Radish Paratha: ముల్లంగి పరోటా డయాబెటిస్ పేషెంట్లకు ఔషధంలాంటిది, తిని చూడండి
Radish Paratha: ముల్లంగి పేరు చెబితేనే ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడరు. దాని వాసన నచ్చదంటారు. నిజానికి ముల్లంగి పరోటా తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు అంతా మేలే జరుగుతుంది.
ముల్లంగిని ఇష్టంగా తినేవారి సంఖ్య చాలా తక్కువ. దీన్ని పప్పుచారులో, సాంబార్లో ముక్కలుగా వేసుకుంటారు కానీ ముల్లంగి కూరను తినేవారు అరుదుగా ఉన్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం ముల్లంగిని తరచూ తింటూ ఉండాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ పేషెంట్ల కోసం ఇక్కడ మేము ముల్లంగి పరోటా రెసిపీ ఇచ్చాము. ఇది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడంతోపాటు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. పైగా ముల్లంగి పరోటా చేయడం కూడా చాలా సులువు.
ముల్లంగి పరోటా రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి - రెండు కప్పులు
ముల్లంగి తురుము - ఒక కప్పు
నూనె - సరిపడినంత
కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర పొడి - అర స్పూను
ధనియాలు పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
ముల్లంగి పరోటా రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసుకోవాలి.
2. అందులోనే ఉప్పును, నూనెను కూడా వేసి కలుపుకోవాలి.
3. తర్వాత నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టేయాలి.
4. ఇప్పుడు ముల్లంగిని సన్నగా తురిమి నీళ్లలో వేయాలి.
6. ఆ నీళ్ల నుంచి ముల్లంగి తురుమును తీసి గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి.
7. ఆ గిన్నెలోనే పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
8. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
9. ఈ ముల్లంగి తురుమును మొత్తం అందులో వేసి కాసేపు వేయించుకోవాలి.
10. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
11. ఇప్పుడు గోధుమపిండి నుంచి చిన్న ముద్దను తీసి చపాతీలా వత్తి దాని మధ్యలో ముల్లంగి మిశ్రమాన్ని వేసి మళ్లీ మడత పెట్టేసి చపాతీలా ఒత్తుకోవాలి.
12. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ ముల్లంగి పరోటాను రెండు వైపులా కాల్చుకోవాలి.
13. అంతే టేస్టీ పరోటా రెడీ అయినట్టే. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది.
14. కేవలం డయాబెటిస్ పేషంట్లే కాదు ఎవరైనా కూడా దీన్ని తినవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముల్లంగి పరోటాను చికెన్ తో తిని చూడండి. రుచి అదిరిపోతుంది. అలాగే మాతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది.
ముల్లంగి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. అలాగే హై బీపీతో బాధపడుతున్న వారు కూడా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవలసిన అవసరం ఉంది. డయాబెటిస్ పేషెంట్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి ముల్లంగిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి అప్పుడప్పుడు ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకున్నందుకు ప్రయత్నించండి.
టాపిక్