Postpartum Health । ప్రసవానంతరం బాలింత ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, సంరక్షణ చర్యలు!
Postpartum Health: డెలివరీ తర్వాత ఆ తల్లి కోలుకోవడానికి కొంత సమయం కావాలి, ప్రసవం తర్వాత బాలింత స్త్రీ ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు, ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
Postpartum Health: పెళ్లి తర్వాత ఒక స్త్రీ జీవితంలో గర్భందాల్చడం అనేది ఆమెకు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి సంతోషాన్ని కలిగించే సందర్భం. అయితే గర్భాధారణతో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గర్భందాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు, ప్రసవానంతరం కూడా ఈ మార్పులు కొనసాగుతాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి అనేక శారీరక, మానసిక లక్షణాలలో మార్పును కలిగి ఉంటారు. బిడ్డకు పాలు అందించే ప్రక్రియలోనూ తల్లి శరీరం గణనీయమైన రూపాంతరం చెందుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, డెలివరీ తర్వాత ఆ తల్లి కోలుకోవడానికి కొంత సమయం కావాలి, ముఖ్యంగా మొదటిసారి తల్లిగా మారినవారు వారి శరీరంలో జరిగే మార్పులను సర్దుబాటు చేయడానికి కష్టపడతారు. బాలింత ఆరోగ్యం, డెలివరీ అయిన విధానాన్ని బట్టి రికవరీ పీరియడ్ ఒక్కో కేసుకు మారుతూ ఉంటుంది. కొందరు రోజుల వ్యవధిలోనే కోలుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి కొన్ని వారాలు, నెలలు పడుతుంది.
ప్రసవం తర్వాత బాలింత స్త్రీ ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు, ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
బలహీనత
డెలివరీ సమయంలో చాలా రక్తాన్ని కోల్పోవడం వల్ల, స్త్రీ చాలా బలహీనంగా మారుతుంది. ఆమెలో నీరసం, అలసట ఉంటాయి. ప్రసవించిన తర్వాత బాలింతలు తమ శరీరంలో ఇనుము లోపాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వారికి బలవర్ధకమైన ఆహారం అవసరం అవుతుంది. మెత్తటి మటన్, తృణధాన్యాలు, బీన్స్, కాయధాన్యాలు, ఆకు కూరలు ఆహారంగా అందివ్వాలి. అలాగే విటమిన్లు, మినరల్స్ ముఖ్యంగా ఇనుము అధికంగా ఉండే ఆహారాలను అందివ్వడం ద్వారా వారి శరీరంలో రక్తం స్థాయిలను పెంచడానికి సాధ్యమవుతుంది.
ఉబ్బిన శరీర భాగాలు
ప్రసవం సాధారణమైనదా? లేక సి-సెక్షన్ ద్వారా ప్రసవం జరిగిందా అనే ఆధారంగా శరీరంలో మార్పులు ఉంటాయి. సాధారణ ప్రసవం అయితే యోని ప్రాంతంలో గాయం అవుతుంది, సి-సెక్షన్ అయితే బొడ్డు భాగంలో కోత ఉంటుంది. ఈ ప్రకారంగా ఆయా శరీర భాగాలలో వాపు ఉండవచ్చు. అయితే కొన్ని వారాలలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి.
హార్మోన్ హెచ్చుతగ్గులు
హార్మోన్ హెచ్చుతగ్గులు
ప్రసవం తర్వాత, తల్లి శరీరం హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుంది. ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి, దీనివలన వారిలో ఒకరకమైన ఆందోళన ఉంటుంది. మానసిక కల్లోలం, ఆందోళన, చిరాకు వంటివి కొత్తగా తల్లి అయిన వారు ఎదుర్కొనే ఒక సమస్య.
ప్రసవానంతర రక్తస్రావం
ప్రసవానంతరం లోచియా అని పిలిచే ఉత్సర్గ ఉంటుంది. ఇది ఋతుచక్రాన్ని పోలి ఉంటుంది. ఇంతకాలం పీరియడ్స్ రాలేవు కాబట్టి, ఇప్పుడు మళ్లీ మొదలయ్యే సందర్భం ఇది. డెలివరీ తర్వాత నాలుగు లేదా ఆరు వారాల వరకు ఈ రక్తస్రావం ఉండవచ్చు. ఇది ప్రతీ బాలింత ఎదుర్కొనే అత్యంత సాధారణ లక్షణం. ఈ ఉత్సర్గలో రక్తంతో పాటు, శ్లేష్మం, గర్భాశయ కణజాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.
మలబద్ధకం
ప్రసవం తర్వాత వివిధ రకాల శారీరక, మానసిక మార్పులు, వీటి వలన కలిగే ఒత్తిడి కారణంగా మలబద్ధకం సమస్య, మూత్ర విసర్జన సమస్యలు ఉండవచ్చు.
ప్రసవానంతరం బాలింతకు సరైన సంరక్షణ అవసరం. ఆమెకు మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి సరైన వాతావరణం కల్పించాలి. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే వైద్య సహాయం పొందాలి.
సంబంధిత కథనం