Semiya Bobbatlu: సేమియా బొబ్బట్లు రెసిపీ, సాధారణ బొబ్బట్ల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి
Semiya Bobbatlu: బొబ్బట్లు అంటే మీకు ఇష్టమా? ఎప్పుడూ శనగపప్పు, పెసరపప్పుతోనే కాదు ఒకసారి సేమియాతో బొబ్బట్లు చేసి చూడండి. రుచి మాములుగా ఉండదు.
Semiya Bobbatlu: ఇంట్లో వేడుకలు, పండగలు ఏవి వచ్చినా కూడా బొబ్బట్లు అందరికీ గుర్తొస్తాయి. నెయ్యితో దట్టించిన ఈ బొబ్బట్లు తింటే నోరూరిపోతుంది. ఎక్కువగా బొబ్బట్లను సెనగపప్పును ఉడకబెట్టి చేస్తారు. ఇక్కడ మేము సేమియాతో ఎలా చేయాలో ఇచ్చాము. సేమియా బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తగా కూడా ఉంటాయి. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
సేమియా బొబ్బట్లు రెసిపీకి కావలసిన పదార్థాలు
సేమియా - ఒక కప్పు
గోధుమపిండి - ఒక కప్పు
చక్కెర - ముప్పావు కప్పు
నీరు - తగినంత
నెయ్యి - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
బాదం పప్పులు - గుప్పెడు
యాలకుల పొడి - చిటికెడు
జీడిపప్పు - గుప్పెడు.
సేమియా బొబ్బట్లు రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి బాగా కలపండి. చిటికెడు ఉప్పును వేయండి. రెండు స్పూన్ల నూనె కూడా వేసి ఒకసారి కలుపుకోండి.
2. ఇప్పుడు పిండిలో నీరు వేస్తూ మెత్తగా కలుపుతూ ఉండండి.
3. చపాతీ కోసం ఎలా అయితే పిండిని కలుపుకుంటారో అలా కలిపి పక్కన పెట్టండి.
4. ఈ పిండి మరీ మందంగా కాకుండా, కాస్త మెత్తగా ఉండేలా కలుపుకోండి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
6. ఆ నెయ్యిలో సేమియాను వేసి రంగు మారేవరకు వేయించండి.
7. ఆ సేమియాను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి.
8. అదే కళాయిలో రెండు కప్పుల నీళ్లు వేసి మరిగించండి.
9. నీళ్లు బాగా మరిగాక ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను అందులో వేసి కలుపుకోండి.
10.అలాగే చక్కెరను పంచదారను కూడా వేసి బాగా కలుపుకోండి.
11. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు కలుపుకోండి.
12. ఇప్పుడు మంట తగ్గించండి. పైన తురిమిన కొబ్బరిని వేయండి. కొబ్బరిపొడి కలిపితే రుచి అదిరిపోతుంది.
13. అలాగే జీడిపప్పు, బాదం పప్పులను మిక్సీలో పొడిలా చేసుకుని వాటిని కూడా వేసి బాగా కలపండి.
14. యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి.
15. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. సేమియా మిశ్రమాన్ని చల్లార్చండి.
16. ఆ సేమియాను చిన్న చిన్న బాల్స్ లా చేసి పక్కన పెట్టుకోండి.
17. స్టవ్ మీద పెనం పెట్టి నూనె నెయ్యి రాయండి.
18. గోధుమ పిండి లోంచి కొంత మొత్తాన్ని తీసి చపాతీలా ఒత్తి దాని మధ్యలో సేమియాను పెట్టి మళ్ళీ మడవండి.
19. దాన్ని బొబ్బట్టులా ఒత్తుకొని పెనంపై రెండువైపులా కాల్చుకోండి.
20. అంతే టేస్టీ సేమియా బొబ్బట్టు రెడీ అయిపోతుంది.
21. కాస్త నెయ్యి పైన రాసుకొని తింటే రుచి మామూలుగా ఉండదు.
మీకు పంచదార ఇష్టం లేకపోతే దీన్ని బెల్లాన్ని వేసి చేసుకోవచ్చు. అదిరిపోతుంది, ఒక్కసారి చేసి చూడండి మీకు నచ్చడం ఖాయం.