Pregnancy: గర్భనిరోధక మాత్రలు వాడడం ఆపేసాక ఎన్ని రోజుల్లో మీకు గర్భం రావచ్చు?
Pregnancy: కొత్తగా పెళ్లయిన వారు గర్భనిరోధక పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆ పద్ధతులను ఆపేశాక ఎన్ని రోజుల్లో గర్భం ధరించే అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
Pregnancy: అవాంచిత గర్భధారణను అడ్డుకోవడానికి ఎన్నో జనన నియంత్రణ పద్ధతులు అమల్లో ఉన్నాయి. ఎక్కువ మంది ఫాలో అయ్యేవి గర్భనిరోధక మాత్రలనే. మహిళలు ఈ గర్భనిరోధక మాత్రలను తరచూ వాడుతూ ఉంటారు. అయితే గర్భం ధరించాలన్న కోరిక పుట్టాక జనన నియంత్రణ పద్ధతులను ఫాలో అవ్వడం ఆపేస్తారు. ఇలా ఆపేసాక గర్భం ఎన్ని రోజుల్లో వస్తుందో అన్న ఆత్రుత ఎంతో మందిలో ఉంటుంది. ఈ విషయంలో కొత్తగా పెళ్లయిన జంటలకు అవగాహన అవసరం.
గర్భం ఎప్పుడు వస్తుంది?
2018లో చేసిన ఒక పరిశోధన ప్రకారం గర్భనిరోధక పద్ధతులను నిలిపివేసిన తర్వాత 83 శాతం మంది మహిళలు ఒక సంవత్సరంలోపే గర్భవతులు అయ్యారు. కొంతమంది రెండు మూడు నెలల్లోనే గర్భం ధరించిన సంఘటనలు ఉన్నాయి. విరోధక మాత్రలను ఆపేసాక నెలా, రెండు నెలల్లోనే గర్భం ధరించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మహిళల్లో రుతు చక్రాలు, అండోత్సర్గము వంటివి సాధారణంగా పునరుద్ధరణ జరగడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. కొంతమంది స్త్రీలలో గర్భనిరోధక మాత్రలు ఆపేసాక కొన్ని వారాలలో అండోత్సర్గము కావచ్చు. మరికొందరికి నెలల సమయం పట్టొచ్చు. కాబట్టి కొంతమందికి గర్భనిరోధక మాత్రలు ఆపేశాక రెండు మూడు నెలలకే గర్భం ధరిస్తే, మరికొందరికి ఏడాది సమయం పడుతుంది.
గర్భనిరోధక మాత్రలు వాడడం ఆపేశాక... శరీరం దాని సహజ హార్మోన్ల సమతుల్యతను తిరిగి చేరుకోవడానికి కొంత సమయం అవసరం. అలా చేరుకున్నాక గర్భధారణ సులువు అవుతుంది. అలాగే కొంతమంది మహిళలు లూప్ పరికరాలను వినియోగిస్తారు. దీన్నిIUD అని కూడా పిలుస్తారు. వీటిని యోని ద్వారా గర్భాశయ ముఖ ద్వారం దగ్గర అమరుస్తారు. అవి వీర్యకణం, అండం కలవకుండా అడ్డుకుంటాయి. సంతానం కావాలనుకున్నప్పుడు తొలగించుకోవాల్సి వస్తుంది. ఇలా లూప్ తొలగించాక ఎక్కువ మందిలో గర్భం త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే లూప్ ధరించడం అనేది అన్నిటికన్నా మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు.
సంతానోత్పత్తి సామర్థ్యం అనేది వయసు, ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. వయసు ఎక్కువగా ఉన్న వారిలో గర్భనిరోధక మాత్రలు ఆపేసిన తర్వాత గర్భం రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. 35 ఏళ్లు నిండిన వారిలో ఇలా గర్భం ధరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గర్భనిరోధక మాత్రలు ఆపిన తర్వాత కూడా వారు గర్వం ధరించడానికి ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టవచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఇంకా తక్కువ సమయంలోనే గర్భం ధరించవచ్చు.
మాత్రలను లేదా జనన నియంత్రణ పద్ధతులను పాటించడం ఆపేశాక కూడా గర్భం ధరించలేక పోతే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవడం అవసరం. జనన నియంత్రణ పద్ధతులను ఆపేసాక ఆరు నెలలపాటు వేచి చూడండి. ఆరు నెలల్లో మీకు గర్భం రాకపోతే వెంటనే మీ వైద్యులను కలిసి తగిన పరీక్షలు, చికిత్సలు తీసుకోవడం ముఖ్యం.