Monsoon House Cleaning: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే.. ఇరుకిల్లు కూడా సువాసన భరితం..-tips to clean house in monsoon to make and look it fresh ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon House Cleaning: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే.. ఇరుకిల్లు కూడా సువాసన భరితం..

Monsoon House Cleaning: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే.. ఇరుకిల్లు కూడా సువాసన భరితం..

HT Telugu Desk HT Telugu
Sep 29, 2023 05:10 PM IST

Monsoon House Cleaning: వర్షాకాలంలో తడి బట్టల వల్ల వాసన, తేమ వల్ల కాస్త అపరిశుభ్రత.. ఇలా చాలా సమస్యలుంటాయి. వాటివల్ల ఇల్లు గందరగోళంగా ఉండొద్దంటే ఒక శుభ్రతా పద్ధతి పాటించండి.

వర్షాకాలంలో ఇంటి శుభ్రత
వర్షాకాలంలో ఇంటి శుభ్రత (pexels)

మిగిలిన కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల చెట్లు, వాతావరణం ఫ్రెష్‌గా అనిపిస్తాయి. కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ తడి అవుతూ ఉండటం వల్ల ఏదో అపరిశుభ్రంగా ఉన్న భావన వస్తూ ఉంటుంది. తేమ ఎక్కువుంటే సహజంగానే బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ఫంగస్‌ల్లాంటివి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీటికి తోడు దోమలు, ఈగలు, నత్తలు, పురుగుల్లాంటివీ ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. మరి వీటన్నింటినీ నివారిస్తూ వర్షాకాలంలో ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం రండి.

వర్షాకాలంలో ఇంటి శుభ్రత కోసం చిట్కాలు:

  • పాత ఇళ్లు, ముఖ్యంగా పెంకుటిల్లుల్లాంటి వాటిలో గోడలకూ తేమ వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని ఫ్లోరింగుల నుంచీ తడి పైకి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వారు డీ హ్యుమిడిఫయర్‌ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇది గదుల్లో ఎక్కువగా ఉన్న తేమను తీసివేస్తుంది. అదనంగా తడి ఎక్కడైనా ఉందనిపిస్తే ఒకసారి పొడి వస్త్రంతో తుడవడంగానీ, మాప్‌ గానీ చేసేసుకోవాలి.
  • తేమ ఉండటం వల్ల ఇంట్లో వాసన అంత తాజాగా అనిపించదు. అలాంటప్పుడు ఎయిర్ ఫ్రెషనర్లను ప్రయత్నించండి. అయితే సింథటిక్‌ రసాయనాలు ఉన్నవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటి వల్ల ప్రధానంగా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. వాటికి బదులుగా సహజ వాసనలతో ఉండే ఎసెన్షియల్‌ నూనెల్ని వాడి చూడండి. ఆ వాసనలు మీకు చాలా ప్రశాంతతను ఇస్తాయి. రాత్రి పూట ఈ నూనెలతో చేసే క్యాండిళ్లు వాడొచ్చు. లేదా గది మూలల్లో ఈ నూనెలో ముంచిన దూది ఉండను పెట్టొచ్చు.
  • సిలికా జెల్‌, యాక్టివేటెడ్‌ చార్ కోల్‌, బియ్యం లాంటి వాటిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి క్యాబినేట్‌లు, బీరువాలు, షూ ర్యాకుల్లాంటి వాటిలో వేసుకోండి. ఇవి వాటిల్లో ఉన్న తేమను పీలుస్తాయి. ఫంగస్‌ల్లాంటివి పెరగకుండా చేస్తాయి.
  • వర్షం వస్తున్నప్పుడు తలుపులు వేసేసుకున్నా ఫర్వాలేదు గానీ తర్వాత తలుపులు, కిటికీలను తెరిచి పెట్టండి. పరదాలను పక్కకు జరపండి. గాలి, వెలుతురు ఎక్కువగా ఇంట్లోకి ధారాళంగా వచ్చేలా చూసుకోండి. ఇల్లంతా ఎక్కువ చెమ్మ అనిపిస్తుంటే ఫ్యాన్లను వేసుకోండి.
  • ఇంట్లో ప్రధానంగా వంటిల్లు, బాత్రూముల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల వాసన వస్తోంది అనిపిస్తే గనుక ఎగ్జాస్ట్‌ ఫ్యానులు ఉంటే వేసుకోండి. ఇవి చెడు వాసనను బయటకు పంపించి వేస్తాయి. అలాగే వంటింటిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
  • మురికి నీరు వెళ్లే డ్రైన్‌లను శుభ్రం చేసుకుని నీరు ఏ అడ్డంకీ లేకుండా వెళ్లిపోయేలా చూసుకోండి. లేకపోతే వర్షం నీరు నిలిచిపోవడం, దోమల్లాంటివి పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
  • అలాగే ఇంట్లో డస్ట్‌ బిన్‌లను ఏ రోజుకారోజు శుభ్రం చేసుకోండి. లేదంటే పురుగులు, దుర్వాసనలు వస్తాయి. ఈ టిప్స్‌ అన్నీ పాటించడం వల్ల మీ ఇల్లు వర్షాకాలంలోనూ తాజాగా అనిపిస్తుంది.

Whats_app_banner