Pesara pappu pakodi: సాయంత్రం అవ్వగానే ఏదైనా తినాలనిపిస్తుంది. ఎక్కువ మంది బజ్జీలు, పునుకులు, పకోడీలు వైపే ఆలోచిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటివి తింటే ఎలా? ఒకసారి పెసరపప్పుతో పకోడీ చేసుకుని చూడండి. ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరపప్పు పకోడీని చాలా సులువుగా చేసేయొచ్చు పెసరపప్పు పకోడీ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు.
పెసరపప్పు - ఒక కప్పు
అటుకులు - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం తరుగు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - అరకప్పు
కారం - ఒక స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
శెనగపిండి - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
1. పెసరపప్పును ఒక గంట ముందే నానబెట్టుకోండి.
2. అలాగే అటుకులను కూడా ఓ పది నిమిషాలు ముందు నానబెట్టుకోండి.
3. ఇప్పుడు పెసరపప్పును గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బండి. అందులోనే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును కూడా వేసి మెత్తగా రుబ్బుకోండి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ మిశ్రమాన్ని వేయండి.
5. నీటిలో నానబెట్టిన అటుకులను కూడా చేత్తోనే మెత్తగా మెదపండి.
6. అటుకులను పెసరపప్పు మిశ్రమంలో కలిపేయండి.
7. అలాగే శనగపిండిని వేసి బాగా కలపండి.
8. రుచికి సరిపడా ఉప్పుని, జీలకర్ర పొడి, కారం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.
10. నూనె బాగా వేడెక్కాక ఈ పెసరపప్పు మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోండి.
11. ఇవి బంగారు రంగు వచ్చేవరకు ఉంచండి.
12. ఈ పకోడీలను గ్రీన్ చట్నీ, కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
13. ఇవి క్రిస్పీగా కూడా వస్తాయి. పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఒకసారి చేశారంటే మళ్ళీ చేయమని అడుగుతారు.
పెసరపప్పు వారానికోసారి తినడం చాలా అవసరం. దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, ఐరన్, జింక్, మాంగనీస్, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. అలాగే ఎన్నో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పెసరపప్పుతో ఏదో ఒక వంటకాలు చేసుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఒకసారి ఈ పెసరపప్పు పకోడీని కూడా ట్రై చేయండి. పిల్లలకు, పెద్దలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. పెసరపప్పును ముందుగానే పిండి చేసి పెట్టుకుంటే కేవలం అరగంటలోనే ఈ పకోడీ రెడీ అయిపోతుంది. శెనగిపిండిలాగే పెసరపిండిని ముందే పొడి చేసుకుని దాచుకుంటే పెసరపప్పుతో చేసే ఎన్నో రెసిపీలు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. నెలకు ఓసారి కిలో పెసరపప్పును పిండి చేసుకుని దాచుకుంటే బెటర్.