Semiya Laddu: తీయ తీయని సేమియా లడ్డూలు, పిల్లలకు బెస్ట్ స్నాక్ ఇది
Semiya Laddu: పిల్లలకు ఇంట్లోనే స్వీట్లను తయారు చేసి ఇస్తే మంచిది. ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్లు తినిపించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ సేమియా లడ్డు ఎలా చేయాలో చెప్పాము.
Semiya Laddu: సేమియా పేరు చెబితే అందరికీ పాయసమే గుర్తొస్తుంది. లేదా సేమియా ఉప్మా తప్ప ఇంకేమీ గుర్తు రాదు. సేమియాతో టేస్టీ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. చక్కెర లేకుండా ఈ లడ్డూలను చేయొచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి నచ్చడం ఖాయం. అలాగే పండగల సమయంలో నైవేద్యంగా కూడా వీటిని పెట్టవచ్చు. సేమియా లడ్డు ఎలా చేయాలో తెలుసుకోండి.
సేమ్యా లడ్డూ రెసిపీకి కావలసిన పదార్థాలు
కోవా - అరకప్పు
బెల్లం తురుము - పావు కప్పు
సేమియా - ఒక కప్పు
బాదం పప్పు - గుప్పెడు
రోజ్ వాటర్ - ఒక స్పూను
సేమియా లడ్డూ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి సేమియా వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఆ కళాయిలో బెల్లాన్ని, నీళ్లు వేయాలి.
3. బెల్లం మరుగుతున్నప్పుడు కోవా వేసి కలుపుకోవాలి.
4. అందులోనే వేయించిన సేమియా, బాదం పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. సేమియా ఆ నీళ్లలో కాస్త ఉడకనివ్వాలి.
5. ఇవన్నీ గట్టి మిశ్రమంలా అవుతుంది. అప్పుడు రోజ్ వాటర్ ను చల్లుకొని స్టవ్ కట్టేయాలి.
6. ఈ మిశ్రమం కాస్త చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి. దీనిలో కాస్త నెయ్యి కూడా వేసుకుంటే అదిరిపోతుంది.
చక్కెర వేసిన స్వీట్‌లను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పిల్లలకు కూడా చక్కెర వేసిన పదార్థాలు పెట్టకపోవడమే మంచిది. ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిస్ దాడి చేస్తుంది. చక్కెర తినిపించడం వల్ల పిల్లలకు అనేక రకాల సమస్యలు రావచ్చు. ఎవరైనా కూడా చక్కెరను ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యకరం.
టాపిక్