Parenting Tips : పిల్లలు కార్టూన్లు ఎందుకు చూడకూడదో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి
Parenting Tips In Telugu : ఈ కాలంలో కార్టూన్లు చూడకుండా పిల్లలు ఉండటం లేదు. కానీ వీటిని ఎక్కువగా చూడటం అస్సలు మంచిది కాదు. ఈ విషయాన్ని కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.
కొన్ని సంవత్సరాల క్రితం చిన్న పిల్లలకు కార్టూన్లు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆదివారం వస్తే పంచతంత్రం అనే సీరియల్ చూసి ఎంజాయ్ చేసేవారు. అందులోనూ నీతి కథలు చెబుతూ ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో పిల్లల మైండ్ సెట్ మెుత్తం మారిపోయింది. అసలు తినాలంటే కార్టూన్లు, నిద్రపోవాలంటే కార్టూన్లు.. ఇవి లేకుండా వీరి జీవితం లేదన్నట్టుగా తయారైపోయింది. దురదృష్టకర విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
పిల్లలు మారం చేస్తే కార్టూన్లు పెట్టేస్తున్నారు. ఇది అస్సలు మచి పద్ధతి కాదు. కార్టూన్లు పిల్లల మనసుపై ప్రభావితం చూపిస్తాయి. వారి మానసిక ఆరోగ్యం బాగుండదు. కార్టూన్లు చూడటం వల్ల పిల్లలపై కలిగే చెడు ప్రభావాల గురించి కచ్చితంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
తల్లితండ్రులు ఇంట్లో పనిచేసినప్పుడు లేదా పిల్లలకు ఆహారం ఇచ్చినప్పుడు, వారు మొదట చేసే పని మొబైల్ ఫోన్లు, టీవీలో కార్టూన్లను ఆన్ చేయడం. అయితే ఇది పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
హింసను నేర్చుకోవచ్చు
హింసను వర్ణించే కార్టూన్లను చూడటం వలన పిల్లలు నిజ జీవితంలో కూడా హింసలో పాల్గొనేలా ఆలోచిస్తారు. వారు హింసను అనుభవించకుండా తప్పించుకోగలరనే తప్పుడు సమాచారం కారణంగా ఇలా జరుగుతుంది. అంతేకాదు.. అందులో గన్స్, బాంబులు పిల్లలను వేరే విధంగా ఆలోచిస్తాయి. అందుకే కొందరు పిల్లలు కాల్చేస్తా.. అది.. ఇది ఇంటూ మాట్లాడుతారు. పిల్లలు దానిని నేర్చుకుంటారు, తదనుగుణంగా హింసలో పాల్గొనే అవకాశం ఉంది.
చెడు ప్రవర్తన
ఉపాధ్యాయులు, పెద్దల పట్ల అసభ్యంగా లేదా అవిధేయంగా ప్రవర్తించే అనేక కార్టూన్‌లు ఉన్నాయి. పిల్లలు ఈ ప్రవర్తనను అనుకరిస్తూ చెడు ప్రవర్తనగా ఎదిగే అవకాశం ఉంది. వారి మానసిక స్థితిపై కార్టూన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
చెడు భాష నేర్చుకోవచ్చు
కార్టూన్లలో తరచుగా పిల్లలకు సరిపోని భాష ఉంటుంది. దీన్ని చూసే పిల్లలు కార్టూన్ల నుండి చెడు భాష నేర్చుకుని నిజ జీవితంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే భాషను బయట వాడుతారు. ఇది వారిని అందరి నుంచి వేరు చేసేలా చేస్తుంది.
వికృత ప్రవర్తన
సంఘ వ్యతిరేక ప్రవర్తనను ప్రోత్సహించే, పిల్లలకు తప్పుడు సందేశాలను అందించే అనేక కార్టూన్‌లు ఉన్నాయి. అవి మీ పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేయడమే కాకుండా పిల్లలు హింసాత్మకంగా కూడా పెరుగుతారు. వారి ప్రవర్తనలో మార్పు ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు
టీవీ లేదా మొబైల్ పట్టుకుని కార్టూన్లు చూడటం వల్ల నిశ్చల జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం, దృష్టి లోపం ఏర్పడుతుంది. టీవీ, ఫోన్ ఎక్కువగా చూస్తే కంటి సమస్యలు వస్తాయి.
బ్యాడ్ స్టోరీ క్యారెక్టర్ అనుకరణ
పిల్లలు సాధారణంగా వారికి ఇష్టమైన కార్టూన్ పాత్రలను అనుకరిస్తారు. ఎందుకంటే వారు వాటిని ఇష్టపడతారు. నిజ జీవితంలో వారిలా ఉండాలని కోరుకుంటారు. ఇది పిల్లలను తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. ఎక్కువగా చెడుకు ఆకర్శితులవుతారు.
వ్యసనపరులు అవుతారు
పిల్లలు కార్టూన్‌లను చూస్తుంటే వాటికి బానిసలుగా మారవచ్చు. ఇది వారి రోజువారీ కార్యకలాపాలు, బాధ్యతలు, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అంతెందుకు మీర ఒకసారి గమనించండి. ఒక్కోసారి పిల్లలను పిలిస్తే కూడా పలకరు. దీనికి కారణం వారు కార్టూన్లలో లీనమైపోవడం.