Parenting Tips : పిల్లల చర్మం విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేయకండి
Baby Skin Care : పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కానీ పెద్దలు చేసే కొన్ని తప్పులతో చర్మం పాడవుతుంది. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు పిల్లల చర్మానికి ఎక్కువగా ఉపయోగించకూడదు.
పిల్లల చర్మానికి ఏ ఉత్పత్తులు మంచివి? ఏవి వాడకూడదు అనే గందరగోళం తల్లిదండ్రులందరినీ వేధిస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తారు. ఇవి పిల్లల చర్మాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి.
పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సీజన్ మార్పులతో శిశువు చర్మం, శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కాలాన్ని బట్టి బిడ్డ చర్మాన్ని రక్షించడానికి చాలా మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తాం. వేసవి, వర్షాకాలంలో మీ శిశువు చర్మంపై అదనపు శ్రద్ధ వహించాలి.
వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులపై లేబుల్‌లను చదవకుండా తల్లిదండ్రులు తప్పు చేస్తారు. మార్కెట్‌లో లభించే అనేక ఉత్పత్తులలో సల్ఫేట్లు, పారాబెన్‌లు, థాలేట్స్ వంటి హానికరమైన పదార్థాలు తరచుగా కనిపిస్తాయి. ఉదాహరణకు చాలా షాంపూలలో సల్ఫేట్‌లు ఉంటాయి. ఇవి చర్మం దురద, అలర్జీ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, తల్లిదండ్రులు సహజమైన, హైపోఅలెర్జెనిక్ పదార్థాలతో శిశువు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ప్రమాదకరమైన రసాయనాలు పిల్లల సున్నితమైన చర్మం నుండి దూరంగా పెట్టాలి.
పిల్లలు ఉపయోగించే అనేక బ్రాండ్ల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కిడ్ ఫ్రెండ్లీ ట్యాగ్ తల్లిదండ్రులను నిజంగా ఫూల్స్ చేస్తున్నాయనే చెప్పాలి. యానిమేషన్లు, వైబ్రెంట్ ప్యాకేజింగ్ అనేది తల్లిదండ్రులు, పిల్లలను ఆకర్షించడానికి తయారీదారులు ఉపయోగించే చిట్కాలు. తల్లిదండ్రులు పిల్లల భద్రత కోసం ఉత్పత్తి లేబుల్‌లను జాగ్రత్తగా చదవాలి. వాటిపైన ఉన్న ఫొటోలను చూసి మోసపోకూడదు.
పిల్లల కోసం వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు, తల్లిదండ్రులు తరచుగా మార్కెటింగ్ వ్యూహాలకు గురవుతారు. కలర్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా కనిపించే ఉత్పత్తుల వైపు మొగ్గు చూపడం కంటే ఉత్పత్తులలోని పదార్థాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఉత్పత్తులలో ఉపయోగించే పదార్థాలను చూసి ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆకర్షణీయమైన ట్యాగ్ లైన్స్ ఉన్నంత మాత్రన అవి మంచి ప్రొడక్ట్స్ అని చెప్పలేం. తల్లిదండ్రులు తగిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడుకోవచ్చు.
ప్రతి శిశువు భిన్నంగా ఉంటారు. వారి శరీర నిర్మాణం, చర్మం, సున్నితత్వం స్థాయిలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి తల్లిదండ్రులు ప్రొడక్ట్ గురించి జాగ్రత్తగా చెక్ చేయాలి. ఈ విధంగా పిల్లల ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా వారి శ్రేయస్సును కాపాడుకోవచ్చు.
నేరుగా పిల్లలను ఉదయంపూట సూర్య కిరణాలు తగిలితే మంచిదని చెబుతారు. అయితే చలికాలంలో కాసేపు చూపిస్తే ఏం కాదు. కానీ చాలా సేపు మాత్రం సూర్య కిరణాలు పిల్లలపై పడేలా చేయెుద్దు. యూవీ రేడియేషన్ వారి లేత చర్మాన్ని తెబ్బతీసేలా చేస్తుంది. మెుదటి ఆరు నెలలు సూర్యరశ్మి పడేలా చేయకుండా నివారించాలి. బయటకు వెళ్తే.. మంచి సన్ స్క్రీన్ రాయాలి. గొడుకు తీసుకెళ్తే ఇంకా మంచిది.
మార్కెట్లో దొరికే రంగులు, సువాసనల ఉత్పత్తులను వాడకూడదు. అవి సురక్షితమైనవి కావు. సువాసన, కృత్రిమ రంగులు శిశువు చర్మానికి చికాకు కలిగిస్తాయి. దద్దర్లు వచ్చే అవకాశం ఉంది. బిగుతుగా ఉండే దుస్తులతో పిల్లలు చిరాకు పడతారు. గాలి సరిగా తగలదు. అందుకే వారికి దుస్తులు వదులుగా ఉండేలా వేయాలి.