Pesarapappu Halwa Recipe: పెసరపప్పు హల్వా... ఇలా చేశారంటే నోరూరిపోతుంది-pesarapappu halwa recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarapappu Halwa Recipe: పెసరపప్పు హల్వా... ఇలా చేశారంటే నోరూరిపోతుంది

Pesarapappu Halwa Recipe: పెసరపప్పు హల్వా... ఇలా చేశారంటే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu

Pesarapappu Halwa Recipe: పెసరపప్పుతో చేసే హల్వా గురించి తక్కువ మందికే తెలుసు. దీని రెసిపీ చాలా సులువు.

పెసరపప్పు హల్వా రెసిపీ (unsplash)

Pesarapappu Halwa Recipe: పెసరపప్పుతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. పెసరట్లు, చంద్రకాంతలు, పెసరపప్పు కూర ఇవన్నీ కూడా ఎంతోమందికి ఫేవరెట్. పెసరపప్పుతో హల్వా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. పెసరపప్పు హల్వాను దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించవచ్చు. చాలా తక్కువ సమయంలోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. వంట రానివారు కూడా ఈ హల్వాను సులువుగా వండేయచ్చు. దీన్ని తినే కొద్ది నోరూరిపోతుంది. ఈ హల్వా ఇది ఎలా చేయాలో... దీని రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

పెసరపప్పు హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - పావు కిలో

పంచదార - ఒక కప్పు

కుంకుమ రేకులు - నాలుగు

ఫుడ్ కలర్ - చిటికెడు

యాలకుల పొడి - అర స్పూను

నీళ్లు - సరిపడినన్ని

నెయ్యి - ఒక కప్పు

డ్రై ఫ్రూట్స్ తరుగు - మూడు స్పూన్లు

ఉప్మా రవ్వ - ఒక స్పూను

పెసరపప్పు హల్వా రెసిపీ

1. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. తరువాత ఈ పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార నీళ్లు వేయాలి.

4. పంచదార కరిగిన తర్వాత కుంకుమపువ్వు నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను వేయాలి, లేదా చిటికెడు పసుపు రంగు ఫుడ్ కలర్ వేసిన చాలు.

5. అలాగే యాలకుల పొడిని వేసి ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.

6. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి వేయాలి.

7. నెయ్యి బాగా వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ తరుగును వేసి వేయించుకోవాలి. వాటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

8. ఇప్పుడు అందులో ఉప్మా రవ్వను వేసి వేయించాలి.

9. ఆ తర్వాత ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకున్న పెసరపప్పును వేసి కలపాలి.

10. దీన్ని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇది దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి.

11. తర్వాత ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమాన్ని ఇందులో వేసి మళ్లీ కలపాలి.

12. ఓ ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే హల్వా లాగా ఇది దగ్గరగా అవుతుంది.

13. పైన డ్రై ఫ్రూట్స్ తరుగును చల్లుకొని స్టవ్ కట్టేయాలి.

14. అంతే పెసరపప్పు హల్వా రెడీ అయిపోతుంది.

15. ఇందులో నెయ్యిని అధికంగా వాడాము, కాబట్టి ఘుమఘుమలాడిపోతుంది.

దీన్ని నైవేద్యంగాను, సాయంత్రం పూట స్నాక్స్ గా తినవచ్చు. ఎవరైనా అతిధులు ఇంటికి వచ్చినప్పుడు దీన్ని సర్వ్ చేస్తే బాగుంటుంది.