Contraception: కండోమ్ ఒక్కటే కాదు.. అందుకు ఇవీ ఉన్నాయ్
Contraception: గర్భం రాకుండా వాడే గర్భ నిరోధక మార్గాలు అందరికీ తెలీనివి చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని మార్గాల గురించి, వాటి వాడకం, అవెలా పనిచేస్తాయో వివరంగా తెల్సుకోండి.
ప్రెగ్నెన్సీ రాకుండా ఎంచుకోవాల్సిన మార్గమంటే గుర్తొచ్చేది కండోమ్ మాత్రమే. కానీ అదొక్కటే కాకుండా అందరికీ తెలీని అనేక గర్భనిరోధక మార్గాలున్నయి. వాటిలో కొన్నింటిని వాడటం చాలా తేలిక కూడా. ప్రెగ్నెన్సీ వాయిదా వేయడానికి మాత్రమే మీ జాగ్రత్త అయితే దానికోసం మరింకేం మార్గాలున్నాయో చూడండి.
గర్భనిరోధక మార్గాలు:
1. కాంట్రాసిప్టివ్ ప్యాచ్:
ఇది సాధారణంగా చతురస్రాకారంలో ఉండే బ్యాండ్ ఎయిడ్ లాగా ఉంటుంది. దీన్ని చర్మం మీద అంటించుకోవాలి. అప్పుడది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రిరాన్ హార్మోన్లను కృత్రిమంగా శరీరంలోకి విడుదల చేస్తుంది. దీంతో అండం విడుదల కాకుండా ఆపుతుంది. దీన్ని ఎక్కడైనా అంటించుకోవచ్చు. భుజం, పొత్తికడుపు కింద, భుజం, పిరుదుల దగ్గర అంటించుకుంటే మంచిది. దీన్ని వారానికి ఓసారి మార్చుకుంటే సరిపోతుంది. ఇదొక సింపుల్ గర్భనిరోధక మార్గం అనుకోవచ్చు.
2. వజైనల్ రింగ్:
ఇది కూడా హార్మోన్ల ఆధారంగానే పనిచేసే ఒక పరికరం. దాని పేరు చెబుతున్నట్లే యోనిలో పెట్టుకునే రింగ్ ఇది. చూడ్డానికి కాస్త మందం రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. దాన్ని యోనిలోపల దూర్చి పెట్టుకోవాలి. నెలసరి సమయంలో ఈ రింగు మార్చుకుని కొత్తది పెట్టుకోవాలి. ఈ రింగ్ కూడా హార్మోన్లను విడుదల చేసి ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది.
3. ఐయూడీ (ఇంట్రా యుటిరిన్ డివైసెస్):
ఇంట్రా యుటిరిన్ డివైసెస్ అంటే వీటిని గర్భాశయంలో అమరుస్తారు. వీటిలో హార్మోనల్ రకాలు, కాపర్ టీ లాంటి నాన్ హార్మోనల్ రకాలూ ఉంటాయి. వీటి ప్రభావం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతాయి. వీటికి నిరంతర వైద్య పరివేక్షణ కూడా అవసరం ఉండదు. తక్కువ ధరలో దొరికే ఉత్తమ మార్గం ఇది.
4. గర్భనిరోధక మాత్రలు:
చాలా మంది మహిళలు సౌకర్యం దృష్టిలో ఉంచుకుని వాడే గర్భనిరోధక మార్గాల్లో మాత్రలు ముందుంటాయి. వీటిలో ఎక్కువగా ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి చేసే మాత్రలుంటాయి. వీటిని ప్రతిరోజూ ఒకే సమయంలో వేసుకోవాలి. ఇది అండం విడుదలను ఆపి ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తాయి. వీటిలోనే ఎమర్జెన్సీ కాంట్రాసిప్షన్ మాత్రలూ ఉంటాయి. జాగ్రత్త లేకుండా జరిగిన కలయిక తర్వాత 48 గంటల్లో దీన్ని వాడొచ్చు. ఇవి గర్భం రాకుండా చూస్తాయి.
5. ఇంప్లాంట్స్:
వీటిని కాంట్రాసిప్టివ్ ఇంప్లాంట్స్ అనీ అంటారు. ఒక చిన్న రాడ్ లాంటి పరికరం ఒకటి భుజం దగ్గర చర్మం కింది అమరుస్తారు. ఇది ప్రెగ్నెన్సీ రాకుండా ఎక్కువ రోజుల పాటూ రక్షణగా ఉంటుంది. ఇది వైద్యులు మాత్రమే చేయాల్సిన ప్రక్రియ.