Pre-Wedding Diet: పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా మెరిసిపోవాలంటే.. ఇవి తినండి..-pre wedding diet tips for beautiful skin and health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pre-wedding Diet: పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా మెరిసిపోవాలంటే.. ఇవి తినండి..

Pre-Wedding Diet: పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా మెరిసిపోవాలంటే.. ఇవి తినండి..

HT Telugu Desk HT Telugu
Sep 10, 2023 12:00 PM IST

Pre-Wedding Diet: పెళ్లికి కొద్దిరోజుల ముందు తీసుకునే ఆహారం వల్ల చర్మం ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. పెళ్లి రోజు మెరిసిపోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

చర్మ సౌందర్యం పెంచే ఆహారాలు
చర్మ సౌందర్యం పెంచే ఆహారాలు (pexels)

పెళ్లి రోజు చర్మం మెరిసిపోవాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా కాబోయే పెళ్లి కూతురా? అయితే ఆహారంలో జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ముందు నుంచీ ఆహారం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా మెరిసిపోవచ్చు. అందుకు ఏమేం చేయాలో తెలుసుకోండి.

భోజనం రంగుల మయంగా ఉండాలి :

మీరు భోజనం చేయాలనుకున్న కంచం కలర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే దాంట్లో తెలుపు, ఎరుపు, పచ్చ, పసుపు.. ఇలా అన్ని రంగుల కూరగాయలూ, ఆహార పదార్థాలూ ఉండాలి. సరళమైన పిండి పదార్థాల్ని తినడం తగ్గించండి. బదులుగా పొట్టుతో ఉన్న బియ్యం, రాగులు, ఓట్స్‌, లాంటివి తీసుకోండి. భోజనంతోపాటు ఎక్కువ ప్రొటీన్‌లు ఉండేలా చూసుకోండి. శనగలు, రాజ్మా, బఠాణీలు లాంటి వాటిని ఉడికించి ఓ చిన్న గిన్నెడు తీసుకోండి. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలనూ భోజనం ద్వారా అందించినట్లు అవుతుంది. తెల్లగా ఉండే మైదా, తెల్ల బియ్యం, పంచదార వంటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి.

నట్స్‌ తినండి :

చర్మం నిగారింపుతో ఉండాలంటే శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అందుకోసం నట్స్‌ తినండి. బాదం, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్‌.. లాంటి వాటిని తీసుకోండి. వీటిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అవి మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాయి.

ఎక్కువ నీటిని తాగండి :

పెళ్లి పనుల్లో, షాపింగుల్లో ఎంత బిజీ బిజీగా ఉన్నా సరే. శరీరానికి సరిపడా నీటిని తాగడం మాత్రం తప్పనిసరి. రోజుకు రెండు, మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగండి. బయట తిరుగుతూ ఉంటే గనుక మూడు వాటర్‌ బాటిళ్లను నింపి పెట్టుకోండి. మీతో పాటూ పట్టుకెళ్లండి. సాయంత్రానికల్లా అన్నీ ఖాళీ చేసేయండి. నీరు తాగడం కష్టం అయితే కొబ్బరి బొండం నీళ్లు, చెరుకురసం, నిమ్మకాయ నీళ్లు, నీటి శాతం ఎక్కువ ఉన్న పళ్లను తీసుకోండి. దీని వల్ల శరీరం లోపలి నుంచి శుభ్రపడుతుంది.

ఫ్రూట్‌, వెజిటెబుల్‌ సలాడ్లు :

వండినవి తినడం కంటే తాజా కాయగూరలు, పండ్లను తినడం వల్ల చర్మం ఎక్కువ కాంతివంతంగా అవుతుంది. బీట్‌రూట్‌లు, క్యారెట్లు, టమోటా, స్ట్రాబెరీ, దానిమ్మ.. లాంటి వాటిని రోజూ సలాడ్ల రూపంలో స్నాక్స్‌ టైంలో తినండి. వీటన్నింటినీ తింటూ ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మీరు పెళ్లి పీటలపై బంగారు బొమ్మలా మెరిసిపోతారు.

Whats_app_banner