Saturday Motivation | మీకు జీవితంలో అవమానాలు ఎదురయినంత మాత్రాన మీ విలువ తగ్గినట్లు కాదు!
Saturday Motivation: జీవితంలో మీకు చాలా అవమానాలు ఎదురయి ఉండవచ్చు, మీరు ఎందుకు పనికిరాని వారని మీకు మీరే భావించవచ్చు. కానీ అది తప్పు.. ఈ స్పూర్థిదాయకమైన కథ చదివి ప్రేరణ పొందండి..
Saturday Motivation: జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి, మీరు పైకి రావాలి అని కోరుకునేవారి కంటే, మీరు కిందపడితే చూడాలి అని కోరుకునేవారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. ఇది వినటానికి కాస్త కష్టంగా అనిపించినా, చేదు నిజం ఇదే. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతో మంది తారసపడతారు, వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించే వారూ ఉండవచ్చు, మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకునే వారు ఉండవచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. మీరు ఎంతో మంచి వారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మకద్రోహం చేయవచ్చు, మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినపుడు నిజస్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు, మీపైనే బురద జల్లుతారు, మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరతారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు.
అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి! ఎవరు ఎన్ని చేసినా, మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరెంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో, మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం కచ్చితంగా దక్కితీరుతుంది.
ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం.. ఒకసారి ఒక పెద్ద హాలులో చాలా మంది కూర్చున్నారు. ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి అక్కడికి రాబోతున్నాడు, ఆయన మాటలు వినడానికి అందరూ అక్కడికి వచ్చారు. పది నిమిషాల తర్వాత ఆ వ్యక్తి వేదికపైకి వచ్చి, మీరు నన్ను సరిగ్గా విని అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్తాడు.
ఆ తర్వాత తన జేబులోంచి మిళమిళ మెరుస్తున్న ఒక బంగారు నాణేన్ని తీసి పట్టుకుని మీలో ఈ నాణేం ఎవరికి కావాలి అని అడిగాడు, అందరూ చేతులు పైకెత్తారు. మీలో ఒకరికి ఈ నాణేం ఇస్తాను కానీ దీని కోసం మీరు కాస్త వెయిట్ చేయాలి అని అంటాడు.
కాసేపాయ్యాక ఆ వ్యక్తి నాణేన్ని కిందవేసి రుద్దుతాడు, దీంతో అది కాస్త పాతదిగా కనిపిస్తుంది. దీని తర్వాత, అతను మళ్లీ ఆ నాణేన్ని లేపి, ఇప్పుడు ఎవరికి కావాలి అని అడిగాడు. ఈసారి కూడా అందరూ చేతులెత్తేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి నాణేన్ని వంచుతూ వంకరగా చేస్తాడు, కాళ్లతో తొక్కుతూ మురికిగా మారుస్తాడు. మళ్లీ అడుగుతాడు, ఇప్పుడు ఎవరికీ కావాలి అని.. మళ్లీ అందరూ కావాలనే చేతులు పైకి ఎత్తుతారు.
అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ చూశారుగా.. దీనిని నేలకేసి తొక్కినా, వంకరగా చేసినా, మురికిగా మార్చినా మీరు కోరుకుంటున్నారు. మేలిమి బంగారాన్ని ఎంత మురికి చేసినా దాని విలువ తగ్గదు.. మీరు కూడా అంతే, మీరంతా మేలిమి బంగారాలే. జీవితం కొన్నిసార్లు పెద్ద షాక్‌లను ఇస్తుంది, మీరు పరీక్షలో విఫలమవుతారు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలో విఫలమవుతారు, వ్యాపారాల్లో నష్టపోతారు, ప్రేమలో విఫలమవుతారు, పెళ్లి జరగదు, జరిగిన పెళ్లి చెడిపోవచ్చు. ఇలా మీ జీవితం అంతా చిన్నాభిన్నం అవ్వొచ్చు. అంతమాత్రాన మీరు విలువలేని వారు కాదు. మీ విలువను మీరు గుర్తించండి, జీవితంలో మీకు తిరుగుండదు అని చెప్తాడు.
ఇప్పుడు అర్థమైందిగా, మీ బ్యాడ్ టైమ్ కొనసాగుతున్నప్పుడు మీరు దేనికీ అర్హులు కాదని మీరు భావిస్తారు, మీ కంటే ఇతరులు గొప్పవారని భావిస్తారు, కానీ కాదు.. మీదైన సమయం వస్తుంది, అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్