Ramadan 2024 : రంజాన్ ఉపవాస సమయంలో యాక్టివ్‌గా ఉండేందుకు ఇలా చేయండి
Ramzan 2024 : ముస్లింలు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే రంజాన్ మాసం నడుస్తోంది. ఈ మాసంలో కఠినమైన ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. సూర్యోదయానికి ముందు తినే భోజనాన్ని సుహ్ర్ అని, సూర్యాస్తమయం తర్వాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు.
ఈ రంజాన్ ఉపవాసం నెల రోజుల వరకూ ఉంటుంది. ఈ రంజాన్ ఉపవాసాన్ని విరమించే పండుగ ఈద్ అల్-ఫితర్ అని పిలువబడే రంజాన్ పండుగ. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన, మంచి జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం మెుత్తం ఆరోగ్యాన్ని డిసైడే చేస్తుంది. శక్తివంతంగా ఉండేందుకు సాయపడుతుంది.
ఎందుకంటే ఇన్ని రోజులు బాగా తిని హఠాత్తుగా ఉపవాసం ప్రారంభించినప్పుడు మొదటి రెండు రోజులు కాస్త కష్టమే. శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోతే శరీరం విపరీతమైన అలసటకు గురవుతుంది. ఉపవాసం మొదటి లేదా రెండు రోజులు శరీరానికి ఎక్కువ పని చేయకుండా విశ్రాంతి ఇవ్వడం ద్వారా శరీర శక్తిని నిర్వహించవచ్చు. ఇలా ఒకట్రెండు రోజులు చేస్తే శరీరం కొత్త రొటీన్‌కి తగ్గట్టుగా మారుతుంది. మీరు ఉపవాసానికి ముందు కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీర శక్తిని కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం..
పాలతోపాటుగా ఇవి తీసుకోండి
పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాలలో బాదం, పిస్తాలను కలుపుకొని తాగితే పాలలోని పోషకాలతో పాటు బాదం, పిస్తాలోని పోషకాలు కూడా లభిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఉపవాసం విరమించే ముందు ఈ పాలు తాగడం చాలా మంచిది.
ఖర్జూరం బెస్ట్ ఫుడ్
ఖర్జూరం రంజాన్ ఉపవాసం ముగింపులో తీసుకునే సాంప్రదాయక ఆహారం. ఈ ఖర్జూరాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే ఇందులో ఉండే నేచురల్ షుగర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. రంజాన్ ఉపవాస సమయంలో ఖర్జూర పండ్లను ఎక్కువగా తీసుకోవడం చాలా ఉత్తమం.
జీడిపప్పు
ఎండిన ఆప్రికాట్లు, ఎండిన ఎండుద్రాక్ష, ఎండిన జీడిపప్పులో సహజ చక్కెరలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రంజాన్ ఉపవాస సమయంలో వీటిని విరివిగా తీసుకుంటే శరీరంలోని శక్తి నిలకడగా ఉండి జీర్ణవ్యవస్థ పనితీరు ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చాలా సేపు మిమ్మల్ని నిండుగా ఉంచుతాయి. శక్తినిస్తాయి.
గింజలు తీసుకోండి
ఉపవాస సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. గింజలు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ కలిగి ఉంటాయి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు కలిపి తినండి. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా మారుతుంది.
పోషకాల లడ్డూ
రంజాన్ ఉపవాసంలో రోజంతా మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలనుకుంటే, ఖర్జూరం, గింజలు, డ్రై ఫ్రూట్స్‌తో పోషకమైన లడ్డూను తయారు చేసుకోవచ్చు. ఉపవాసం విరమించే ముందు, ఉపవాసం విరమించిన తర్వాత తినండి. ఇలా ఇందులోని పోషకాలు రోజంతా శరీరానికి కావాల్సిన శక్తిని అందించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.