Oats Masala Vada: ఓట్స్ మసాలా వడ క్రిస్పీగా క్రంచీగా అదిరిపోతాయి, రెసిపీ ఇదిగో
Oats Masala Vada: శెనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పుతో చేసిన గారెలు తిని ఉంటారు. ఇప్పుడు ఓట్స్ తో చేసిన గారెలు తినండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ కూడా చాలా సులువు.
Oats Masala Vada: బరువు తగ్గే ప్రయాణంలో ఎక్కువ మంది తింటున్న ఆహారం ఓట్స్. ఓట్స్ గుండెజబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. ఇక్కడ మేము ఓట్స్ తో గారెలు ఎలా చేయాలో ఇచ్చాము. మీరు ఇంతవరకు శనగపప్పు గారెలు, పెసరపప్పు గారెలు లేదా మినపప్పు గారెలు తిని ఉంటారు. ఓట్స్ గారెలు కూడా తిని చూడండి. ఇవి చాలా బాగుంటాయి. టేస్టీగా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. పైగా ఓట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ఈ రెసిపీని కూడా అప్పుడప్పుడు మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
ఓట్స్ మసాలా వడ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ - ఒక కప్పు
పెరుగు - ముప్పావు కప్పు
బియ్యప్పిండి - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు
అల్లం తరుగు - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఓట్స్ మసాలా వడ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఓట్స్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి.
2. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.
3. ఆ పొడిని ఒక గిన్నెలో వేయాలి.
4. ఓట్స్ పొడిలోనే బియ్యప్పిండి, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
5. అందులోనే పెరుగును కూడా వేసి బాగా కలపాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఆ నూనెలో ఓట్స్ మిశ్రమాన్ని గారెల్లా వత్తుకొని వేసుకోవాలి.
9. రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని తీసి టిష్యూ పేపర్ పై వేస్తే అదనపు నూనెను పీల్చేస్తాయి.
10. దీన్ని పుదీనా చట్నీతో తింటే అదిరిపోతాయి. పిల్లలకు కూడా ఇవి ఎంతో నచ్చుతాయి.
11. మీకు కావాలనుకుంటే ఈ ఓట్స్ మిశ్రమంలో కొత్తిమీర తరుగును కూడా మిక్స్ చేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.
ఓట్స్ తో చేసిన ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటు, డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో ఓట్స్‌లోని పోషకాలు ముందుంటాయి. బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్‌తో గారెలు చేసుకుని తినండి. మీకు నచ్చడం ఖాయం. ఒక్కోసారి సాయంత్రం వేళ స్నాక్స్ గా కూడా వీటిని తినవచ్చు. ఓట్స్‌లో ఉన్న పోషకాలు గ్యాస్ట్రిక్ సమస్యలను, పొట్ట ఉబ్బరాన్ని, మలబద్ధకం వంటి ప్రాబ్లెమ్స్ ను దూరం చేస్తాయి. ఓట్స్ గారెలను చేయడం కూడా చాలా సులువు.