Leptospirosis: పంజాబ్ సీఎంకు సోకిన లెప్టోస్పిరోసిస్, అలాంటి నీటిని తాకినా సోకే వ్యాధి-punjab cm bhagwant mann diagnosed with leptospirosis know symptoms and causes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leptospirosis: పంజాబ్ సీఎంకు సోకిన లెప్టోస్పిరోసిస్, అలాంటి నీటిని తాకినా సోకే వ్యాధి

Leptospirosis: పంజాబ్ సీఎంకు సోకిన లెప్టోస్పిరోసిస్, అలాంటి నీటిని తాకినా సోకే వ్యాధి

Koutik Pranaya Sree HT Telugu
Sep 29, 2024 07:00 PM IST

Leptospirosis: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, ఈ వ్యాధికి కారణాలేంటో తెల్సుకుందాం.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (HT_PRINT)

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు శనివారం లెప్టోస్పిరోసిస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 50 ఏళ్ల ఆప్ నేతకు ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇచ్చామని, ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. మనుషులకు, జంతువులకు వర్షాకాలంలోనే తరచుగా సోకే ఈ వ్యాధి గురించి తెల్సుకుందాం.

లెప్టోస్పిరోసిస్ ఎలా వస్తుంది?

జంతువుల మలంతో కలుషితమైన నీరు, మట్టి లేదా ఆహారాన్ని తాకితే ఈ వ్యాధి సోకుతుంది. ఆ బ్యాక్టీరియా చర్మం, శ్లేష్మ పొర ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి పేగులోకి చేరుకుంటుంది. తర్వాత రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల‌కు దారితీస్తుంది. దీనిని వీల్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు, ఇది సంక్లిష్టమైన లెప్టోస్పిరోసిస్ రకం. లెప్టోస్పిరోసిస్‌లో రెండు రకాలు ఉన్నాయి - ఇక్టెరిక్ లెప్టోస్పిరా (రోగికి కామెర్లు ఉంటాయి), అనిక్టెరిక్ లెప్టోస్పిరా (రోగికి కామెర్లు ఉండవు).

వర్షం నీటి నుంచి నడుస్తున్న పిల్లలు
వర్షం నీటి నుంచి నడుస్తున్న పిల్లలు (AP)

ఎలుకల మూత్రం:

ఇన్ఫెక్షన్ సోకిన ఎలుక మూత్రం కలుషితమైన వర్షపు నీటి ద్వారా చర్మాన్ని తాకినప్పుడు, లేదా ఏవైనా గాయాలు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు లెప్టోస్పిరోసిస్ రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

లెప్టోస్పిరోసిస్ లక్షణాలు ఏమిటి?

లెప్టోస్పిరోసిస్ ముఖ్య లక్షణాలు జ్వరం ఎక్కువగా ఉండటం, కండ్లకలక. అనిక్టెరిక్ లెప్టోస్పిరాలో రోగులకు మయాల్జియా (కండరాల నొప్పులు, నొప్పి), జ్వరం ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే కామెర్లు, మూత్రపిండాల సమస్యలు (మూత్రపిండాల వైఫల్యం) లేదా రక్తస్రావం డయాథెసిస్ (రక్తస్రావం) లాంటి లక్షణాలుంటాయి.

కొన్నిసార్లు పల్మనరీ హెమరేజ్ కూడా కనిపిస్తుంది. అంటే ఊపిరితిత్తులు, శ్వాసనాళం నుండి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. రక్తంతో కూడిన దగ్గు వస్తుంది. శ్వాసకోశ, మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారి తీయొచ్చు. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.

నివారణ చర్యలు:

లెప్టోస్పిరోసిస్ బారిన పడకుండా ఉండటానికి, మురికి వర్షపు నీటిలో నడవడం మానుకోవాలి. వర్షాకాలంలో గంబూట్స్ (పొడవుగా ఉండే షూ రకాలు) ధరించాలి. ఏదైనా గాయం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా శుభ్రం చేసుకున్నాకే పండ్లు, కూరగాయలను తినాలి. తగినంత నీరు త్రాగుతూ హైడ్రేటెడ్ గా ఉండాలి. ఇంటి సమీపంలో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.

లెప్టోస్పిరోసిస్ ఎంతకాలం ఉంటుంది:

లెప్టోస్పిరోసిస్ లక్షణాలు తేలికపాటివి అయితే, దాని లక్షణాలు కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటాయి. కానీ తీవ్రమైన లెప్టోస్పిరోసిస్ ఉంటే సుమారు రెండు వారాలు ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చు. తీవ్రమైన లెప్టోస్పిరోసిస్ నుండి పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుంది.

లెప్టోస్పిరోసిస్ అనేది బ్యాక్టీరియా వ్యాధి, ఇది చికిత్స చేయకపోతే అనేక సమస్యలను కలిగిస్తుంది. వీటిలో మూత్రపిండాలు దెబ్బతినడం, మెనింజైటిస్, కాలేయ వైఫల్యం, శ్వాసకోశ సమస్యలు, కామెర్లు, రక్తస్రావం లాంటివి ముఖ్య ఆరోగ్య సమస్యలు.

టాపిక్