే కొత్త టేస్టులు తెలియవు. ఇక్కడ మేము శెనగపిండితో చేసే చారు రెసిపీ ఇచ్చాము. ఇది కాస్త చిక్కగా ఉంటుంది. దీన్ని అన్నంలోనే కాదు ఉప్మాలో వేసుకుని తిన్నా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని రుచి తెలుస్తుంది. ఇడ్లీలతో కూడా అదిరిపోతుంది. ఈ శెనగపిండి చారు ఎలా చేయాలో తెలుసుకోండి.

శెనగపిండి చారు రెసిపీకి కావలసిన పదార్థాలు

శెనగపిండి - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

టమాటోలు - మూడు

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

చింతపండు - నిమ్మకాయ సైజులో

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

పసుపు - అర స్పూను

కారంపొడి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

సాంబార్ పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

శెనగపిండి చారు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

2. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి.

3. ఆ తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.

4. అలాగే నిలువుగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.

5. కరివేపాకులు కూడా వేసి వేయించాలి.

6. ఇవన్నీ వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.

7. టమోటాలను సన్నగా తరిగి వాటిని కూడా వేసి వేయించాలి.

8. పైన మూత పెట్టి టమాటోలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

9. ఆ తర్వాత మూత తీసి కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

10. చింతపండును ముందుగానే నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి.

11. ఆ తర్వాత చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

12. ఇది మరుగుతున్నప్పుడు పక్కన ఒక గిన్నెలో శెనగపిండిని వేసి రెండు కప్పుల నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టుకోవాలి.

13. ఆ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసేయాలి.

14. చిన్న మంట మీద దీన్ని ఉడికించాలి.

15. శెనగపిండి త్వరగా గట్టిగా మారిపోతుంది.

16. కాబట్టి చిన్న మంట పెట్టి గరిటతో కలుపుతూ ఉండాలి, లేకుంటే పిండి అంతా అడుగుభాగానికి చేరి అతుక్కుపోతుంది.

17. పది నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడికించాక కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.

18. అలాగే సాంబార్ పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

19. ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేయాలి.

20. అంతే శెనగపిండి చారు రెడీ అయినట్,టే దీని రుచి మామూలుగా ఉండదు.

శెనగపిండి చారును ఒకసారి చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ లోను, లంచ్ లోను, డిన్నర్ లో కూడా తినవచ్చు. అలాగే ఇడ్లీ, సాంబారు కన్నా కూడా ఇడ్లీ సెనగపిండి చారు రుచిగా ఉంటుంది. ఉప్మాపై కూడా తీసుకొని తింటే రుచి మాములుగా ఉండదు. వేడివేడి అన్నంలో ఈ శెనగపిండి చారు కలుపుకొని చూడండి. అద్భుతంగా అనిపిస్తుంది.

టాపిక్