Atukula Snacks: పోహా బైట్స్, పిల్లల కోసం అటుకులతో చేసే టేస్టీ స్నాక్స్ ఇవి, కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి-poha bites with atukulu recipe in telugu know how to make this snacks recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Atukula Snacks: పోహా బైట్స్, పిల్లల కోసం అటుకులతో చేసే టేస్టీ స్నాక్స్ ఇవి, కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి

Atukula Snacks: పోహా బైట్స్, పిల్లల కోసం అటుకులతో చేసే టేస్టీ స్నాక్స్ ఇవి, కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి

Haritha Chappa HT Telugu
Published Sep 12, 2024 03:30 PM IST

Atukula Snacks: అటుకులతో చేసే ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక్కడ మేము పోహా బైట్స్ ఇచ్చాము. వీటిని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. రెసిపీ తెలుసుకోండి.

అటుకుల స్నాక్స్ రెసిపీ
అటుకుల స్నాక్స్ రెసిపీ

Atukula Snacks: అటుకులతో చేసే వంటకాలు ఆకలిని తీరుస్తాయి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ గా పోహా బైట్స్ పెట్టి చూడండి. ఇవి వారికి శక్తితో పాటు రుచిని కూడా అందిస్తాయి. వీటిని చేయడం చాలా సులువు. అటుకులతో చేసే పోహా బైట్స్ స్నాక్స్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పోహా బైట్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు

అటుకులు - ఒక కప్పు

ఉప్మా రవ్వ - ముప్పావు కప్పు

పెరుగు - అర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

నూనె - రెండు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

నువ్వులు - ఒక స్పూను

పచ్చిమిర్చి - నాలుగు

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

కారం - అర స్పూను

అటుకులతో చేసే పోహా బైట్స్ రెసిపీ

1. అటుకులను ఒక గిన్నెలో వేసి నీరు వేసి నానబెట్టండి.

2. ఒక పది నిమిషాలు అలా వదిలేసి చేత్తోనే అటుకులను పిండి వేరే గిన్నెలో వేయండి.

3. ఆ గిన్నెలోనే ఉప్మా రవ్వ, పెరుగు కూడా వేసి బాగా కలపండి.

4. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోండి.

5. వాటిని చిన్నచిన్న వడల్లాగా చేత్తోనే ఒత్తుకొండి.

6. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలో వేసి ఉంచండి.

7. స్టవ్ మీద లోతైన కళాయి పెట్టి అందులో కొంచెం నీళ్లు వేయండి.

8. ఆ నీళ్లలో స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్ ను పెట్టండి.

9. ప్లేట్లో అటుకుల వడలను వేసి ఉంచండి. పైన మూత పెట్టి ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించండి.

10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

11. నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకులు, కారం, నువ్వులు వేసి వేయించండి.

12. అవి వేగాక ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న అటుకుల వడలను వేసి వేయించండి.

13. ఇవి అన్ని వైపులా బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించాక స్టవ్ ఆఫ్ చేసేయండి.

14. వీటిని కెచప్ తో తింటే రుచి అదిరిపోతాయి. పిల్లలకు బాగా నచ్చుతాయి.

బయట ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసే స్నాక్స్ కన్నా ఇలా ఇంట్లో ఆవిరి మీద ఉడికించిన పోహా బైట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. అటుకులు కూడా బియ్యంతోనే తయారవుతాయి. కాబట్టి వారికి శక్తి కూడా అందుతుంది. ఒకసారి చేసి చూడండి, మీకు పిల్లలకు ఎంతో బాగా నచ్చుతాయి.

Whats_app_banner