Respiratory Health: దగ్గు, జలుబు, ఆయాసం వంటివి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ వీటిని తినండి-respiratory health eat these every day to avoid cough cold and fatigue ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Respiratory Health: దగ్గు, జలుబు, ఆయాసం వంటివి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ వీటిని తినండి

Respiratory Health: దగ్గు, జలుబు, ఆయాసం వంటివి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ వీటిని తినండి

Haritha Chappa HT Telugu
Mar 02, 2024 08:29 AM IST

Respiratory Health: దగ్గు, జలుబు, ఆయాసం వంటివి శ్వాసకోశ సమస్యలు. అలాంటివి రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్వాసకోశ ఆరోగ్యానికి ఏం తినాలి?
శ్వాసకోశ ఆరోగ్యానికి ఏం తినాలి? (pixabay)

Respiratory Health: వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం పెరిగిపోతోంది. కొందరికి తరచూ జలుబు, దగ్గు, ఆయాసం, ఆస్తమా వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని వాయు కాలుష్యం చాలా మేరకు చెడగొడుతుంది. కొన్ని రకాల ఆహారాలను ప్రతిరోజూ తినడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థకు శక్తిని అందించవచ్చు.

పసుపు

పసుపును ప్రతిరోజూ వంటల్లో ఉపయోగించమని చెబుతారు వైద్యులు. ఇది కర్కుమిన్ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు పసుపు బలాన్ని ఇస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోండి. లేదా పసుపు పాలను తాగేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని పాలలో కాస్త పసుపు వేసుకొని తాగితే సరిపోతుంది.

అల్లం

ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన ఆహారం. దీనిలో జింజేరోల్, షోగోల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే ఊపిరితిత్తుల్లో చేరుకున్న కఫాన్ని విచ్ఛిన్నం చేయడానికి, శ్వాసను సులభంగా ఆడేలా చేయడానికి ఉపయోగపడుతుంది. అల్లం టీ తాగడం లేదా భోజనంలో అల్లం ఉండేలా చూసుకోవడం ద్వారా అల్లంలోని ప్రయోజనాలను పొందవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి చేసే మేలు ఇంత అంతా కాదు. ఇది మన శ్వాసకోశ ఆరోగ్యానికి ఎంతో సాయం చేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అలాగే అల్లిసన్, సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి ప్రతిరోజూ తినే వారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. కఫాన్ని ఊపిరితిత్తుల నుండి బయటకు పంపించేందుకు ఇది సహాయపడుతుంది.

నల్ల మిరియాలు

ఘాటుగా ఉండే నల్ల మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గోరువెచ్చని పాలపై నల్ల మిరియాల పొడి చల్లుకొని కలుపుకొని తాగితే మంచిది. దీనిలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శ్వాసనాళాల్లో పేర్కొన్న కఫాన్ని తొలగిస్తుంది. ఈ మిరియాల్లో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. సూపులు, టీలు, పాలల్లో చిటికెడు మిరియాల పొడి వేసుకొని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

ఒరేగానో

పిజ్జాలతోపాటు చిన్న ఒరేగానో ప్యాకెట్ కూడా ఇస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే సమ్మేళనాలు యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను చూపిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే శక్తిని శ్వాసకోశ వ్యవస్థకి ఇస్తుంది. కాబట్టి వంటలలో తాజా ఒరెగానానో వేసుకోవడం మంచిది.

పైన చెప్పిన ఆహారాలలో కనీసం రెండింటినీ ప్రతి రోజూ తింటూ ఉండండి. ఉదయాన పాలల్లో పసుపు వేసుకుని తాగితే, సాయంత్రం అల్లం టీని చేసుకుని తాగండి. వంటల్లో కచ్చితంగా పసుపు పొడి వేసుకోవడం మర్చిపోవద్దు. నల్ల మిరియాలు పొడి చేసి ఇంట్లో పెట్టుకోండి. కిచిడీలు,కూరలు, బిర్యానీలలో కచ్చితంగా చల్లుకుని తినండి.

Whats_app_banner