Bathroom cleaning tips: బాత్రూమ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..
Bathroom cleaning tips: బాత్రూం సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే దుర్గందం వస్తుంది. దాన్నుంచి సుగంధాలు వెదజల్లాలంటే మంచి చిట్కాలున్నాయి. అవేంటో చూసేయండి.
ఇళ్లంతా శుభ్రం చేయడం ఒక ఎత్తయితే బాత్రూమ్‌ని శుభ్రం చేయడం ఒక ఎత్తు. అప్పుడప్పుడూ కడుగుతూ ఉన్నప్పటికీ ఎప్పుడూ తేమగా ఉండటం వల్ల దుర్వాసన వస్తుంటుంది. అందువల్ల పరిసరాల్లో వాతావరణం ఆహ్లాదభరితంగా ఉండకుండా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి దీన్ని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచే క్లీనింగ్ ఐడియాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి.
రోజూ శుభ్రం చేయాల్సిందే :
బాత్రూమ్ ఫ్లోర్, సింకుల్లో ఎప్పుడూ తడి తగులుతూ ఉండటం వల్ల అక్కడ ఎక్కువగా బ్యాక్టీరియా చేరిపోయి దుర్వాసన కలిగిస్తూ ఉంటాయి. అందుకనే ఈ గదిని మాత్రం ఉదయపు స్నానాలు పూర్తయ్యేప్పుడు ఒకసారి బాత్రూమ్ క్లీనర్ వేసి శుభ్రం చేసుకోవాలి. అందువల్ల అక్కడ సూక్ష్మ జీవులు తగ్గి వాసన రాకుండా ఉంటుంది.
గాలీ వెలుతురూ ధారాళంగా:
ఈ గదికి గాలీ, వెలుతురూ ధారాళంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఉపయోగించని సమయంలో కిటికీలు, తలుపులు తెరిచిపెట్టడం వల్ల అక్కడున్న తేమ తొందరగా ఆరిపోతుంది. మరి దీనికి కిటికీ సౌలభ్యం లేకపోతే ఫ్యాన్ పెట్టుకోవడం ఉత్తమం. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని పెట్టుకోవడమూ మంచి ఆలోచన అనే చెప్పాలి. ఎప్పుడైనా దుర్వాసన వస్తుంది అనుకున్నప్పుడు ఎగ్జాస్ట్‌ని ఆన్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
తడి బట్టల్ని వదిలేయకండి:
కొందరు స్నానం చేసిన తర్వాత విడిచిన దుస్తుల్ని అక్కడే వదిలేస్తారు. తుడుచుకున్న తడి తువాలునూ అలాగే ఉంచేస్తారు. ఇలా సగం తడిచిన దుస్తులు అక్కడ ఉంటే కచ్చితంగా చెడ్డ వాసన వస్తుంది. బాత్రూమ్‌కి సంబంధించిన వాసననూ అవి లాక్కుని అలాంటి వాసన వేస్తాయి. అందుకనే ఈ పరిసరాల్లో దుస్తులు, తువాళ్లు లేకుండా తీసివేయండి.
డ్రైన్ సరిగ్గా ఉందో లేదో చూడండి :
బాత్రూమ్ డ్రైన్ ఎలాంటి అడ్డంకులూ లేకుండా సజావుగా నీరు వెళ్లడానికి వీలుగా ఉందో లేదో ఎప్పటికప్పుడు సరి చూసుకోండి. డ్రైన్ దగ్గర జుట్టు, మట్టి ఎక్కువగా చేరిపోతుంటాయి. అవి నీటిని వెళ్లనివ్వకుండా చేయడమే కాకుండా దుర్వాసనను కలిగిస్తాయి. కాబట్టి నీరు వెళ్లే డ్రైన్ దగ్గర జాలీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.
సుగంధ నూనెలు ప్రయత్నించండి:
బాత్రూమ్‌లు ఫ్రెష్‌గా ఉండేందుకు ఇప్పుడు మార్కెట్లో బోలెడు ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సింథటిక్ ఫ్రేగ్రెన్సులు ఉన్నవి కాకుండా వీలైతే ఎసెన్షియల్ నూనెల్ని అక్కడ ఓసారి స్ప్రే చేయండి. వీటి వల్ల పరిసరాలన్నీ ఆహ్లాదభరితంగా మారతాయి. ఈ నూనెల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఫంగస్‌లు, బ్యాక్టీరియాలను ఇవి పోగొడతాయి. ఈ నూనెలో ఓ దూది పింజను ముంచి దాన్ని బాత్రూమ్‌లో ఓ మూలన ఉంచండి. అందువల్ల మార్పును మీరే గమనిస్తారు.